కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కోవిన్ యాప్- టీకా వేయించుకుంటే సర్టిఫికెట్- కేంద్రం ఏర్పాట్లు..
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్‌పై పూర్తి వివరాలు అందుబాటులో ఉంచేందుకు కోవిన్ పేరుతో కొత్త యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది. కేంద్రం అభివృద్ధి చేస్తున్న యాప్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులోకి తెస్తోంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రతీ వివరం తెలిసేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులోనే వ్యాక్సిన్ డోసుల పంపిణీ షెడ్యూల్ కూడా ఉంచబోతున్నారు. దీని ఆధారంగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉండబోతోంది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు...
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందనే అంచనాల నేపథ్యంలో దీని పంపిణీకి కేంద్రం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు ద్వారా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే కమిటీలు ఏర్పాటయ్యాయి. ఓసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా ఎవరెవరికి వ్యాక్సిన్ అందించాలనే దానిపైనా భారీ కసరత్తే జరుగుతోంది. ఇందుకోసం బాధితులను నాలుగు కేటగిరీలుగా విభజించి మొత్తం 30 కోట్ల మందికి ముందుగా టీకాలు వేయాలని కేంద్రం వ్యూహచన చేస్తోంది. వీరి గుర్తింపు కార్యక్రమం కూడా ఇప్పుడు చురుగ్గా సాగుతోంది.

వ్యాక్సిన్ వివరాలతో కోవిన్ యాప్...
క్షేత్రస్దాయిలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. అదే సమయంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు వీలుగా ఓ కొత్త యాప్‌ను కూడా కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. కోవిన్ పేరుతో రూపొందిస్తున్న ఈ యాప్‌ను ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నాయి. గతంలో కరోనా సమయంలో వైరస్ బాధితులను గుర్తించేందుకు ఆరోగ్యసేతు యాప్ ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు అదే తరహాలో కోవిన్ యాప్‌తో రోగుల గుర్తింపు, వైరస్ డోసుల వివరాలు, ఎక్కడెక్కడ లభిస్తుందే వివరాలను అందులో పొందుపర్చబోతున్నారు.

ఎప్పటికప్పుడు డేటా అప్లోడ్
క్షేత్రస్ధాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు నియమించిన అధికారులు వ్యాక్సిన్ స్టాక్, ఎంతమందికి టీకా వేశారు, పేర్లు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు వీలుగా కోవిన్ యాప్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. రియల్‌టైమ్‌లో అప్లోడ్ అయ్యే ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వాలు, బాధితులు కూడా సులువుగా వాస్తవ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుందని కేంద్రం చెబుతోంది. ఇందులో డోసుల షెడ్యూల్, స్టాట్ల వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ డేటాను ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ, ఆయుష్మాన్ భారత్ వంటి ఏజెన్సీలకు కూడా ఎంతో ఉపయోగపడనుంది.

వ్యాక్సిన్ వేయించుకున్నవారికి సర్టిఫికెట్..
కోవిన్ యాప్‌లో సమాచారం ఆధారంగా రోగులకు వ్యాక్సిన్ వేయించుకునే లభించడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుంది, డోసుల వివరాలేంటి, వ్యాక్సిన్ వల్ల లాభనష్టాలతో పాటు ఇతర వివరాలను కోవిన్ యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్నవారి వివరాలు కూడా యాప్‌లో ఉంటాయి. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కేంద్రం ఈ యాప్‌లోనే ఇమ్యూనైజేషన్ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తోంది. ఈ సర్టిఫికెట్‌ను డిజీ లాకర్ యాప్‌లో షేర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. దీని ఆధారంగా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వర్తించే అవకాశం కూడా లభిస్తుంది.