
కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై కేంద్రం కీలక నిర్ణయం-ఇక రెండు డోసుల మధ్య గ్యాప్ ఇదే
కరోనా నుంచి తప్పించుకునేందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇకపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిడోస్ వేయించుకున్న వారు 8-16 వారాల గ్యాప్ తో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రకటించింది.
వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల గ్యాప్ పై ఇవాళ ఓ ప్రకటన చేసింది. ఇందులో ఇకపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను గతంలోలా కాకుండా కేవలం 8-16 వారాల గ్యాప్ తో తీసుకోవచ్చని తెలిపింది. దీంతో రోగులకు కాస్త ఊరట దక్కినట్లయింది. ఎందుకంటే గతంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవాలంటే నెలల తరబడి వేసి ఉండాల్సిన పరిస్ధితి ఉండేది. కేంద్రం ఇప్పుడు నిబంధనలు సవరించడంతో ఇకపై రెండో డోస్ తక్కువ వ్యవధిలోనే తీసుకోవడానికి వీలు దొరకనుంది.

గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో వ్యాక్సిన్లపై చర్చ కూడా క్రమేపీ తగ్గుతోంది.అయితే వ్యాక్సిన్లపై ప్రయోగాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పటికే కోవిషీల్డ్ తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వీటిని నేరుగా అమ్ముతున్నారు.
అయితే కేంద్రం విధించిన నిబంధనల మేరకే జనం డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుంటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తోంది. దీంతో ఆస్పత్రులు కూడా కేంద్రం విధించిన నిబంధనల మేరకే డోసులు అందిస్తున్నాయి.