
షాకింగ్- 9 రాష్ట్రాల్లో కేసుల దర్యాప్తుకు నో ఎంట్రీ-రాజ్యసభలో కేంద్రం వెల్లడి
దేశవ్యాప్తంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐని వాడుకుంటూ ప్రత్యర్ధుల్ని బీజేపీ టార్గెట్ చేస్తున్న వేళ.. ఆయా పార్టీలు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నాయి. అసలు సీబీఐని తమ రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో కేంద్రానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
దేశంలో ఇలా సీబీఐని తమ రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న రాష్ట్రాల వివరాలను కేంద్రం ఇవాళ రాజ్యసభలో ప్రకటించింది. ఇందులో పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మిజోరం, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, కేరళ, జార్ఖండ్, మేఘాలయ కూడా ఉన్నాయి. ఇవన్నీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే. ఆయా రాష్ట్రాల్లో కేసుల్ని సీబీఐ దర్యాప్తు చేసేందుకు వీల్లేకుండా పోతోందని కేంద్రం ఇవాళ రాజ్యసభలో తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వక సమాధానం చెప్పారు.

గతంలో ఏపీలోనూ చంద్రబాబు అధికారంలో ఉండగా.. టీడీపీ ప్రభుత్వం సీబీఐ ఎంట్రీకి గతంలో ఉన్న సాధారణ అనుమతిని ఉపసంహరించుకుంది. అప్పట్లో అవినీతి కేసుల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చంద్రబాబును టార్గెట్ చేయొచ్చన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ స్ధానంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి సీబీఐకి అనుమతి లభించింది. అయితే వైసీపీ కోరుతున్న కేసుల్ని కూడా సీబీఐ దర్యాప్తు చేయకపోవడం విశేషం.