రెడీ అవుతోన్న చంద్రయాన్-3: ఇంకొద్ది రోజులే: ఈ సారి ఆర్బిటర్ లేకుండా: 4 కూడా
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మిషన్ మూన్ మరోసారి తెరపైకి వచ్చింది. మిషన్ మూన్‌లో భాగంగా చంద్రయాన్-3 ప్రాజెక్టు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చంద్రయాన్-3ని ప్రయోగించబోతోంది. చంద్రయాన్-2 తరహాలో ఇందులో ఈ సారి ఆర్బిటర్ ఉండదు. ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. వాటిని మోసుకుంటూ మరో ఆరు నెలల్లో నింగిలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రయాన్-2 మిగిల్చిన చేదు జ్ఙాపకాలను చెరిపేసుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ప్రాజెక్టును చేపట్టింది.

చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో లింక్..
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం వైపు దిగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో విఫలమైంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు దిగే సమయంలో గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో విక్రమ్ ల్యాండర్‌కు సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్ ల్యాండ్‌కు బదులుగా హార్డ్ ల్యాండ్‌కు గురైనట్లు ఇస్రో అంచనా వేసింది. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. దీనితో చంద్రయాన్-3ని అనుసంధానిస్తారు. అందుకే ఆర్బిటర్ లేకుండా ప్రయోగించబోతున్నారు.

ల్యాండర్, రోవర్ మాత్రమే..
మూన్ మిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. చంద్రయాన్-2కు ప్రత్యామ్నాయంగా ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొన్నారు. చంద్రుడి కక్ష్యలో తిరిగడానికి వీలుగా ఆర్బిటర్ ఉండబోదని స్పష్టం చేశారు. చందమామపై దిగడానికి అనువుగా ల్యాండర్, ఉపరితలంపై తిరుగాడటానికి ఉద్దేశించిన రోవర్ మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను అనుసంధానించుకునేలా తాజా ప్రాజెక్టును చేపట్టామని, వచ్చే ఏడాది చివరిలో మరో ప్రాజెక్టు కూడా ఉంటుందని తెలిపారు.

ధృవాల వైపు నీళ్లు, ఆక్సిజన్..
చంద్రయాన్-1 ఇచ్చిన సమాచారం ప్రకారం.. చంద్రుడి ధృవాల వద్ద తుప్పు లాంటి పదార్థాలు కనిపిస్తున్నాయని, ఆ ప్రాంతాల్లో ఇనుము మిశ్రమం అధికంగా గల శిలలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారని జితేంద్ర సింగ్ చెప్పారు. నీళ్లు, ఆక్సిజన్ ఉన్నప్పుడే తుప్పు ఏర్పడటానికి అవకాశం ఉందని అంచనా వేశారని అన్నారు. నీళ్లు, ఆక్సిజన్ ఉన్నాయనడానికి పూర్తి ఆధారాలే లేవని, వాటి గురించి తెలుసుకోవడానికే జాబిల్లి ధృవాలపై దృష్టిని కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. వాటి గురించి తెలుసుకోగలిగితే.. అంతరిక్ష ప్రయోగాల్లో మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టవుతుందని చెప్పారు.

షెడ్యూల్ ప్రకారమే.. గగన్‌యాన్
తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన గగన్‌యాన్‌కు కూడా సన్నాహాలు సాగుతున్నాయని జితేంద్ర సింగ్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల గగన్‌యాన్ ప్రాజెక్టులో కొంత జాప్యం చోటు చేసుకుందని అన్నారు. అయినప్పటికీ.. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళికల ప్రకారం.. నిర్ణీత సమయానికే ఆ ప్రాజెక్టును చేపట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఇస్రో శ్రమిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.