చిదంబరానికి షాక్: తీహార్ జైలులోనే: దక్కని బెయిల్! ఆ ఒక్క విషయంలో ఊరట
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఢిల్లీ న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడిగించింది న్యాయస్థానం, ఈ నెల 17వ తేదీ వరకు కస్డీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం కస్టడీని పొడిగించడం ఇది రెండోసారి. సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. కిందటి నెల 5వ తేదీన అరెస్టయిన చిదంబరం రిమాండ్ లో ఉంటున్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్డేట్స్: బెయిల్ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం

కస్టడీ రెండుసార్లు పొడిగింపు..
కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన కాలంలో 310 కోట్ల రూపాయల మొత్తాన్ని ఐఎన్ఎక్స్ మీడియాలో దుర్వినియోగం చేసినట్లు చిదంబరంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మొదట్లో న్యూఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో ఆయనను విచారించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కిందటి నెల 5వ తేదీన ఆయనను తీహార్ జైలుకు తరలించారు. అక్కడే రిమాండ్ లో ఉంచారు. అదే నెల 19వ తేదీన కస్టడీ ముగిసినప్పటికీ.. సీబీఐ అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు తొలిసారిగా ఆయన కస్టడీని ఈ నెల 3వ తేదీ (గురువారం) వరకు పొడిగించింది న్యాయస్థానం.

సరైన సమాచారాన్ని రాబట్టుకోవడానికే..
కస్టడీ ముగియడంతో ఈ మధ్యాహ్నం ఆయనను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం సమక్షానికి హాజరు పరిచారు. తాము మరిన్ని విషయాలను ఆయన నుంచి రాబట్టుకోవాల్సి ఉందని, కస్టడీని పొడిగించాలని సీబీఐ తరఫు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. చిదంబరం తరఫు న్యాయవాది సీబీఐ వాదనలతో విభేదించారు. ఇన్ని రోజులుగా ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నప్పటికీ.. ఒక్క కీలక సాక్ష్యాధారాన్ని కూడా సీబీఐ అధికారులు సాధించలేకపోయారని, రాజకీయ పరమైన కారణాలు, కక్షతోనే కేసును బనాయించినట్లు వాదించారు. ఆయన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఏకీభవించలేదు.

ఇంటి నుంచి భోజనానికి ఓకే..
సీబీఐ తరఫు న్యాయవాది కోరికను అంగీకరించారు. చిదంబరం కస్టడీని ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిచింది. ఫలితంగా- మరి కొంతకాలం పాటు చిదంబరం తీహార్ జైలులోనే గడపాల్సి రావడం ఖాయమైంది. తీహార్ జైలులో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని విచారించే ఏడో నంబర్ కాంప్లెక్స్ లోని అయిదో నంబర్ బారక్ లో చిదంబరాన్ని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇదిలావుండగా.. చిదంబరానికి ఇంటి నుంచి తెప్పించుకున్న భోజనాన్ని వడ్డించాలంటూ తోటి కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ ప్రత్యేకంగా వేసిన పిటీషన్ పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఒక్క విషయంలోనే చిదంబరానికి ఊరట లభించినట్టయింది.

సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బే
బెయిల్ మంజూరు చేసే విషయంలో చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బే తగిలింది. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని దీనికి సంబంధించిన పిటీషన్ పై వెంటనే విచారణ (అర్జంట్ లిస్టింగ్) చేపట్టాలంటూ కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం విచారణకు తీసుకుంది. ఆ వెంటనే ఈ పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పరిశీలనకు పంపించింది. ఫలితంగా- ఈ పిటీషన్ పై విచారణ చేపట్టడంలో మరి కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.