chidambaram agriculture narendra modi bjp telangana punjab haryana farmers protest parliament sessions చిదంబరం వ్యవసాయం నరేంద్ర మోదీ తెలంగాణ పంజాబ్ హర్యానా నిరసన politics
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఈ బిల్లులను వ్యతిరేకించాలన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దానికి ఇలాంటి రూపమిచ్చిందని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల కొనుగోలు,ప్రజా పంపిణీ వ్యవస్థ,ఆహార భద్రత తదితర అంశాలతో అప్పటి కాంగ్రెస్ మేనిఫెస్టోని రూపొందించామని... కానీ ఇందుకు పూర్తి విరుద్దంగా ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని విమర్శించారు.

మోదీ సర్కార్ కార్పోరేట్లకు లొంగిపోయింది...
తమ పార్టీ రైతులకు మేలు చేసే ఉద్దేశంతో అప్పటి మేనిఫెస్టోని రూపొందించిందని చిదంబరం అన్నారు. కానీ ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు,వ్యాపారులకు లొంగిపోయి రైతులను బలిచేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ రాజకీయ పార్టీ తాము రైతుల వైపు నిలవాలా లేక రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ వైపు నిలవాలా అన్నది తేల్చుకోవాలన్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(APMC) చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అప్పటి తమ మేనిఫెస్టోలో హామి ఇచ్చిందన్న బీజేపీ ఆరోపణలకు చిదంబరం కొట్టిపారేశారు.

ఒక్కో ఇటుక పేరుస్తూ నిర్మించిన వ్యవస్థ...
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇటుకను పేరుస్తూ ఆహార భద్రతా వ్యవస్థను,జాతీయ భద్రతా చట్టం 2013ను తీసుకొచ్చిందని చిదంబరం చెప్పారు. కనీస మద్దతు ధర,ఆహార ధాన్యాల కొనుగోలు,ప్రజా పంపిణీ వ్యవస్థ దీనికి మూడు మూల స్తంభాలని పేర్కొన్నారు. రైతులు, వివిధ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు వీలు కల్పించేలా, మార్కెట్లకు యాక్సెస్ కల్పించేలా తమ మేనిఫెస్టోలో హామి ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను తీసుకురావడానికి,స్వేచ్ఛగా మార్కెట్ చేయడానికి వీలుగా పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో సైతం తగిన మౌలిక సదుపాయాలతో మార్కెట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు.

కనీస మద్దతు ధర ప్రస్తావన ఎక్కడ...
'రైతులకు బహుళ మార్కెట్లు అందుబాటులో ఉండటంతో పాటు తమ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఛాయిస్ వారికే ఉండాలి. ఇవన్నీ నెరవేరితే ఏపీఎంసీ చట్టంలో తదనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఆ మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం కార్పోరేటర్లకు,వ్యాపారులకు లొంగిపోయింది. కొత్త వ్యవసాయ బిల్లుల్లో ఎక్కడా కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు. తమతో ఒప్పందం కుదుర్చుకునే రైతులకు ప్రైవేట్ వ్యాపారులు చెల్లించే ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉండకూడదని ఈ బిల్లుల్లో ఎలాంటి క్లాజ్ పొందుపరచలేదు.' అని చిదంబరం చెప్పుకొచ్చారు.

ప్రైవేట్ వ్యాపారులతో రైతులు పోరాడగలరా...?
రైతులకు ప్రత్యామ్నాయంగా బహుళ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురాకుండా ఈ బిల్లులు చట్టంగా మారితే ఇప్పుడున్న ఏకైక నియంత్రిత మార్కెట్ కూడా బలహీనపడుతుందని చిదంబరం అన్నారు. పంట ఉత్పత్తి అమ్మకాలకు సంబంధించి రైతులకు,ప్రైవేట్ వ్యాపారులకు మధ్య సమాన బేరసారాలకు అవకాశం కల్పించేలా ఈ చట్టం లేదన్నారు. దీంతో చిన్న,సన్నకారు రైతులు ప్రైవేట్ వ్యాపారుల దయ దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఒకవేళ ప్రైవేట్ వ్యాపారులతో రైతులకు ఏదైనా వివాదం తలెత్తితే వారిపై పోరాడేంత బలం రైతులకు ఉండదన్నారు.