చిదంబరంకు అస్వస్థత: ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు.
సోమవారం ఉదయం తొలుత ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వీఐపీ ప్రైవేట్ రూంలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం చిదంబరంను ఈడీ కార్యాలయానికి తరలించారు.
చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, చిదంబరం అనుచరులు మాత్రం ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అంటున్నారు.

కాగా, ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017, మే15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన చెస్ మెనేజ్మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతోపాటు మరికొందర్ని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది.
ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అధికారులను చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను తీహార్ జైలులో ఉంచి, విచారణ కొనసాగిస్తున్నారు. అదే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయడానికి తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ ఈడీ అధికారులు కొద్దిరోజుల కిందటే ప్రత్యేక న్యాయస్థానానికి పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. సోమవారం వాదనలను చేపట్టింది. చిదంబరం తరఫున కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు.చిదంబరాన్ని ఇదివరకే సీబీఐ అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తోందని, అలాంటప్పుడు అదే కేసులో ఈడీ ఎలా అరెస్టు చేస్తుందని వాదించారు.
40 రోజుల పాటు సీబీఐ అధికారులు చిదంబరాన్ని విచారిస్తున్నారని, రెండుసార్లు కస్టడీని పొడిగించారని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో చిదంబరం అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటిదాకా కూడా ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సేకరించలేకపోయారని కపిల్ సిబల్ వాదించారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!