భారత సైన్యానికి కీలకమైన స్థావరాలపై చైనా డేగకన్ను.. రాడార్ ఏర్పాటు .. యుద్ధ వ్యూహంలో చైనా ?
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. గ్యాల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత శాంతి చర్చల పేరుతో యుద్ధ వాతావరణం తగ్గినట్టే తగ్గి, మళ్ళీ క్రమంగా పెరుగుతోంది. చైనా తన దుర్భుద్ధి ని మరోసారి చూపిస్తోంది. చైనా భారత్ ల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి అధునాతనమైన జే-20 యుద్ధ విమానాలను మోహరించింది చైనా.అధునాతన జెట్ ఫైటర్ లను రంగంలోకి దిగడంతో చైనా యుద్ధ వ్యూహంలో ముందుకు వెళ్తున్నట్లుగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అధునాతన జెట్ ఫైటర్ లను ఎల్ఓసి వెంట మోహరించిన చైనా
సరిహద్దుకు సమీపంలో ఉన్న హోటన్ వైమానిక స్థావరంలో అధునాతన జే 20 యుద్ధవిమానాల తోపాటుగా జే 16, జే 8 యుద్ధ విమానాలను సైతం మోహరించి భారత్ ను దొంగ దెబ్బతీయాలని వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే డ్రాగన్ తమ డేగ కన్నుతో భారత సైన్య కదలికలపై నిఘా పెట్టింది. మొదట యుద్ధవిరమణ సంకేతాలిచ్చింది చైనా, తర్వాత పాంగాంగ్ త్సో ఫింగర్ ఫోర్ వద్ద వెనక్కు తగ్గకుండా మరోమారు భారత సైన్యం తో వివాదానికి దిగింది . దీంతో చైనా సైన్యానికి భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పింది.

భారత సైన్యానికి కీలకం అయిన ఆ రెండు ప్రాంతాలపై డ్రాగన్ నిఘా
మళ్లీ అప్పటినుండి కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం, రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
అయితే ప్రధానంగా చైనా అసోంలోని తేజ్ పూర్ ఎయిర్ బేస్ , క్షిపణి ప్రయోగాలు చేపట్టే ఒడిసాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ పై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది . భారత సైనిక సామర్థ్యానికి ఈ రెండూ ఆయువుపట్టు అని, ఇండియన్ మిలటరీకి ఇవి ఎంతో కీలకమని భావిస్తున్న చైనా తేజ్ పూర్ ఎయిర్ బేస్ పై నిఘా కోసం ఒక రాడార్ ను ఏర్పాటు చేసింది. మయన్మార్ సరిహద్దుకు అత్యంత చేరువలో యున్నాన్ ప్రావిన్స్ లో ఉన్న రుయిలీ కౌంటీ నుంచి చైనా భారత్ పై నిఘా పెట్టినట్లుగా సమాచారం.

రాడార్ ఫోకస్ ఇలా ? అబ్దుల్ కలాం ఐలాండ్ , తేజ్ పూర్ ఎయిర్ బేస్ వైపు
తేజ్ పూర్ వైమానిక దళ కేంద్రం చైనా సరిహద్దు నుండి 172 కిలోమీటర్లు, మయన్మార్ సరిహద్దు నుండి 146 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాడార్ మయన్మార్ సరిహద్దు నుండి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మోహరించబడింది. ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా 13 మీటర్ల వెడల్పును ప్రదర్శిస్తాయి, రాడార్ ఎక్కువగా రాడార్ సైట్ నుండి 1,150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం వైపుకు , అలాగే తేజ్ పూర్ ఎయిర్ బేస్ మీదకు ఫోకస్ చేస్తుంది .ఇది విమానాలను గుర్తించడంలో మరియు పర్యవేక్షించడంలోకావాల్సిన సమాచారాన్ని డ్రాగన్ కంట్రీకి అందిస్తుంది. .

రాడార్ ఏర్పాటు చేసి డేగకన్ను పెట్టిన చైనా
అబ్దుల్ కలాం ఐస్లాండ్ నుండి, తేజ్ పూర్ ఎయిర్ బేస్ నుండి రెండున్నర కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఏవైనా ఎగిరితే ఈ రాడార్ పసిగడుతుంది. చైనా చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ గమనిస్తున్న ఇండియన్ ఆర్మీ చైనా కు ధీటుగా సమాధానం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది.
ఒరిస్సాలోని బాలాసోర్ లో నిత్యం భారతీయ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంటారు .అటు అసోంలోని తేజ్ పూర్ నుండి సరిహద్దును పహారా కాస్తూ ఉంటారు. ఈ రెండు కీలక ప్రాంతాలపై నిఘా పెట్టిన డ్రాగన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

చైనాకు దీటుగా సమాధానం చెప్పే సన్నాహాల్లో ఇండియన్ ఆర్మీ
దీంతో చైనా డ్రాగన్ కంట్రీ చైనా ఎత్తుగడను ముందుగానే పసిగట్టిన ఇండియా సుఖోయ్ 30, మిగ్ 29 కె, పీ 18, సి 17 విమానాలతో పాటుగా అపాచీ, చినూక్ హెలికాప్టర్లను సరిహద్దుల్లో మోహరించి అలర్ట్ గా ఉంది. ఒకవేళ చైనా యుద్ధానికి వస్తే ధీటుగా సమాధానం చెప్పడం కోసం ఇండియా తన సన్నాహాల్లో తాను ఉంది. యుద్ధం వస్తే ఇప్పటికే చైనా మీద నిప్పులు చెరుగుతున్న దేశాలు ఇండియాకు అండగా నిలుస్తాయి.ఇక చైనా మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ సహాయం ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి .