చైనా ప్రీ-ప్లాన్డ్ గానే ఘర్షణలకు తెగబడిందా... తెర పైకి సంచలన విషయాలు...
భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి జూన్ 15న ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణకు సంబంధించి తాజాగా సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వన్ వ్యాలీలో ఘర్షణకు కాసేపటి ముందే పర్వతారోహకులను,మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్‌ను అక్కడ మోహరించినట్టు వెల్లడైంది. అంటే చైనా ప్రణాళిక ప్రకారమే గాల్వన్ వ్యాలీలో ఘర్షణలను ప్రేరేపించి... తర్వాతి పరిణామాల కోసం ముందుగానే సిద్దమైందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మిలీషియా టీమ్స్ మోహరింపు...
జూన్ 15 న మౌంట్ ఎవరెస్ట్ ఒలింపిక్ టార్చ్ రిలే జట్టు మాజీ సభ్యులు, మార్షల్ ఆర్ట్స్ క్లబ్ నుండి వచ్చిన ఫైటర్స్ సహా ఐదు కొత్త మిలీషియా విభాగాలను టిబెట్ రాజధాని లాసాలో మోహరించినట్టు చైనీస్ అధికారిక సైనిక వార్తాపత్రిక చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్ వెల్లడించింది. దానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా స్టేట్ మీడియాలో ప్రసారమయ్యాయి.

స్పష్టతనివ్వని టిబెట్ కమాండర్...
లాసాలో మౌంట్ ఎవరెస్ట్,మార్షల్ ఆర్ట్స్ టీమ్స్‌ను మోహరించడాన్ని బట్టి గాల్వన్ వ్యాలీలో ఘర్షణలు ప్రీ-ప్లాన్డ్‌గా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిబెట్ మిలటరీ కమాండర్ వాంగ్ హైజియాంగ్ మాట్లాడుతూ... 'దళాల మోహరింపు సైన్యాన్ని బలోపేతం చేయడంతో పాటు వేగంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంచుతుంది.' అన్నారు. అయితే సరిహద్దులో ఉద్రిక్తతలకు దీనితో సంబంధం ఉందా.. లేదా... అన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

వీక్లీ టాక్స్‌కి అంగీకారం....
తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను వీక్లీ టాక్స్ ద్వారా పరిష్కరించుకునేందుకు తాజాగా భారత్,చైనా అంగీకారం తెలిపాయి. మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోర్డినేషన్(WMCC) సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు. గత వారం నిర్వహించిన ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ తరహాలోనే ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది.

సైన్యం ఉపసంహరింపుకు కుదిరిన అవగాహన...
జూన్ 15న ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. 40 మంది చైనా సైనికులు కూడా మృతి చెందారని భారత్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం అధికారిక లెక్కలేవీ చెప్పలేదు. పైగా బంధీలుగా పట్టుకున్న భారత్ సైనికులను ఒప్పందం ప్రకారం కాకుండా.. కాస్త ఆలస్యంగా విడిచిపెట్టింది. ఆ ఘర్షణ జరిగిన రోజు నుంచి భారత్ శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో సరిహద్దులో సైన్యం ఉపసంహరింపుకు ఇరు దేశాల మధ్య అవగాహన కూడా కుదిరింది. అయితే ఈ ప్రక్రియ కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో.... సైన్యం ఉపసంహరింపుకు సంబంధించిన పద్దతులపై మున్ముందు చర్చలు జరపనున్నారు.