చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - ‘చుశూల్’ స్ట్రాటజీతో భారత్
ఒకదిక్కు శాంతి వచనాలు వల్లెవేస్తూ.. మరోవైపు కొత్త కొత్త పాయింట్లలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూ చైనా తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గత నాలుగు నెలలుగా ఉద్రిక్తలు కొనసాగుతుండటం తెలిసిందే. తొలుత గాల్వాన్ లోయలో, పాంగాంగ్ సరస్సు ఉత్తర దిక్కున ఉండే ఫింగర్ పాయింట్స్ వద్ద హిసాత్మక ఘర్షణకు దిగిన డ్రాగన్ సైన్యం.. ఆ తర్వాత దౌలత్ బేగ్ ఓల్డీలో కలకలం రేపి.. ఇటీవల పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. తాజాగా అది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును టార్గెట్ చేసుకున్నట్లు సైనిక వ్యవహారాల విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అరుణాచల్ బోర్డర్ సమీపంలో..
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోని దేశసరిహద్దుకు అతి సమీపంగా కొద్దిరోజులుగా చైనా భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మనవాళ్లు గుర్తించారు. సరిహద్దులో కీలక ప్రాంతాలైన అసాఫిలా, ట్యూటింగ్ యాక్సిస్, చాంగ్ టిజ్, ఫిష్ టైల్ -2 సెక్టార్లకు సమీపంగా డ్రాగన్ ఆర్మీ కదలికలికలు కనిపించాయి. ఆయా పాయింట్లలో ఆక్రమణలకు పాల్పడాలన్న లక్ష్యంతోనే చైనా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సైనిక, ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా ‘ఇండియా టుడే' ఓ కథనాన్ని రాసింది. మరోవైపు డోక్లాంలోనూ డ్రాగన్ సైన్యం హడావుడి క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.
లవ్ పేరుతో దగ్గరై సెక్స్ వీడియోలు - ఏడుగురు అమ్మాయిలకు నరకం - వ్యాపారి అకృత్యాలపై సిట్ ఏర్పాటు

చుశూల్ తరహాలో సమాయత్తం..
ఇప్పటిదాకా తూర్పు లదాక్ కేంద్రంగా సాగిన చైనా ఆగడాలు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకూ విస్తరించడం గమనార్హం. సరిహద్దు నుంచి చైనా భూభాగంలో 20 కిలోమీటర్ల మేర భారీ వాహనాలు, ఆయుధ సంపత్తి, సైనికుల కదలికలు ఉన్నట్లు భారత్ గుర్తించింది. చైనా కుయుక్తులను ముందే పసిగట్టిన భారత్.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోనూ ‘చుశూల్ స్ట్రాటజీ'అని అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. పాంగాగ్ సరస్సు దక్షిణ తీరంలోని చుశూల్ సెక్టార్ మనదే అయినా, వివాదరహిత ప్రాంతం కావడంతో అక్కడ మోహరింపులు ఉండేవికావు. అయితే చైనా బలగాలు అటుగా కదులుతున్నాయని తెలిసిన వెంటనే.. సెక్టార్ లోని హెల్మెంట్, బ్లాక్ టాప్, గురుంగ్ హిల్, మగర్ హిల్, రేజంగ్ లా, ముఖ్పరీ పర్వతాలపై భారత్ పట్టుబిగించింది. దీంతో చైనా ఆక్రమణకు అడ్డుకట్ట పడ్డట్లయింది. అరుణాచల్ సరిహద్దులోనూ ముందస్తుగానే మోహరింపులు పెంచినట్లు భారత అధికారులు పేర్కొన్నారు.
కరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీ

అరుణాచల్ చైనాదేనంటూ..
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ పై చైనా తీరు తొలి నుంచీ వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐదుగురు యువకుల్ని డ్రాగన్ సైన్యం కిడ్నాప్ చేసిన సందర్భంలోనూ.. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ భారత్ లో భాగంగా గుర్తించలేదని, అది దక్షిణ టిబెట్ లో అంతర్భాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వ్యాఖ్యానించారు. కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైనప్పటికీ, అరుణాచల్ సరిహద్దులో తాజా మోహరింపులు ఉద్రిక్తతలను ఇంకా ఏ స్థాయికి చేర్చుతాయో చూడాలి.