అరుణాచల్ లో చైనా గ్రామంపై క్లారిటీ-ఆరుదశాబ్దాల క్రితమే నిర్మాణం-భారత్ పై గెలిచాక
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో చైనా గ్రామం దర్శనమివ్వడం తాజాగా కలకలం రేపింది. అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగానే తమ వార్షిక నివేదికలో చైనా భారత్ సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ లో భారీ గ్రామం నిర్మించిందని పేర్కొంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. చైనా ఇంత పెద్ద గ్రామం నిర్మిస్తుంటే భారత్ ఏం చేస్తుందనే ప్రశ్నలూ తలెత్తాయి.
అయితే పెంటగాన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన భారత ఆర్మీ వర్గాలు తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చాయి. ఆ గ్రామం వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లేదని, చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో మాత్రమే ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే ఈ గ్రామం నిర్మాణం కూడా 1959లో భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో నిర్మించిందని క్లారిటీ ఇచ్చాయి. అస్సోం రైఫిల్స్ తో పోరులో విజయం సాధించాక దీన్ని చైనా నిర్మించినట్లు తెలుస్తోంది. భారత్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని అక్రమించిన చైనా అక్కడ ఈ గ్రామం తమ రక్షణ అవసరాల కోసం నిర్మించినట్లు అధికారులు చెప్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో ఇంత తక్కువ సమయంలో చైనా అంత పెద్ద గ్రామం నిర్మించే పరిస్ధితులు ప్రస్తుతం లేవని భద్రతా దళాల అధికారులు వెల్లడించారు. తాజాగా అమెరికా రక్షణ శాఖ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ ఇచ్చిన వార్షిక నివేదికలో భారత్ సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ లో టిబెట్ అటానమస్ ప్రాంతానికి సమీపంలో వంద ఇళ్లతో కూడిన పెద్ద గ్రామాన్ని చైనా నిర్మించినట్లు తెలిపింది. దీంతో కలకలం రేగింది. పెంటగాన్ నివేదిక నేపథ్యంలో భారత భద్రతా అధికారులు ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. భారత్-చైనా మధ్య పెరిగిన కవ్వింపుల్లో భాగంగా డ్రాగన్ దేశం తాజాగా దీన్ని నిర్మించలేదనేది ఆర్మీ వర్గాల వాదన.