నితీశ్‌కు చిరాగ్ పాశ్వాన్ భారీ దెబ్బ- మూడోస్ధానానికి పరిమితం- ఎల్జేపీ పోటీ పడకపోతే టాప్ ప్లేస్
హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎత్తుగడ ఫలించింది. ప్రతిసారీ తమ మద్దతుతో సీఎం పదవి తీసుకుంటున్న నితీశ్ కుమార్‌ను ఈసారి పక్కనబెట్టేందుకు కాషాయ పార్టీ ప్రయోగించిన పాశ్వాన్ అస్త్రం ఫలించింది. బీజేపీ కోరుకున్న విధంగానే పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి ఊహించిన దాని కంటే భారీ దెబ్బే కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక సీట్లతో మొదటి స్ధానం దక్కించుకోవాల్సిన జేడీయూ మూడోస్ధానానికి పరిమితం కాగా.. ఆ స్ధానాన్ని బీజేపీ ఆక్రమించింది. ఇప్పుడు నితీశ్ స్ధానంలో తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్ధిని ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది.
తగినన్ని సీట్లు లభించలేదనే కారణంతో సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్డీయేను వీడిన లోక్ జనశక్తి పార్టీ సొంతంగా 143 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ బీజేపీ మినహా ఇతర పక్షాలు పోటీ చేస్తున్న స్ధానాలే. వీటిలో ఓట్లు చీల్చడం ద్వారా నితీశ్‌ను దెబ్బతీసేందుకు లోక్‌జనశక్తి ప్రయత్నిస్తున్నా బీజేపీ నేతలు మాత్రం చూసీ చూడనట్లు వదిలేశారు. ఇప్పుడు ఆ ఓట్లే చాలా స్దానాల్లో ఫలితాలను నిర్ణయిస్తున్నాయి. ఇవాళ వెలువడుతున్న ఫలితాల్లో లోక్‌జనశక్తి కేవలం ఒకే స్ధానంలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ పలు స్ధానాల్లో జేడీయూ అభ్యర్ధులను దారుణంగా దెబ్బతీసినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

బీజేపీ గేమ్ ప్లాన్‌లో పావుగా మారిన లోక్‌జనశక్తి పార్టీ ఎన్నికల అనంతరం తిరిగి ఎన్డీయే పంచన చేరే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా లోక్‌జనశక్తి పార్టీని ఒంటరిగా బరిలోకి దింపడం ద్వారా బీజేపీ అనుకున్న దాని కంటే ఎక్కువగానే ఫలితాలను రాబట్టుకుంది. తద్వారా నితీశ్ ముందరి కాళ్లకు బంధం వేసే అవకాశాన్ని సాధించుకుంది. లోక్‌జనశక్తి పార్టీ కారణంగా ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న జేడీయూ అత్యధిక సీట్లు సాధించే అవకాశం కోల్పోయింది. తాజా ఫలితాలను గమనిస్తే బీజేపీ, ఆర్జేడీ తర్వాత జేడీయూ మూడో స్ధానంలో నిలిచిందంటే అందుకు కారణం చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తే.