Chopper crash: శౌర్య చక్ర గ్రహీత గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కు 45 శాతం గాయాలు; ఆరోగ్య పరిస్థితి ఇలా
బుధవారం నాడు జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ను కాపాడడం కోసం వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ 45 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని , అతని పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న అతని ప్రాణాధార పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

హెలికాఫ్టర్ క్రాష్ నుండి బయటపడిన ఒకే ఒక్కడు వరుణ్ సింగ్
విల్లింగ్టన్లోని మిలటరీ హాస్పిటల్ నుంచి బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ హాస్పిటల్‌కు ఆయనను తరలించాలని కోరినట్లు సమాచారం. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితిపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్లోని మిలటరీ ఆసుపత్రిలో లైఫ్ సపోర్ట్‌లో ఉన్నారని మరియు అతని ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరియు అతని భార్య మధులిక మరియు 11 మంది సాయుధ దళాల సిబ్బందితో సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో హెలికాఫ్టర్ లో పద్నాలుగు మంది ఉన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.

శౌర్య చక్ర అవార్డు పొందిన వరుణ్ సింగ్
ఈ సంవత్సరం ఆగస్ట్ 15న, అప్పటి వింగ్ కమాండర్ వరుణ్ సింగ్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) స్క్వాడ్రన్‌లో పైలట్‌గా పనిచేశాడు, అతని అసాధారణమైన శౌర్య పరాక్రమాలకు భారతదేశం యొక్క మూడవ అత్యున్నత శౌర్య పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రధానం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ చాలా ధైర్యసాహసాలు ఉన్న వ్యక్తని, గతంలో యుద్ధ విమానం ప్రమాదానికి గురైన సమయంలో అసాధారణమైన రీతిలో దానిపై పట్టు సాధించి, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నప్పటికీ యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించారని పేర్కొంది.

గతంలో యుద్ధ విమాన ప్రమాదాన్ని గుర్తించి ధైర్య సాహసాలు ప్రదర్శించిన వరుణ్ సింగ్
ప్రమాదం జరిగిన సమయంలో వరుణ్ సింగ్ సరిగ్గా వైఫల్యాన్ని గుర్తించారని, ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తుకు దిగడం ప్రారంభించారని . క్రిందికి దిగే సమయంలో, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ విఫలమైందని మరియు విమానం యొక్క నియంత్రణను పూర్తిగా కోల్పోయేలా చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ సాహసోపేతంగా వరుణ్ సింగ్ ప్రాణాంతక పరిస్థితిలో పైలెట్ అన్ని విడిచి పెట్టి వెళ్ళడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ, తన ప్రాణాలను పణంగా పెట్టి మరియు యుద్ధ విమానాన్ని కాపాడిన గొప్ప ధైర్యశాలి అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.

సూలూరు ఎయిర్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్ ఉన్న వరుణ్ సింగ్ యూపీ వాసి
వరుణ్ సింగ్ ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం, విపత్కర పరిస్థితుల్లో అతని మానసిక సంసిద్ధత, మరియు శీఘ్ర నిర్ణయం కారణంగా, అతను తన జీవితం ప్రమాదంలో ఉందని, LCA నష్టాన్ని నివారించడమే కాకుండా, పౌర ఆస్తులు మరియు జనాభాను కూడా రక్షించాడు అని ప్రకటన పేర్కొంది. వరుణ్ సింగ్ ప్రస్తుతం ప్రమాదం జరిగిన సూలూరు ఎయిర్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. బుధవారం బిపిన్ రావత్ ఇదే కాలేజీలో లెక్చర్లు ఇవ్వడానికి వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి వరుణ్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ధనోలి గ్రామానికి చెందిన వరుణ్ సింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ధనోలి గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.