• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సుప్రీంకోర్టు: విడిపోయిన భార్యాభర్తల్ని కలిపిన చీఫ్ జస్టిస్ రమణ - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|
సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణస్వీకారం

భార్యాభర్తల మధ్య 21 ఏండ్లుగా ఉన్న ఎడతెగని పంచాయితీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పరిష్కరించారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

భార్యా భర్తల కేసులో జస్టిస్ ఎన్‌వీ రమణ, వాద ప్రతివాదాలకు బదులు సూచనలు, సలహాలతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించేలా ఒప్పించారు.

పిటిషన్‌ దాఖలు చేసిన మహిళకు సులువుగా అర్థం అయ్యేందుకు, ఆమె తన అభిప్రాయాలను చెప్పేందుకు వీలుగా ఆయన తెలుగులో మాట్లాడారు. ఆమె చెప్పే మాటలను తోటి జడ్జికి అర్థమయ్యేలా ఇంగ్లిష్‌లోకి అనువదించి చెప్పారు.

బుధవారం సుప్రీంకోర్టులో ఈ అసాధారణ దృశ్యం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు 1998లో వివాహం కాగా, 2001లో విడిపోయారు. భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఏడాది జైలు శిక్ష పడింది. భర్త హైకోర్టుకు వెళ్లగా శిక్ష ఆరు నెలలు తగ్గించారు. దీనిపై భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాజాగా విచారణ సందర్భంగా భార్యాభర్తలిద్దరికీ జస్టిస్‌ రమణ నచ్చజెప్పారు. జైలుకెళ్తే ఉద్యోగం పోతుందని, అప్పుడు భరణం రాదని, ఏకైక కుమారుడి పోషణ ఇబ్బంది అవుతుందని వివరించారు. దీంతో మళ్లీ కలిసి ఉండటానికి భార్యభర్తలు ఇద్దరు అంగీకరించారు' అని చెప్పారని నమస్తే తెలంగాణ వివరించింది.

సైబర్ నేరం

హైకోర్టు మాజీ న్యాయమూర్తికే టోపీ

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికే సైబర్‌ నేరగాళ్లు టోపీ పెట్టారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

'హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వాడ రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. కరెంటు బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నామని అందులో పేర్కొన్నారు.

వెంటనే ఆయన ఆ మెసేజ్‌లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేశారు. బిల్లులు కట్టడం లేదని, అందుకే సరఫరాను నిలిపివేస్తున్నామని ఫోన్లో అవతలి వ్యక్తి చెప్పాడు.తాను బిల్లులు చెల్లిస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి బదులిచ్చారు. టీమ్‌ వీవర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దరఖాస్తు పూర్తి చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు.

దీంతో రాజగోపాల్‌రెడ్డి ఆ వ్యక్తి చెప్పిన విధంగా వివరాలను పొందుపర్చారు. ఆ తరువాత తన ఖాతాలో నుంచి రూ. 45,931 డ్రా అయ్యాయని ఆయనకు మెసేజ్‌ వచ్చింది. సైబర్‌ నేరగాళ్లు తనను మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు' అని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఆకాశ వీధిలో ఝున్‌ఝున్‌వాలా

దేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తాజాగా విమానయాన రంగంపై దృష్టి సారించారని, ఆకాశ ఎయిర్‌ పేరిట విమానయాన సంస్థను ప్రారంభిస్తున్నారని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

'పౌర విమానయాన శాఖ నుంచి దీనికి 15 రోజుల్లో అనుమతులు రావచ్చని ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. కొత్త ఎయిర్‌లైన్‌ కోసం నాలుగేళ్లలో దాదాపు 70 విమానాలను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు ఝున్‌ఝున్‌వాలా వివరించారు.

180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌క్రాఫ్ట్‌లను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశ ఎయిర్‌లో ఝున్‌ఝున్‌వాలా సుమారు 35 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నారు. ఆయనకు ఇందులో 40 శాతం వాటాలు ఉండనున్నాయి. అత్యంత చౌక చార్జీల విమానయాన సంస్థగా ఉండబోయే ఆకాశ ఎయిర్‌ టీమ్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌ సంస్థకి చెందిన మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా ఉన్నారు.

కరోనా వైరస్‌ కట్టడిపరమైన చర్యల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమానయాన సంస్థలు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఝున్‌ఝున్‌వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 2012లో మూతబడగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో దివాలా తీసింది. కొత్త యజమానుల సారథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఎగిరే ప్రయత్నాల్లో ఉంది. థర్డ్‌ వేవ్‌ ముప్పు కూడా పొంచి ఉండటంతో దేశీ విమానయాన సంస్థల రికవరీకి మరింత సమయం పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో కొత్త విమానాల డెలివరీని కూడా వాయిదా వేసుకునేందుకు విమానయాన సంస్థ విస్తార.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలోకి ఝున్‌ఝున్‌వాలా ఆరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. అయితే, 'దేశీయ విమానయాన రంగంలో డిమాండ్‌ విషయంలో నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను' అని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఫోర్బ్స్‌ మేగజీన్‌ తాజా గణాంకాల ప్రకారం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ సుమారు 4.6 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది' అని సాక్షి తెలిపింది.

హైదరాబాద్

హైదరాబాద్‌లో మళ్లీ కరోనా వైరస్‌ విస్తరిస్తోంది

హైదరాబాద్‌నగరంలో అత్తాపూర్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు ఇటీవల సన్నిహితుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కుటుంబలోని నలుగురికి కరోనా సోకింది. ఒకరి పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చేర్చిన 48 గంటల్లోనే చనిపోయారు. నాలుగు రోజుల కిందట కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఒకే రోజు 11 మంది కరోనా బారినపడ్డారు. మెహిదీపట్నంలోని ఓ కాలనీలో వారం రోజుల క్రితం 12 మందికి కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో 10 రోజుల వ్యవధిలో 10 కేసులు వెలుగు చూశాయని అని ఈనాడు ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

రెండో దశ వెళ్లిపోయిందిగా.. ఇక ఏమీ కాదన్న నిర్లక్ష్యం.. కనీసం మాస్కు ధరించకపోవడం.. భౌతికదూరం పాటించే సంగతి అటుంచితే గుంపులుగా సంచరించడం.. శుభకార్యాలు, ఉత్సవాలు, అంత్యక్రియల్లో పాల్గొనడం.. వెరసి కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది.

హైదరాబాద్‌లో రెండో ఉద్ధృతి తర్వాత తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కేసులు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నగరంలోని అనేక కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటీ రెండు తప్ప పెద్దగా కేసులు ఉండేవి కాదు. 10 రోజులుగా వాటి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇది ఒక్క రాజధాని నగరంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతోంది. కొవిడ్‌ నిబంధనలను జనం బేఖాతరు చేస్తుండటమే కేసుల పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
CJI NV Ramana patches the gap between wife and husband after 21 years of their seperation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X