
కరోనాతో మతానికి లింకా ? మీడియా తీరుతో దేశానికి చెడ్డ పేరు- సీజేఐ ఎన్వీ రమణ ఫైర్
దేశవ్యాప్తంగా కొన్ని మీడియా సంస్ధలు మతోన్మాద వైఖరుల్ని ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వర్గం మీడియా ప్రతీ అంశాన్ని మతంతో ముడిపెట్టాలని చూస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. తాజాగా గతేడాది కరోనా సమయంలో కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరుపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు.
YSR Death Anniversary: వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, వైయస్ షర్మిల(ఫోటోలు)
గతేడాది కరోనా సమయంలో దేశరాజధాని ఢిల్లీలో తబ్లీగీ జమాత్ నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారి కారణగానే వైరస్ వ్యాప్తి చెందిందని మీడియా కోడై కూసింది. దీంతో ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఈ సమావేశంలో పాల్గొన్న తబ్లిగీ జమాత్ సభ్యుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టులు కూడా చేశారు. వైరస్ వ్యాప్తికి కారణమయ్యారంటూ అంటువ్యాధుల నిరోధక చట్టం కింద వారిపై కేసులు పెట్టారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ లో కరోనా సమయంలో ఉన్నారనే కారణంతో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారంటూ తబ్గిగీ జమాత్ సభ్యులపై నిందలు మోపడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఓ వర్గం మీడియా వ్యవహరించిన తీరుతో భారత్ కు చెడ్డపేరు వచ్చిందని సీజే ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ప్రతీ విషయాన్ని మతోన్మాద దృష్టితో చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో మన దేశంలో పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో జవాబుదారీతనం లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ రమణ తప్పుపట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు "శక్తివంతమైన వ్యక్తులకు" మాత్రమే ప్రతిస్పందిస్తాయని, అయితే సాధారణ వ్యక్తులు, సంస్థలు మరియు న్యాయమూర్తులు కంటెంట్‌పై చేసిన ఫిర్యాదులు పట్టించుకోలేదని చెప్పారు. వీరికి అడ్డుకట్టే వేసేందుకు కేంద్రం వద్ద ఏదైనా పరిష్కారం ఉందా అని సీజేఐ రమణ ప్రశ్నించారు. స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... కేంద్రం. ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు వెబ్ సైట్లను నియంత్రించేందుకు నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. కేంద్రం తాము తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ పై దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖలైన కేసుల్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని తాజాగా కోరింది.