ఏప్రిల్ 17 నాటికి కరోనా రహిత రాష్ట్రంగా గోవా .. గ్రీన్ జోన్ గా ప్రకటిస్తామన్న గోవా సీఎం
కరోనా మహమ్మారి భారతదేశంలో తన ప్రభావాన్ని చూపిస్తుంది . అయితే గోవాలో మాత్రం ఊహించనివిధంగా అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గత పన్నెండు రోజులుగా గోవాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవటంతో లాక్ డౌన్ ఎత్తి వెయ్యాలని భావిస్తుంది గోవా సర్కార్ . ఇక ఈ నేపధ్యంలోనే ఈ నెల 17 నాటికి గోవా కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గత పన్నెండు రోజులుగా గోవాలో నమోదు కాని కేసులు
దేశం అంతా కరోనా తన ప్రతాపాన్నిచూపిస్తుంటే గోవాలో మాత్రం కరోనా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. గోవాలో విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉంటుంది . కానీ అలాంటి చోట కరోనా కేసులు తక్కువ నమోదు కావటం నిజంగా విశేషం అని భావిస్తున్నారు . ఇక గత పన్నెండు రోజులుగా గోవాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న సీఎం ప్రమోద్ సావంత్ త్వరలో గోవాను గ్రీన్ జోన్ గా ప్రకటించాలని భావిస్తున్నారు.

ఏప్రిల్ 17నాటికి రాష్ట్రం మొత్తం గ్రీన్ జోన్ లోకి సీఎం ధీమా
రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మినహా మిగిలిన రాష్ట్ర మంతా ఇప్పటికే గ్రీన్ జోన్లో ఉందని ఆయన చెప్పారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రజలందరూ తమకు సహకరించాలని కోరిన ఆయన ప్రస్తుతం కరోనా సోకి చికిత్స పొందుతున్న వారు కూడా నేడో రేపో డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు . 17నాటికి రాష్ట్రం మొత్తం గ్రీన్ జోన్ లోకి వచ్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోవాలో రెండు జిల్లాలు మినహా దక్షిణ గోవాను గ్రీన్ జోన్‌గా ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

కేవలం 7 పాజిటివ్ కేసులు ... త్వరలో డిశ్చార్జ్ అవుతారన్న ఆశాభావం
కరోనా వైరస్ కేసుల విషయంలో గోవా తాజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిందన్నారు . ఇప్పటి వరకూ తమ రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, ఆ కేసులన్నీ నార్త్ గోవాకు చెందినవేనని సీఎం తెలిపారు.ఇక ఆయన ఏప్రిల్ 17 నాటికి కరోనా రహిత రాష్ట్రంగా గోవా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక గోవాలోకి ఇతర ప్రాంతాల నుండి వచ్చే నిత్యావసర వస్తువులతో తమ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శానిటైజింగ్ మార్గాల ద్వారానే రావాలని ఆదేశించారు. ఇక గతంలో ప్రకటించినట్టు ఏప్రిల్ 14 నుంచి కాకుండా ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరుకావాలని సీఎం ప్రమోద్ సావంత్ ఆదేశించారు.