16-14-12 ఫార్ములా: నెరవేరబోతున్న దశాబ్దాల నాటి కల: టైగర్ వర్ధంతి నాడు ప్రమాణం..
ముంబై: మహారాష్ట్రలో మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టే కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన-కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మధ్య కొత్త ఫార్ములా కుదిరింది. 16-14-12 పేరుతో కొత్త ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చింది. ఈ ఫార్ములాకు మూడు పార్టీల మధ్య అంగీకారం కుదరడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సులువైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై అయిదేళ్ల పాటూ శివసేన నాయకుడే ఉంటారు. 16, 14, 12 ప్రాతిపదికన మంత్రి పదవులను పంచుకుంటారు.
President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..

రాష్ట్రపతి పాలన.. ఆ తరువాత
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాకు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ అంగీకరించడానికి ససేమిరా అనడంతో శివసేన తెగదెంపులు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న జాప్యాన్ని నివారించడానికి ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని ఏ పార్టీ గానీ, కూటమి గానీ నిరూపించకున్న వెంటనే రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.

కనీస ఉమ్మడి ప్రణాళికకు ఓకే..
మూడు పార్టీల కలయికతో మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కనీస ఉమ్మడి ప్రణాళిక ఆవిర్భవించింది. 40 పాయింట్లతో కనీస ఉమ్మడి ప్రణాళికలను ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళిక ఆధారంగానే ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశాలు దాదాపు ఖరారయ్యాయి. దీని ప్రకారం చూసుకుంట.. అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి శివసేన వద్దే ఉంటుంది. పూర్తి కాలం పాటు పరిపాలిస్తుంది. కాంగ్రెస్ కు అసెంబ్లీ స్పీకర్, ఎన్సీపీకి మండలి చైర్మన్ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు. దీనితోొ పాటు మంత్రివర్గంలోనూ సమానంగా వాటా ఉంటుంది.

17న ప్రమాణ స్వీకారం..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన నాయకుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వర్ధంతి కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి శివసేన సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికోసం వాంఖెడే స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిసారిగా శివసేన ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోబోతున్న నేపథ్యంలో.. మహాారాష్ట్రలో ఆ పార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

105 స్థానాలతో ప్రతిపక్షంలో బీజేపీ..
శివసేన ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను అంగీకరించకపోవడంతో బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కానుంది. ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్ర అసెంబ్లీలో 105 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చాలా దూరంలో ఆగిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలను కూడా చేయట్లేదు కమల నాథులు. ప్రతిపక్షంలో కూర్చుంటామని, సంకీర్ణ కూటమి సర్కార్ ను కంటి మీద కునుకు లేకుండా చేస్తామని బీజేపీ మహారాష్ట్ర శాఖ నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి శివసేన కుట్రను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!