సెప్టెంబర్ నుండి అంతా అన్ లాక్... అంక్షల ఎత్తివేతకు కేంద్రం సన్నద్ధం .. ట్విస్ట్ ఏంటంటే..
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా కరోనా కేసులు నమోదవుతున్న తొలిరోజుల్లో కేంద్ర లాక్ డౌన్ ద్వారా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కట్టడి ఇప్పట్లో సాధ్యం కాదని గుర్తించిన కేంద్రం, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇప్పటివరకు మూడు సార్లు లాక్డౌన్ ఆంక్షలను అన్ లాక్‌ల ద్వారా తీసేసింది. ఇక తాజాగా పూర్తిస్థాయిలో అన్ లాక్ ప్రక్రియను కొనసాగించడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది.
ఇండియాలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు

సెప్టెంబర్ 1 నుండి కంప్లీట్ అన్ లాక్ ..ఆంక్షల తొలగింపుకు కేంద్రం సన్నాహాలు
సెప్టెంబర్ 1 నుండి లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేయాలని భావిస్తున్న ప్రభుత్వం దాదాపుగా అన్ని ఆంక్షలను ఎత్తివేసి సాధారణ జనజీవనానం సాగేలా చూడాలని నిర్ణయం తీసుకుందని సమాచారం .అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్ళు, మాల్స్ అన్నీ తెరిచేలా నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే అంతర్ రాష్ట్ర రవాణా పై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇక సినిమాలకు , సీరియళ్ళకు షూటింగ్ అనుమతులు ఇచ్చేసింది .ఇప్పుడు ఇండస్ట్రీలపైన కూడా ఆంక్షలను తొలగించనుంది. త్వరలోనే థియేటర్లను కూడా ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంది.

సభలు, సమావేశాలు , పెద్ద ఎత్తున జనం గుమికూడే కార్యక్రమాలపైనే ఆంక్షలు
ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలు ఈ నెల 31వ తేదీ వరకు వర్తిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి ఆంక్షలు వర్తించవని తెలుస్తుంది. విద్యా సంస్థలు కూడా సెప్టెంబర్ నెలలోనే తెరుచుకోనున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తి వేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక భారీ ఎత్తున జనం గుమి కూడే కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటివాటిపై మాత్రమే నిబంధనలు కొనసాగనున్నాయి. వీటిని మాత్రమే ప్రజలు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.వీటికి మినహాయించి మిగతా అన్నిటికీ నిబంధనలను సడలించనుంది.

ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే యత్నం
లాక్డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేస్తే కరోనాతో సహజీవనం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడాలంటే ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది. అలా పెరగాలంటే కరోనాకు ముందులా అన్ని రంగాలు పని చేయాలి.అందుకోసమే అన్ని రంగాలు యధావిధిగా పనిచేయడం కోసం లాక్ డౌన్ ఆంక్షలను ఉపసంహరించుకోవాలని భావిస్తుంది కేంద్ర సర్కార్. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం మందగించిందని, రికవరీ రేటు పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం కరోనా నుంచి రక్షించుకునే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది అని చెప్పే ఆలోచనలో ఉందని సమాచారం.

కరోనా నుండి రక్షణా బాధ్యత ప్రజలదే
కరోనా వైరస్ సోకితే తనకు మాత్రమే కాకుండా , తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం అని గుర్తించి ఎవరికి వారే నిబంధనలను పెట్టుకోవాలని, రక్షించుకునే బాధ్యత ప్రజలే స్వయంగా చేపట్టాలని ప్రభుత్వం సూచించే ఆలోచనలో ఉంది. ఇక పరిశ్రమల్లోనూ కార్మికుల రక్షణ బాధ్యత యాజమాన్యాలదేనని , అవసరమైతే కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది . కేంద్రం కంప్లీట్ అన్ లాక్ ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్నా ఇందులో చిన్న ట్విస్ట్ పెట్టింది .

రాష్ట్రాలు పరిస్థితిని బట్టి ఆంక్షల విషయంలో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు
స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆయా రాష్ట్రాలకు ఉంది అని తేల్చి చెప్తుంది. ఒక పక్క కేంద్రం పూర్తిగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నా మరో పక్క రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆంక్షల ఎత్తివేత కు నిర్ణయం తీసుకుంటే స్కూళ్ళు, సినిమా హాళ్ళు, రైళ్లు యధావిధిగా నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రికవరీ 78 శాతానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ నుండి కరోనా ఆంక్షల ఎత్తివేస్తే కరోనా వైరస్ తో సహజీవనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆంక్షల కొనసాగింపుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఆంక్షల కొనసాగింపు జరుగుతుంది .