2వేల నోటు మాయంపై అయోమయం! ఇంతకీ నోటుపై వేటు పడినట్టేనా?
ఢిల్లీ/హైదరాబాద్ : పెద్ద నోటు మనుగడపై జనాల్లో పెద్ద సందేహాలు కలుగుతున్నాయి. నోటు చలామణిలో ఉంటుందా నిషేదిస్తారా అనే అంశం పై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ రెండువేల నోటు ముద్రణను ఆపేసిందని, భవిశ్యత్తులో ఇక రెండువేల నోటు చెల్లుబాటు కాదని పుకార్లు పెద్ద యెత్తున షికార్లు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. కాని ఇప్పుడు ఈ నోటుకు కాలం చెల్లిందనే కథనాలు వినిపిస్తున్నాయి.
పెద్ద పెద్దోళ్లు వస్తేనే క్లీన్ చేస్తారా?: జిన్ పింగ్ టూర్ పై మద్రాస్ హైకోర్టు

అయోమయంలో జనం..
పెద్ద నోటు రద్దుపై పెద్ద సందేహం.. అయోమయంలో జనం..
వెయ్యికి మించి విలువైన రెండు వేల నోటు తక్కువ సమయంలో అందరి చేతుల్లోకి చేరిపోవటమే కాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న నగదు కొరతను తీర్చటంలో కీలకంగా వ్యవహరించింది. ఐతే ఒకప్పుడు విరివిగా దర్శనమిచ్చే 2వేల రూపాయల నోట్లు ఈ మధ్యన పెద్దగా కనిపించడం లేదు. దీనికి తోడు 2వేల రూపాయల నోట్లను ఎప్పుడైనా రద్దు చేస్తారని, దీన్ని దగ్గర ఉంచుకోవటం ప్రమాదమని భావించే వాళ్లూ లేకపోలేదు. అయితే ఇందులో వాస్తవం లేకపోయానా, 2వేల నోట్ల రూపాయల చెల్లుబాటుపై తరచూ వినిపించే పుకార్లు చాలామందికి ఈ పెద్ద నోటు జోలికి వెళ్లేందుకు భయపడేలా చేస్తున్నాయి.

చెలామణిపై అనుమానాలు..
ముద్రణ ఆపేసినట్టు కథనాలు.. చెలామణిపై అనుమానాలు..
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో 2వేల రూపాయల నోట్లు తక్కువగా కనిపిస్తున్న వైనానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఊహించని సమాధానం చెప్పి విస్మయానికి గురి చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ల ముద్రణ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయల నోటును ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదన్న విషయాన్ని వెల్లడించారు.

పెద్దనోటుకు నకిలీ నోటు బెడద.. అందుకే తొలగిస్తున్నట్టు వార్తలు..
ఎందుకిలా అంటే అసలు నోటుకు అచ్చుగుద్దిన రీతిలో నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వస్తున్నట్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశారా? అనే అంశం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దుకు అసలు కారణం వెయ్యి, 500 నోట్ల రూపాయలు పెద్ద ఎత్తున నకిలీలు చెలామణిలో ఉండటంతో, వాటిని కంట్రోల్ చేయటానికి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ మోదీ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంకు సమాచారం ప్రకారం 2016-17లో రెండు వేల నోట్ల ప్రింటింగ్ జరిగింది.

నల్లధనం వెలికి తీసేందుకే పెద్ద నోట్ల రద్దు.. మళ్లీ పెద్ద నోటుపై వేటు వేయనున్న కేంద్రం..
ఆ ఏడాది 354.2 కోట్ల రూపాయల మేర ఈ నోట్లను ముద్రించగా, 2018-19లో 4.66 కోట్ల రూపాయల నోట్లను ముద్రించారు. ఆసక్తికరంగా 2019 నాటికి ఈ నోట్ల సంఖ్య 329.1 కోట్ల రూపాయలకు తగ్గటం గమనార్హం. నల్ల ధనాన్ని అదుపు చేయడం కోసమే 2వేల నోట్ల రూపాయల ముద్రణను ఆర్బీఐ తగ్గించాలని అనుకొని ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా 2వేల నోట్ల రూపాయల మీద మొదట్నించి ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు ఉండేవి. తాజాగా ఈ పెద్ద నోటును ఈ ఏడాది ఇప్పటివరకూ ఒక్క నోటు కూడా ప్రింట్ చేయలేదన్న విషయం పట్ల మాత్రం ప్రజలు ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!