సెకండ్ రౌండ్: సందేసర స్కాంపై అహ్మద్ పటేల్ విచారణ: ఈడీ ప్రశ్నల వర్షం
సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్‌ను విచారించారు. సందేసర గ్రూపు బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల లోన్ తీసుకొని, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిందని ఈడీ అభియోగాలు మోపింది. తమ వద్ద ఉన్న ఆధారాలతో అహ్మద్ పటేల్ కుమారుడు, అల్లుడిని కూడా విచారించింది. ఈ నెల 27వ తేదీ శనివారం కూడా ఎంక్వైరీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటలపాటు లావాదేవీలు, నిధుల గురించి సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించారు..

రెండోసారి విచారణ
ఢిల్లీలోని మిస్టర్ పటేల్ 23 రోడ్డులో గల అహ్మద్ పటేల్ నివాసానికి ముగ్గురు సభ్యుల గల ఈడీ బృందం వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్ పెట్టుకొని, గ్లౌజ్ వేసుకొని.. కొన్ని పత్రాలతో విచారించారు. ఉదయం 10.30 గంటలకు చేరుకొని విచారించారు. వయస్సు దృష్ట్యా ఈడీ కార్యాలయానికి హాజరుకాలేనని.. పటేల్ కోరడంతో రెండోసారి కూడా ఇంటివద్ద విచారించారు. స్కాంకు సంబంధించి పటేల్‌ను విచారించి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని పేర్కొన్నారు.

కుమారుడు, అల్లుడు
ఇదివరకు పటేల్ కుమారుడు ఫైసల్, అల్లుడు సిద్దిఖీని విచారించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నితిన్ సందేసర ప్రమేయం ఉంది అని తెలుసుకున్నారు. పీఎన్‌బీ స్కాం కంటే సందేసర స్కాం పెద్దదని ఈడీ అధికారులు తెలిపారు. ఎస్బీఎల్, సందేసర గ్రూపు ప్రమోటర్లు నితిన్ సందేసర, చేతన్ సందేసర, దీప్తి సందేసర కలిసి బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు.

స్కాం ఇలా..?
2017లో సందేసర గ్రూపు చేసిన స్కాం వెలుగుచూసింది. కంపెనీకి చెందిన ఒకరినీ ఈడీ అరెస్ట్ చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈడీ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకొని, పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు సందేసర.. అహ్మద్ పటేల్ కుమారుడు, అల్లుడు నివాసాలకు భారీ నగదుతో వచ్చారని తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కుంభకోణంతో సంబంధం ఉంది అని ఈడీ అభియోగాలు మోపింది. అయితే ఆరోపణలను అహ్మద్ పటేల్ తొలి నుంచి ఖండిస్తున్నారు. సందేసర గ్రూపునకు చెందిన సునీల్ యాదవ్.. సిద్దిఖీ, ఫైసల్ పటేల్‌కు సందేసర కోడ్ ఇచ్చారని.. ఈడీ అధికారులు తెలిపారు.