మమతా ప్రభుత్వం తరపున చిదంబరం వకాల్తా - కాంగ్రెస్ లాయర్ల నిరసన : వీడియో వైరల్...!
కొల్కతా కేంద్రంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు సొంత పార్టీకి చెందిన లాయర్ల నుంచే ఊహించని రీతిలో నిరసన ఎదురైంది. మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొంతపార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్ మద్దతు దారులైన న్యాయవాదులు ఫైర్ అయ్యారు.
చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్ల వస్త్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం చిదంబరమేనని ఆరోపించారు. టీఎంసీ పార్టీ సానుభూతిపరుడు అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి చిదంబరం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చేశారు. కారు వైపు వెళ్తున్న ఆయనను నిరసన తెలుపుతూ కాంగ్రెస్ సెల్ న్యాయవాదులు అనుసరించారు.

అయితే చిదంబరం ఏమీ స్పందించలేదు. మౌనంగా నడుచుకుంటూ వెళ్లి తన కారులో కూర్చొన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 స్థానాల్లో విజయం సాధించగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 291 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది.
అయితే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చిదంబరం ప్రొషెషన్ రీత్యా న్యాయవాది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉంటూ..తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన టీఎంసీ తరపున వకాల్తా తీసుకోవటం పైన కాంగ్రెస్ మదదతు దారులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో..చిదంబరం కోర్టుకు వస్తూనే వారు నిరసనకు దిగారు. అయితే, వారికి చిదంబరం మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదు. వరుస సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ లో ఇప్పుడు చిదంబరం వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది.