• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య మసీదులో అహ్మదుల్లా రీసెర్చ్ సెంటర్ నిర్మాణం.. ఇంతకీ ఆయన ఎవరు?

By BBC News తెలుగు
|

2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దశాబ్దాలనాటి రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ఓ కొలిక్కి వచ్చింది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా మొదలైంది. మరోవైపు అయోధ్యలో ఐదు ఎకరాల స్థలంలో ఓ మసీదును కూడా నిర్మించాలని సుప్రీం కోర్టు సూచించింది.

కొత్తగా నిర్మించబోయే మసీదుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మౌల్వి అహ్మదుల్లా షా పేరును ఈ మసీదుకు పెట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్‌లోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు.. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం మసీదుకు అహ్మదుల్లా షా పేరు పెట్టాలని ఐఐసీఎఫ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ అంశంపై ఐఐసీఎఫ్‌ సెక్రటరీ అతహర్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడారు. మసీదు పేరు విషయంలో కాస్త అసందిగ్ధత నెలకొందని చెప్పారు.

అయోధ్య మసీదు డిజైన్

మసీదుకు కాదా?

''మసీదుకు మౌల్వి అహ్మదుల్లా షా పేరు పెట్టడం లేదు. అయితే, మసీదు ప్రాంగణంలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. దానికి అహ్మదుల్లా పేరును పరిశీలిస్తున్నాం’’అని హుస్సేన్ చెప్పారు.

''ఈ కల్చరల్ సెంటర్‌లో గ్రంథాలయం, మ్యూజియం, పబ్లిషింగ్ హౌస్ కూడా ఉంటాయి’’అని ఆయన వివరించారు.

మసీదు డిజైన్‌ను ఇప్పటికే ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది.

అధునాతన సదుపాయాలతో మసీదుతోపాటు 200 బెడ్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఒక మ్యూజియం, ఒక పురావస్తు భాండాగారం ఇక్కడ ఏర్పాటుచేస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఓ కమ్యూనిటీ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అయోధ్యలోని ధన్నిపూర్‌ గ్రామంలో జనవరి 26 నుంచి ఈ మసీదు నిర్మాణపు పనులు మొదలయ్యాయి.

ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ (కుడివైపు)

అహ్మదుల్లా పేరు ఎందుకు?

1857 సిపాయిల తిరుగుబాటు నుంచి భారత స్వాతంత్ర్యం వరకు మధ్యగల చరిత్ర అధ్యయనానికి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ఇక్కడ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు.

''1919లో మహాత్మా గాంధీ తొలిసారిగా లఖ్‌నవూ వచ్చారు. ఆయన ఇక్కడున్న మౌలానా అబ్దుల్ బారీ ఫిరంగీ మహల్‌లో దాదాపు ఆరు నెలలు గడిపారు. అప్పుడు అవధ్‌లో రైతుల ఉద్యమం జరిగేది’’అని హుస్సేన్ చెప్పారు.

''స్వాతంత్ర్య ఉద్యమం అనేది ఇటు హిందువులకు.. అటు ముస్లింలకు ఇద్దరికీ ముఖ్యమైనది. దీనిలో రెండు వర్గాలూ కలిసిమెలసి పోరాడాయనే సంగతిని మేం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెప్పాలని భావిస్తున్నాం’’అని హుస్సేన్ అన్నారు.

1857 సిపాయిల తిరుగుబాటును ఫైజాబాద్‌లో ముందుకు తీసుకెళ్లినవారిలో మౌల్వి అహ్మదుల్లా ప్రధానమైనవారు. గంగ-జముని తెహ్‌జీబ్ (హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనం)కు ఆయన చక్కని ఉదాహరణ లాంటివారు.

''ఫైజాబాద్‌-అయోధ్యలో కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేసేటప్పుడు.. అహ్మదుల్లా కంటే మంచి పేరు ఏముంటుంది?’’అని హుస్సేన్ అన్నారు.

నానా సాహెబ్, తాంతియా తోపే తదితర నాయకులతో కలిసి బ్రిటిష్ వారిపై అహ్మదుల్లా పోరాడారు. ముఖ్యంగా లఖ్‌నవూ, అవధ్ ప్రాంతాల్లో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు. ఇక్కడి పోరాటానికి నాయకత్వం వహించింది ఆయనే.

అహ్మదుల్లా ఎవరు?

1857నాటి సిపాయిల ఉద్యమాన్ని నడిపించిన ప్రముఖుల్లో మౌల్వి అహ్మదుల్లా షా ఒకరు. బ్రిటిష్ సేనలతో పోరాటంలో ఆయన తన ప్రాణాలనే అర్పించారు.

ఆయన గురించి మరిన్ని విషయాలను చరిత్రకారుడు రామ్ శంకర్ త్రిపాఠి వెల్లడించారు.

''అహ్మదుల్లా షా ఒక జనరల్. ఆయన ప్రజల మధ్యలోకి ఏనుగుపై వచ్చేవారు. ఆయన ముందు కూడా ఒక ఏనుగు నడిచేది. అది ఢంకా మొగిస్తూ ముందుకు వెళ్లేది. అందుకే ఆయన్ను ఢంకా షా అని అందరూ పిలిచేవారు’’.

ఆయన్ను ఫైజాబాద్ మౌల్వి అని కూడా పిలిచేవారు. లఖ్‌నవూ, షాజహాన్‌పుర్, బరేలీతోపాటు అవధ్‌లో కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటుకు ఆయన నేతృత్వం వహించారు. ఆయన సాయం వల్లే చాలా ప్రాంతాల్లో బ్రిటిష్ బలగాలను తిరుగుబాటుదారులు తేలిగ్గా ఓడించగలిగారు.

మరోవైపు మౌల్వి అహ్మదుల్లా గురించి చరిత్రకారుడు త్రిపాఠి మరిన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

''1857 తిరుగుబాటు విషయంలో మతాల పేరుతో ఎప్పుడూ జనాలను అహ్మదుల్లా షా సమీకరించలేదు. ఆయన ఎప్పుడూ మాతృభూమి పేరు చెప్పి ముందుకు వెళ్లారు. హిందూ-ముస్లిం సంస్కృతుల సమ్మేళనానికి ఆయన చక్కని ఉదాహరణ లాంటివారు’’.

''ఆయన సైన్యంలో అటు ముస్లింలు, ఇటు హిందువులు.. రెండు వర్గాల నాయకులూ ఉండేవారు’’.

ఫైజాబాద్‌లోని మసీద్ సరాయ్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని అహ్మదుల్లా పనిచేసేవారు. ఫైజాబాద్, అవధ్‌లలోని చాలా ప్రాంతాలను ఆయన బ్రిటిష్ పాలకుల నుంచి విడిపించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీపై పోరాడిన ప్రధాన నాయకుల్లో అహ్మదుల్లా ఒకరు. ఆయన ఎలాంటి సైనిక పరమైన శిక్షణా తీసుకోలేదు. అయితే కాన్పుర్ నుంచి లఖ్‌నవూ, దిల్లీ నుంచి బరేలీ వరకు బ్రిటిష్ సైన్యంతో ఆయన వీరోచితంగా పోరాడారు.

ఆయన పేరు వింటే బ్రిటిష్ బలగాలు భయపడేవని చరిత్రకారులు చెబుతుంటారు.

1787లో చెన్నైలో అహ్మదుల్లా జన్మించారు. చిన్నప్పుడు ఆయన్ను సికందర్ షా అని పిలిచేవారు.

అయోధ్య మసీదు

ఎలా మరణించారు?

తనకు సాయం చేయాలంటూ షాజహాన్‌పుర్ సంస్థానం యువరాజు జగన్నాథ్ సింగ్.. అహ్మదుల్లా సాయం కోరారు. అయితే, అదే సమయంలో బ్రిటిష్ వారితో చేతులు కలిపి అహ్మదుల్లాను జగన్నాథ్ హత్య చేశారు.

అహ్మదుల్లా తల, శరీరాలను షాజహాన్‌పుర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో సమాధి చేసినట్లు చరిత్రకారులు చెబుతారు.

''మోసపూరితంగా అహ్మదుల్లాను జగన్నాథ్ సింగ్ హత్య చేశారు’’అని త్రిపాఠి వివరించారు.

అహ్మదుల్లాను హత్య చేయడాన్ని ముస్లింలతోపాటు హిందువులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. 1958 జూన్ 5న అహ్మదుల్లా హత్యకు గురైనట్లు చరిత్ర చెబుతోంది.

మొదలైన మసీదు నిర్మాణపు పనులు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మసీదు నిర్మాణపు పనులు మొదలుపెట్టినట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి హుస్సేన్ చెప్పారు.

''మేం పండ్ల మొక్కను నాటి నిర్మాణపు పనులు మొదలుపెట్టాం. వాతావరణ మార్పుల కట్టడికి కూడా మేం కృషి చేస్తామని దీని ద్వారా సందేశం ఇవ్వాలని భావించాం’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ahmadullah research centre at Ayodhya mosque
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X