jammu and kashmir shujaat bukhari journalist shot dead intelligence bureau hizbul mujahideen జర్నలిస్టు కాల్పులు మృతి హిజ్బుల్ ముజాహిదీన్ జమ్మూకాశ్మీర్
జర్నలిస్టు బుఖారీ హత్య కేసులో పురోగతి: నాలుగో నిందితుడి ఫొటో రిలీజ్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సీనియర్ జర్నలిస్టు, రైజింగ్ కాశ్మీర్ దిన పత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారీ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులు నాలుగో నిందితుడిని గుర్తించారు.

నాలుగో నిందితుడి ఫొటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చాక బుఖారీపై దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు జరిగాక, ఆయన బాడీ గార్డును కారు నుంచి పక్కకు తీసి, బుఖారీకి సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. మరోసారి పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం.

అనంతరం అతడు అక్కడ్నుంచి పరారయ్యాడు. అతడు తెల్లని కుర్తా ధరించి, గడ్డంతో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. అనుమానితుల ఫొటోలను విడుదల చేయడం ద్వారా స్థానికుల సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

నేరస్తులకు సంబంధించిన సమాచారం అందించిన పౌరుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాస్కులు ధరించిన వీరు.. గురువారం బుఖారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనలో బుఖారీతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా మరణించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.