
భారత్ లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 13వేలకు పైగా కొత్తకేసులు; 38మరణాలు!!
భారత దేశంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో 13,313 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మహమ్మారి కారణంగా 38 మంది మరణించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలను కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి.

కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువ.. దేశంలో కరోనా ఆందోళన
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం (జూన్ 23న) పంచుకున్న డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశం మొత్తం 10,972 మంది కరోనా మహమ్మారి బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా బారినుండి కోలుకున్న వారి కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం డిశ్చార్జ్ అయిన వారితో కలిపి మొత్తం రికవరీ రేటు సుమారు 98.60 శాతం గా ఉంది. మొత్తం రికవరీ డేటా 4,27,36,027 కి చేరుకుంది.

భారీగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
భారతదేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 83,990కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఈరోజు వెల్లడించింది. నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 81,687 కాగా ఈరోజు గత 24 గంటల వ్యవధిలో 2,303 కేసులు పెరిగాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.19 శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,24,941కి చేరింది. జూన్ 23న రోజువారీ సానుకూలత రేటు 2.03 శాతంగా నమోదైంది.

మహారాష్ట్రలో కరోనా కలకలం .. సీఎంనూ వదలని మహమ్మారి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, కోవిడ్-19 కోసం జూన్ 22 వరకు 85,94,93,387 నమూనాలను పరీక్షించారు. వీటిలో బుధవారం 6,56,410 నమూనాలను పరీక్షించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు, మహా రాష్ట్ర గవర్నర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కేరళలోనూ కరోనా ప్రభావం .. 3,890 కొత్త కేసులు, 7 మరణాలు
అంతేకాదు కేరళ రాష్ట్రంలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే తాజా కోవిడ్-19 కేసులు బుధవారం స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో 3,890 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేరళలో మొత్తం కేసుల సంఖ్య 66,12,607కి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం, దక్షిణాది రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,172 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. ఈరోజు, కోవిడ్-19 కారణంగా 7 మరణాలు సంభవించాయి. దీంతో కేరళ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 69,924కి చేరుకుంది. డేటా ప్రకారం ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు 25,044కి పెరిగాయి. గత 24 గంటల్లో మొత్తం 22,927 నమూనాలను పరీక్షించగా 16.97 శాతం పరీక్ష పాజిటివిటీ రేటు నమోదైంది. మంగళవారం, రాష్ట్రంలో 4,224 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.