ఇండియాలో మళ్ళీ 3వేలు దాటిన కరోనాకేసులు; ఢిల్లీలోనూ మహమ్మారి ఉధృతి... బీ కేర్ ఫుల్!!
భారతదేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.హెచ్చుతగ్గుల ఊగిసలాట మధ్య కరోనా కేసుల విషయంలో ఆందోళన నెలకొంది. భారతదేశంలో గత 24 గంటల్లో 3,205 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,30,88,118కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 31 కొత్త కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 523,920కి చేరుకుంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.07 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.70 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 2,802 మందికి పైగా ప్రజలు కరోనావైరస్ నుండి కోలుకున్నారు. తాజా కొత్త కేసులు రికవరీలను చూస్తే కొత్త కేసులు రికవరీల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కోవిడ్ రికవరీల సంఖ్య 4,25,44,689కి చేరుకుంది.

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన సంచిత మోతాదుల సంఖ్య 1,89,48,01,203కి చేరుకుంది. ఇక దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా ఢిల్లీలో 1414 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మంగళవారంనాడు 3.87లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,205 మంది కరోనా బారిన పడినట్టు తేలింది. మునుపటి రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 32శాతం పెరిగినట్టుగా కనిపిస్తుంది .
కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు 19,509కి చేరాయి. మొత్తం కేసులలో క్రియాశీల కేసుల వాటా 0.05% గా ఉంది. నిన్న రంజాన్ సందర్భంగా సెలవు దినం కావడంతో పరీక్షల సంఖ్య, టీకాల పంపిణీలో వేగం బాగా తగ్గింది. తాజాగా 4,79,208 మంది కరోనా వ్యాక్సిన్ లు తీసుకున్నారు. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వివాహ వేడుకలు, పండుగల సమయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.