భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనాకేసులు; తాజాగా 2,380కేసులు, 56మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో భారతదేశంలో 2,380 కోవిడ్-19 కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 13,000 కంటే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

ఢిల్లీలో 60శాతం కేసుల పెరుగుదల
తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,30,49,974కి పెరిగింది. అయితే క్రియాశీల కేసులు 13,433కి పెరిగాయి. 56 తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,22,062కి చేరుకుంది. ఢిల్లీలో 60% కేసుల పెరుగుదల నమోదైంది. మహారాష్ట్ర లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాస్క్‌లు తప్పనిసరి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్.

దేశంలో తాజాగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కేరళ మృతుల సంఖ్య 53 కాగా, ఢిల్లీ, ఒడిస్సా, మిజోరాం రాష్ట్రాల్లో ఒక్కొక్క మరణం సంభవించింది. నిన్న 1231 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 15.47 లక్షల మంది కరోనా మహమ్మారి నియంత్రణకు టీకాలను తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 187 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం పేర్కొంది.

1 కి పెరిగిన ఆర్ వాల్యూ... ఆందోళనలో దేశం
కోవిడ్-19 కోసం భారతదేశం యొక్క ప్రభావవంతమైన పునరుత్పత్తి సంఖ్య (R-విలువ) జనాభాలో ఒక వ్యాధి ఎంత త్వరగా వ్యాపిస్తుందో సూచించే సూచిక. ఈ ఆర్ వాల్యూ మహమ్మారి యొక్క మూడవ వేవ్ సమయంలో జనవరి మధ్య నుండి మొదటిసారిగా 1కి పెరిగింది. గత కొన్ని వారాలుగా స్థిరమైన పెరుగుదలను చూసే R- విలువ ఏప్రిల్ 12-18 మధ్యకాలంలో 1.07గా ఉంది. ఇది ప్రారంభం నుండి దేశం యొక్క కరోనా మహమ్మారి R- విలువను ట్రాక్ చేస్తున్న చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ నుండి పరిశోధకుడు సితాబ్ర సిన్హా తెలిపారు. అంతకు ముందు వారం ఇది 0.93గా ఉంది.

మళ్ళీ మాస్క్ లను తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు.. ఢిల్లీలో కరోనా కట్టడికి మళ్ళీ నిబంధనలు
బుధవారం, ఢిల్లీలో 1,009 కొత్త కేసులు, ఒక మరణం మరియు 5.70 శాతం పాజిటివ్ రేటు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ. 500 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ వారం ప్రారంభంలో, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ఢిల్లీ సమీపంలోని జిల్లాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పాఠశాలలను మూసివేయకూడదని నిర్ణయించుకుంది. వాటి కోసం ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)ని తీసుకురానుంది.