తగ్గిన కరోనా కేసులు; కొత్తకేసుల కంటే పెరిగిన రికవరీలు.. భారత్ లో తాజాపరిస్థితి ఇదే!!
భారతదేశంలో కరోనా కేసులు నిన్నటి కంటే కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 2,568 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నమోదైన దానికంటే 18.7% తక్కువ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం కేసులు ఇప్పుడు 4,30,84,913కి చేరుకుంది. అదే సమయంలో దేశంలో 20 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం నివేదించబడిన మరణాల సంఖ్య 5,23,889కి చేరుకుంది.
అత్యధికంగా ఢిల్లీలో 1,076 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మొదటి ఐదు రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత 439 కేసులతో హర్యానా, 250 కేసులతో కేరళ, 193 కేసులతో ఉత్తరప్రదేశ్, 111 కేసులతో కర్ణాటక ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 80.58% కొత్త కేసులు నమోదయ్యాయి. 41.9% కొత్త కేసులకు ఢిల్లీ మాత్రమే కారణమైంది. భారతదేశం యొక్క రికవరీ రేటు ఇప్పుడు 98.74% వద్ద ఉంది. గత 24 గంటల్లో మొత్తం 2,911 మంది రోగులు కోలుకున్నారు. దీంతో తాజాగా కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది.

తాజాగా కోలుకున్న వారితో కలిపి దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887కి చేరుకుంది. భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,137గా ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 363 తగ్గాయి. ఇంతలో, భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 16,23,795 డోస్‌లను అందించింది. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అందించబడిన కరోనా వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 1,89,41,68,295కి చేరుకుంది.
ఇక రాష్ట్రాలు కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నాయి. కొన్నిరాష్ట్రాలు కరోనా నిబంధనలను పాటించకుంటే ఫైన్లు వెయ్యటానికి సిద్ధం అయ్యాయి. ఇక దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ పై భయం అవసరం లేదని సూచించింది ఐసీఎంఆర్. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతోనే కరోనా ఫోర్త్ వేవ్ గా పరిగణించలేమని పేర్కొంది.