కరోనా కేసులు పెరుగుతున్నాయ్ జాగ్రత్త; 3వేలను దాటిన కొత్తకేసులతో పరిస్థితి ఎలా ఉందంటే!!
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారతదేశంలో 24 గంటల్లో 3,377 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 17,801 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గురువారం, దేశంలో3,377 నమోదైన కొత్త కేసులలో దాదాపు 1,500 ఇన్ఫెక్షన్లు ఢిల్లీలో నమోదయ్యాయి.


మూడు వేలను దాటిన కరోనా కొత్త కేసులు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 73 వేల 635 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3377 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరటం గమనించవలసిన అంశం. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 2496 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇక కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి దేశంలో కరోనా వ్యాప్తికి అద్దం పడుతుంది.

17వేలకు పైగా యాక్టివ్ కేసులు
ప్రస్తుతం 17 వేలకు పైగా యాక్టివ్ కేసులతో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు 5.23 లక్షల మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం రోజున 22.80 లక్షల మంది కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 188. 65 కోట్ల డోసులు పంపిణీ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. కానీ వ్యాధి తీవ్రత తక్కువ
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, రాజధానిలో కోవిడ్ -19 కేసులు పెరిగాయని, అయితే ప్రజలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదని , ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగా ఉన్నందున పరిస్థితి తీవ్రంగా లేదని అన్నారు. అదే సమయంలో, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ టీకా 6-12 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఆమోదించబడింది. ఇది భారతదేశంలో టీకా డ్రైవ్‌కు ఊతమిచ్చింది. యుఎస్‌లో, పిల్లలు మరియు ప్రీస్కూలర్‌ల కోసం కోవిడ్ షాట్లను అందించే మొదటి ఫార్మా దిగ్గజంగా మోడర్నా ప్రయత్నిస్తుంది.