ఇండియాలో ఏడు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు ; 8 నెలల కనిష్టానికి మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాప్తిచెందినప్పటినుండి ఇప్పటివరకు చూసినట్లయితే, 7 నెలల కనిష్టానికి తాజా కేసులు పడిపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో మరణాల తగ్గుదల కూడా నమోదవుతుంది . మరణాల తగ్గుదల 8 నెలల కనిష్టానికి చేరుకుంది .
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి

గత 24 గంటల్లో 10,064 కేసులు ... గత జూన్ లో నమోదైన కేసులకు దగ్గరగా
గత 24 గంటల్లో అతితక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి . భారతదేశంలో గత 24 గంటల్లో 7,09,791 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కేవలం 10,064 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి .ఇక తాజా కేసుల సంఖ్య కూడా 10,064 కనిష్టంగా నమోదుకావడం కాస్త సంతోషం కలిగించే అంశం. చివరిసారి ఒకే రోజు కేసుల సంఖ్య 10,000 కన్నా తక్కువ జూన్ 11 న (9,996) నివేదించబడ్డాయి.

గత 24 గంటల్లో 137 మరణాలు, 8 నెలల కనిష్టానికి మరణాలు
మే 23 నుండి ఒకే రోజులో అతి తక్కువ మరణాలను భారత్ నమోదు చేసింది. గత 24 గంటల్లో 137 మరణాలు దేశంలోని కోవిడ్ మరణాల సంఖ్య 1,52,556 కు చేరుకున్నాయి. ఇక మరణాల్లో చూస్తే 8 నెలల కనిష్టానికి భారత్ చేరుకుంది. ప్రస్తుతం మరణాల రేటు చూస్తే 1.44 శాతంగా ఉంది.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశం 1.05 కోట్ల కేసులను నమోదు చేసింది . ఇప్పటికే 1.02 కోట్లకు పైగా ప్రజలు కరోనా నుండి కోలుకున్నారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది.

దేశంలో 7 నెలల కనిష్టానికి రోజువారి కేసులు
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు దేశంలో అత్యధిక కేసులు నమోదయ్యే ఐదు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 81 కొత్త ఇన్ఫెక్షన్లతో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా దేశంలో 7 నెలల కనిష్టానికి రోజువారి కేసుల సంఖ్య చేరడం గమనార్హం. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837 గా నమోదయింది. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల డ్రైవ్లో నాలుగవ రోజు లోకి ప్రవేశించడం, మరోపక్క రోజువారీ కేసులు తగ్గుతున్న తీరు భారత్ కు ఊరట కలిగించే అంశాలు.

నాల్గవ రోజు వ్యాక్సినేషన్ .. వ్యాక్సినేషన్ వివరాలు వెల్లడించిన కేంద్రం
వ్యాక్సినేషన్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు 3.8 లక్షలకు పైగా ప్రజలకు టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రతికూల రియాక్షన్స్ వచ్చిన కేసులు 580 కేసులుగా ప్రభుత్వం గుర్తించింది. మూడు రోజుల వ్యాక్సినేషన్లో ఏడుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు, టీకా డ్రైవ్ గురించి ప్రభుత్వం సోమవారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు, కాని మరణాలు టీకాలకు సంబంధించినవి కావని పేర్కొంది.