పెరుగుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ లు ; దేనికీ లొంగని వైరస్ గా మారే ఛాన్స్ ..పెను ముప్పుపై నిపుణుల వార్నింగ్
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కరోనా నుండి బయటపడడం కోసం ప్రపంచం మొత్తం యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉండగా, కరోనా వైరస్ కూడా అంతే వేగంగా రూపాన్ని మార్చుకుంటూ విస్తరిస్తోంది. కరోనా వైరస్ లో వేగంగా కొత్త మార్పులు చోటు చేసుకొని కరోనా కొత్త రకాలు ఉద్భవిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి .
కరోనా వ్యాక్సిన్ తీసుకునే మందుబాబులకు షాకింగ్ న్యూస్ .. 45 రోజులు నో లిక్కర్ అంటున్న నిపుణులు

వేగంగా మారుతున్న కరోనా జన్యు ఉత్పరివర్తనాలు .. నిపుణుల వార్నింగ్
కరోనా వైరస్ వేగంగా ఉత్పరివర్తన చెందుతూ మరిన్ని కొత్త రకాలు ఉద్భవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు టీకాలు వేయడంలో జాప్యం జరిగే కొద్దీ కరోనా కొత్త రూపాలను సంతరించుకుంటుందని , కొత్త రకాల పెరుగుదలకు ఆస్కారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత పరీక్ష విధానాలు, చికిత్సలు, వ్యాక్సిన్ లకు సైతం లొంగని కరోనా కొత్త రకం వైరస్ పుట్టే ప్రమాదం ఉందని, ఆ పెను ముప్పు నుండి కాపాడు కోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన సాగించాలని, అలసత్వానికి తావివ్వకుండా అప్పటి వరకూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త వైరస్ రకాలు ఇప్పటివరకు సాధించిన పురోగతిని దెబ్బ తీసే ప్రమాదం
కరోనా వైరస్ లో జన్యు వైవిధ్యం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ఇంతవరకూ యుద్ధప్రాతిపదికన సాగించిన పోరాటం నిర్వీర్యం అవుతుందేమో అన్న ఆందోళన సైతం నిపుణులలో లేకపోలేదు.
ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కరోనా వైరస్ కొత్త రకాలు దెబ్బతీస్తాయనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వైరస్ రకాలను గుర్తించడం కోసం అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నియంత్రణ కోసం కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

బ్రిటన్ కరోనా రకం .. మార్చి వరకు అమెరికాలో సింహభాగం
బ్రిటన్ లో మొదలైన కరోనా కొత్త రకం వైరస్ మార్చి నెల వరకు అమెరికాలోని వైరస్ రకాల్లో అత్యధిక భాగాన్ని ఆక్రమిస్తుంది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని దీనివల్ల ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
కరోనావైరస్ ను మరింత ప్రమాదకరంగా మారే ఉత్పరివర్తన వచ్చే అవకాశం లేకపోలేదని జీవ శాస్త్రవేత్త పార్డిస్ సబేటి పేర్కొన్నారు.

టెస్ట్ లకు బయటపడని , మందులకు లొంగని వైరస్ గా మారే ప్రమాదం
2014లో ఎబోలా విజృంభణ సమయంలోనూ సదరు వైరస్ లో వచ్చిన ఒకే ఒక మార్పు తో పరిస్థితి ప్రమాదకరంగా మారిన తీరును శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. కరోనా లో కొత్తగా వచ్చే రకాలు ప్రస్తుత వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కూడా బయటపడే అవకాశం లేని విధంగా రావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని పదే పదే హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారి నుండి అప్పుడే బయటపడినట్టు కాదని వారంటున్నారు .