Sabarimala : శబరిమలలో కరోనా ఆంక్షల ఎఫెక్ట్ ..మొదటివారం దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇదే !!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తజనంతో పోటెత్తింది.మాలధారులు శరణుఘోషతో శబరిమల కొండలు మారుమోగుతాయి. అయితే ఈ సంవత్సరం కేరళ రాష్ట్రంలో విపరీతంగా ఉన్న కరోనా వ్యాప్తికి కారణంగా భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల కారణంగా, ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రమే స్వామిని దర్శించుకోవాలని, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తీసుకు వెళ్ళిన వారిని దర్శనానికి అనుమతిస్తామని, అలాగే ప్రతి రోజూ వెయ్యి మందికి, వారాంతంలో రెండు వేల మందికి దర్శనానికి అనుమతిస్తామని నిబంధన విధించిన నేపథ్యంలో భక్తులు భారీగా తగ్గారు.
Sabarimala : శబరిమల మండల పూజకు భారీగా తగ్గిన భక్తులు ... ఆలయం వద్ద కరోనా నియమాలు
మండలం- మకరవిళక్కు పూజల కోసం శబరిమలకి వెళ్ళిన భక్తులు మొదటి వారంలో కేవలం 9,000 మంది మాత్రమేనని కేరళ రాష్ట్ర స్థానిక మీడియా పేర్కొంటుంది. గత ఏడాది మొదటి వారంలో వచ్చిన భక్తులు సుమారు 300,000 మంది కాగా, ఈ ఏడాది కేవలం తొమ్మిది వేల మంది మాత్రమే శబరిమలకి వెళ్లడం గమనార్హం.
ఆన్లైన్ ద్వారా దర్శనం స్లాట్ బుక్ చేసుకునే యాత్రికులు కూడా సుమారు 40 శాతం మంది శబరిమల యాత్ర చేపట్టలేదని సమాచారం.

చాలామంది యాత్రికులు వివిధ రకాల కరోనా నిబంధనల కారణంగా, ఇబ్బందుల కారణంగా శబరి యాత్ర ను క్యాన్సిల్ చేసుకున్నారు. యాత్రికుల సంఖ్య భారీగా తగ్గిపోవడం కారణంగా ట్రావెన్కోర్ బోర్డు ఆదాయం కూడా దారుణంగా తగ్గింది. మొదటి వారంలో హుండీ లో వేసే కానుకల ద్వారా వచ్చిన ఆదాయం ఒక మిలియన్ మాత్రమే. అయితే ఇది ఇతర సాధారణ సంవత్సరాలలో మొదటి వారంలో 35 మిలియన్లుగా ఉందని సమాచారం.యాత్రికుల సంఖ్య భారీగా పడిపోవడం కారణంగా కొట్టాయం మరియు పతనమిట్ట జిల్లాల్లోని దుకాణాలు, బసలు, రెస్టారెంట్లు మరియు అనేక ఇతర వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.