• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్: 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్' వల్ల దేశంలో ఇప్పుడున్న సమస్యలు తీరిపోతాయా

By BBC News తెలుగు
|

కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో, ఆక్సిజన్ డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. దీంతో భారతీయ రైల్వే సోమవారం రాత్రి నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. మొదటి రైలు సోమవారం రాత్రి 8.05కు ముంబయి నుంచి బయల్దేరింది.

ఈ మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ముంబయిలోని కాలంబోలీ రైల్వే స్టేషన్ నుంచి ఖాళీ ట్యాంకర్లతో విశాఖపట్నం వెళ్తుంది. అక్కడ నుంచి వాటిని రీఫిల్ చేసుకుని తిరిగి ముంబయి చేరుకుంటుంది అని

రైల్వే మంత్రిత్వ శాఖ ఒక అధికారి చెప్పారు.

ఏడు ట్యాంకర్లతో వెళ్లే ఈ ప్రత్యేక రైలులో ఒక్కో ట్యాంకరులో 16 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ నింపవచ్చు. ఈ రైలు రాకపోకలకు ప్రాధాన్యం కూడా ఇవ్వనున్నారు.

ఈ రైలుతోపాటూ ఇలాంటి మరికొన్ని రైళ్లు నడిపించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్‌లో దాదాపు 20 లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో దేశంలో ఇప్పటివరకూ లక్షా 78 వేల మంది చనిపోయారు.

ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్ కొరతతో ఎంతమంది చనిపోయారు

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, మందుల కొరతతోపాటూ మెడికల్ ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది.

కరోనా రోగులకు మెడికల్ ఆక్సిజన్ అందించడం చాల కీలకం అయ్యింది.

భోపాల్‌లోని ఒక ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోయారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక రిపోర్ట్ ప్రచురించింది.

ఇక, ముంబయిలోని ఒక ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు చనిపోవడానికి కూడా ఆక్సిజన్ కొరతే కారణమని ఆరోపిస్తూ ఎన్డీటీవీ వార్తలు ప్రసారం చేసింది.

12 రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. వీటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ఉన్నాయి.

ఓవైపు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తీర్చే సామర్థ్యం లేకుండా ఉంటే, మరోవైపు ఆక్సిజన్ తయారు చేసే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దాని డిమాండ్ మరింత పెరుగుతోంది.

ఆక్సిజన్ కొరత

ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది

ప్రస్తుతం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

ఆక్సిజన్‌ను తొమ్మిది పరిశ్రమల మినహా, పారిశ్రామిక అవసరాలకు వినియోగించడాన్ని ప్రభుత్వ ఎంపవర్డ్ గ్రూప్-2 నిషేధించింది.

వాటితోపాటూ 162 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడానికి నిధులు అందించింది.

ఈ తాత్కాలిక ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు చిన్నవిగా ఉంటాయి. వీటిని సుదూర ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తారు.

కానీ, కోవిడ్ తర్వాత ఈ ప్లాంట్ల అవసరాలు తీరిపోతాయని వినాయక్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజీవ్ గుప్తా చెబుతున్నారు.

"ఈ ప్లాంట్లలో తయారయ్యే ఆక్సిజన్ స్వచ్ఛత 93 శాతం వరకూ ఉంటుంది. వాటితో అవసరాలు తీరిపోతాయి. ఒక ప్లాంట్ సామర్థ్యం ఒకటి నుంచి రెండు మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుంది" అన్నారు.

కానీ, అసలు ఆక్సిజన్ కొరత ఆ స్థాయికి ఎందుకు చేరింది.

రైలు నడపాల్సిన అవసరం ఏంటి?

భారత్‌లో సమస్య మెడికల్ ఆక్సిజన్ కొరత కాదు, దానిని అవసరమైన ప్రాంతాలకు చేర్చడమేనని నిపుణులు చెబుతున్నారు.

"కోవిడ్‌కు ముందు భారత్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6,500 మెట్రిక్ టన్నులు. అది పది శాతం పెరిగి ఇప్పుడు రోజుకు 7,200 మెట్రిక్ టన్నులకు చేరింది" అని ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సిద్దార్థ్ జైన్ అన్నారు.

కోవిడ్‌కు ముందు భారత్‌లో ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరమయ్యేదని, ఇప్పుడు ఆ రోజువారీ అవసరం దాదాపు 5 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని జైన్ చెప్పారు.

ఈ మెడికల్ ఆక్సిజన్‌ను అవసరమైన ప్రాంతాలకు పంపడం ఒక పెద్ద సవాలుగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

"ఒకవైపు మెడికల్ ఆక్సిజన్ అవసరం పశ్చిమాన ఉన్న మహారాష్ట్రలో తీవ్రంగా ఉంటే, తూర్పు భారత్‌లో ఉన్న రూర్‌కెలా, హల్దియా స్టీల్ ప్లాంట్లలో వాటి నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి" అని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ చీఫ్ సాకేత్ టీకూ చెప్పారు.

మెడికల్ ఆక్సిజన్‌ను ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా తయారైన ట్యాంకర్లు అవసరం. వాటిని క్రయోజెనిక్ ట్యాంకర్లు అంటారు.

మెడికల్ ఆక్సిజన్‌ను నిజానికి సిలిండర్లలో, క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా ద్రవ రూపంలో సరఫరా చేస్తారు.

ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్ రైలుతో ఏమవుతుంది

"క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను మైనస్ 183 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిల్వ చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాని అవసరం ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు" అని సాకేత్ టీకూ అన్నారు.

ఒక పెద్ద కంపెనీ అధికారి వివరాల ప్రకారం ఆయన కంపెనీకి 550 క్రయోజెనిక్ ట్యాంకర్లు ఉన్నాయి. గత ఏడాది నుంచీ వాటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ, రోడ్డు మార్గంలో లిక్విడ్ ఆక్సిజన్‌ను ఒక దగ్గరనుంచి మరో ప్రాంతానికి తరలించడానికి చాలా సమయం పడుతోంది.

అందుకే, ఈ రైలు ఉపయోగించడం వల్ల వల్ల ఆక్సిజన్ సరఫరా వేగంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

"రైల్లో ఆక్సిజన్ తరలించడానికి ఒక విధానం రూపొందించాం. దీనికి డిమాండ్ ఇలాగే ఉంటే, రైల్వే శాఖ క్రయోజెనిక్ ట్యాంకర్లను డిజైన్ చేసి, వాటి తయారీ గురించి కూడా ఆలోచిస్తుంది" అని ఆ అధికారి తెలిపారు.

ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంది

"గత ఏడాది సెప్టెంబర్‌లో కోవిడ్ కేసులు పీక్స్‌కు చేరుకున్నప్పుడు ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 3200 మెట్రిక్ టన్నుల వరకూ ఉంది" అని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చర్స్ అసోసియేషన్ చీఫ్ సాకేత్ టీకూ చెప్పారు.

చెప్పారు. కానీ ఆ తర్వాత కోవిడ్ రోగుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గడం మొదలైంది.

ఇండస్ట్రియల్ గ్రేడ్, మెడికల్ ఆక్సిజన్‌లో చాలా పెద్దగా వ్యత్యాసం ఉండదనే విషయం అందరూ తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ గ్రేడ్ ఆక్సిజన్ 99.5 శాతం స్వచ్ఛంగా ఉంటే.. మెడికల్ ఆక్సిజన్ 90 నుంచి 93 శాతం స్వచ్ఛంగా ఉంటుంది.

తమ కంపెనీ ఫిబ్రవరిలో 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చే 36 నెలల్లో 8 కొత్త ప్లాంట్స్ నిర్మించబోతున్నట్లు ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సిద్దార్థ్ జైన్ చెప్పారు.

"భారత్ తన ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పది శాతం పెంచింది. ఐనాక్స్‌తోపాటూ ఏ కంపెనీ అయినా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలంటే రెండేళ్లు పడుతుంది" అన్నారు.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడం గురించి మాట్లాడిన రాజీవ్ గుప్తా మెడికల్ ఆక్సిజన్‌ను కేవలం ఆస్పత్రుల్లో ఉపయోగించడం కోసమే ఉత్పత్తి చేయడం లేదని చెప్పారు.

"మెడికల్ ఆక్సిజన్‌ను ఎక్కువగా ఉక్కు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. స్టీల్ ప్లాంట్లలో ఉన్న అవసరాన్ని బట్టి మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తారు" అని ఆయన చెప్పారు.

మరోవైపు, పెరుగుతున్న కరోనా కేసుల గురించి సాకేత్ టీకూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు మన దగ్గర ఆక్సిజన్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని భరోసా ఇచ్చారు.

"ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లాంటి మరిన్ని చర్యలు తీసుకోడానికి పనులు జరుగుతున్నాయి. అయితే, అవేంటి అనేది తెలీడం లేదు" అన్నారు.

ఆక్సిజన్ సిలిండర్లు

ఆక్సిజన్ ఎలా ఉపయోగిస్తారు

మెడికల్ ఆక్సిజన్‌ను ఒక ప్రణాళిక ప్రకారం ఉపయోగించాల్సిన అవసరం ఉందని సాకేత్ టీకూ భావిస్తున్నారు.

"ఒకవైపు, గుజరాత్‌లో కరోనా రోగులకు రోజుకు 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉపయోగిస్తుంటే, మరోవైపు ఆరున్నర లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్న మహారాష్ట్రలో ప్రతిరోజూ 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. కేరళలో ప్రతి రోజూ 100 మెట్రిక్ టన్నులు కూడా ఉపయోగించడం లేదు. మేం ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెప్పాం" అని ఆయన చెప్పారు.

చాలామంది భయంతో తమ ఇళ్లలోనే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటున్నారని, దానివల్ల మన దగ్గర సిలిండర్ల సంఖ్య కూడా తగ్గిపోయిందని రాజీవ్ గుప్తా చెప్పారు.

గుజరాత్‌లో పరిస్థితి గత కొన్నిరోజులుగా దారుణంగా మారింది.

"కోవిడ్‌కు ముందు గుజరాత్‌లో ఉత్పత్తి అయ్యే వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నుంచి రోజూ 150 మెట్రిక్ టన్నులు ఆస్పత్రులకు వెళ్లేదని, ఇప్పుడు ఆ డిమాండ్ 900 మెట్రిక్ టన్నులకు పెరిగింది" అని మధురాస్ ఇండస్ట్రీస్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జిగ్నేష్ షా చెప్పారు.

"మా అమ్మ చనిపోతోంది, మా నాన్న బతకరు, నా భార్య చావు బతుకుల్లో ఉందంటున్న జనం రెండు సిలిండర్లు ఇవ్వండి, కనీసం ఒక్క సిలిండర్ అయినా ఇవ్వండి అని దీనంగా వేడుకుంటున్నారు. అది చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు" అన్నారు జిగ్నేష్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona Second Wave: Will 'Oxygen Express' solve the current problems in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X