• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సీన్ ఒక డోసు ధర రూ.250... సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి టీకా : ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

కరోనా వ్యాక్సీన్

కోవిడ్-19 వ్యాక్సీన్ ఒక డోసు ధరను రూ. 250గా నిర్ణయించినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. 45- 59 సంవత్సరాల (దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు) మధ్య వయసున్న వారికి కోవిడ్‌ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్రాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీకా ఇవ్వబోతున్నారని పత్రిక చెప్పింది.

ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లోనూ టీకా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిన్‌ 2.0 యాప్‌లో శనివారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్‌ జరుగుతోంది.

మొత్తం 2,222 టీకా కేంద్రాల వివరాలు యాప్‌లో ఉంటాయి. ఈ యాప్‌ ద్వారా అర్హులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సోమవారం నుంచి అవకాశం కల్పించనున్నారు.

యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవడం తెలియని వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సాయం అందించేలా వైద్యారోగ్య ఏర్పాట్లు చేస్తోంది.

ఇందుకు వార్డు సచివాలయ సిబ్బంది సహకారం కోసం ఆయా శాఖలను కోరింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకున్నా పుట్టిన తేదీ ఉండే కార్డు, దీర్ఘకాలిక వ్యాధులున్నట్లు వైద్యులిచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించి టీకా పొందొచ్చు.

అయితే అక్కడ ముందస్తుగా స్లాట్‌ పొందినవారు తక్కువగా ఉంటేనే నేరుగా వచ్చేవారికి టీకాకు అవకాశం కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో టీకా ఖరీదు రూ.150, సర్వీసు ఛార్జీ మరో రూ.100 కలిపి మొత్తం రూ.250 తీసుకుంటారు.

ప్రస్తుతం ఒక వయల్‌తో 10 మందికి టీకా ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియలో టీకా వృథా కాకుండా అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీకా తరలించేందుకు 26 వాహనాలను ఉపయోగిస్తున్నారు. అదనంగా మరో 52 వాహనాలను వినియోగించనున్నారు.

పీహెచ్‌సీల వరకూ టీకా తరలింపునకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. మొత్తం 17,715 మంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితా ప్రస్తుతం కొవిన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్‌సైట్‌లోనూ ఉన్నాయని ఈనాడు వివరించింది.

అవయవ దానం

'జీవన్‌దాన్‌'లో అవకతవకలు?

రోగులకు అవయవాలు అందించడంలో జీవన్‌దాన్ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

అవయవాల కోసం 'జీవన్‌దాన్‌'లో తమ పేరును నమోదు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది.

తామే ముందుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ అవయవాలు అందడంలో జాప్యం జరుగుతోందని బాధితులు అంటున్నారని పత్రిక రాసింది.

వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారిని కాదని, ఆ కింది వరుసలో ఉన్నవారికి జీవన్‌దాన్‌ అధికారులు, సిబ్బంది అవయవాలను కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనిపై బాధితులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి సర్జరీలు 'జీవన్‌దాన్‌' కిందనే చేస్తున్నారు.

అనారోగ్య కారణాల వల్ల కిడ్నీ, గుండె, కాలేయం లాంటివి పాడైన వారికి ఆయా అవయవాల అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల కారణంగా బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయనదానం చేయిస్తుంటారు.

అలా వచ్చిన అవయవాలను 'జీవన్‌దాన్‌'లో నమోదు చేసుకున్న వారిలో జాబితా ప్రకారం ముందున్న వారికిస్తారని పత్రిక చెప్పింది.

ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి 'జీవన్‌దాన్‌'లో అవయవాల కోసం పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

అయితే, వరుస క్రమంలో జాబితాలో ముందున్న వారిని కాదని, వారికి సమాచారం ఇవ్వకుండానే, ఇచ్చినట్లు చూపించి, వారు ప్రతిస్పందించడం లేదని సాకు చూపి, డబ్బులు ఎక్కువిచ్చే రోగులకు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి.

'జీవన్‌దాన్‌'లో జరుగుతోన్న అవకతవకలపై మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం విచారణకు ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ51

షార్ నుంచి నేడు( ఫిబ్రవరి 28) పీఎస్ఎల్‌వీ సీ51 ప్రయోగం జరగనుందని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.

ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది.

లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

శనివారం ద్రవ ఇంధనాన్ని నింపడంతో పాటు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టారు.

పీఎస్‌ఎల్‌వీ సీ 51 ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన అమెజానియా-1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్‌-1 నానో కాంటాక్ట్‌-2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్‌ ఇండియా పేరుతో భారత ప్రైవేట్‌ సంస్థలకు చెందిన సతీష్‌ ధవన్‌ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్‌ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారని సాక్షి వివరించింది.

హైదరాబాద్

ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటును మించిన తెలంగాణ

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డులు సృష్టిస్తోందని నమస్తే తెలంగాణ దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేస్తున్నది.

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఏడు శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరవచ్చని నాస్కాం అంచనా వేసింది.

జాతీయ వృద్ధిరేటు సగటు 1.9 శాతం ఉండవచ్చని తెలిపింది. గత మూడు త్రైమాసికాల్లో తెలంగాణ ఐటీ ఎగుమతులు ఐదు నుంచి ఆరు శాతం పెరిగాయని పత్రిక రాసింది.

కాగా, నాలుగో త్రైమాసికంలో మరింత మెరుగైన పనితీరుతో వృద్ధిరేటు 7-8 శాతానికి పెరుగగలదని హైదరాబాద్‌కు చెందిన ఎస్టీపీఐ డైరెక్టర్‌ రామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఐటీ ఎగుమతుల ద్వారా తెలంగాణ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లు దాటే అవకాశం వుందని చెప్పారు

ఎస్టీపీఐ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీమంత్రిత్వశాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తిగల సంస్థ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.1.28 కోట్లు కాగా, అంతకుముందు ఏడాదికన్నా ఇది 18 శాతం అధికం కావడం విశేషం అని నమస్తే తెలంగాణ వివరించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona vaccine costs Rs 250 a dose ... Vaccine for those over 60 from Monday: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X