• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సీన్‌ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్‌, హరామ్‌ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్‌ చెక్‌

By BBC News తెలుగు
|
మాస్కు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ దెబ్బకు విలవిలలాడుతోంది. వ్యాక్సీన్‌ తమ వరకు ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

బ్రిటన్‌లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ మొదలైంది.

అయితే వ్యాక్సీన్‌ మతపరంగా పవిత్రమా(హలాల్‌), అపవిత్రమా(హరామ్‌) అన్న అంశం ముస్లిం దేశాలలో చర్చగా మారింది.

ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ముస్లింలు ఎక్కువగా ఉంటే ఇండోనేసియా, మలేసియాల్లో ఈ చర్చ నడుస్తోంది.

ఆగ్నేయాసియాలో ఇండోనేసియా కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతం ఈ దేశంలో 6.71లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి.

ఇక్కడ కోవిడ్‌ కారణంగా సుమారు 20 వేలమందికి పైగా మరణించారు.

వ్యాక్సీన్‌లను భద్రపరచడానికి పందికొవ్వుతో చేసిన జెలెటిన్‌ అనే పదార్ధాన్ని వాడతారు

వ్యాక్సీన్‌కు 'హలాల్’ సర్టిఫికెట్

చాలా ప్రపంచ దేశాల మాదిరిగానే ఇండోనేసియా కూడా తమ దేశానికి వ్యాక్సీన్‌ తెప్పించేందుకు ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతోంది.

చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్తో ఆ దేశం ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ఈ టీకాకు ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

అయితే ఈ వ్యాక్సీన్‌కు హలాల్‌ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇండోనేసియాలోని ముస్లిం మతాధికారుల అత్యున్నత సంస్థ 'ఇండోనేసియా ఉలేమా కౌన్సిల్‌’ చైనా ఫార్మా కంపెనీని కోరడంతో వ్యాక్సీన్‌ హలాల్‌పై చర్చ ప్రారంభమైంది.

అదే సమయంలో మలేసియా కూడా ఫైజర్‌, సినోవాక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే టీకా పవిత్రమా, అపవిత్రమా అన్న అంశంపై మలేసియా ముస్లిం సమాజంలోనూ చర్చ మొదలైంది.

అయితే వ్యాక్సీన్‌ పవిత్రమా కాదా అన్నదానిపై ఒక్క ఇండోనేసియా, మలేసియాలలోనే కాక ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలలో చర్చ జరుగుతోందని సోషల్‌ మీడియాలో ప్రచారం నడుస్తోంది. కానీ అది నిజం కాదు.

అలాగే కొన్ని ముస్లిం దేశాలు ఈ వ్యాక్సీన్‌ను అపవిత్రమైనదిగా ప్రకటించినట్లు చాలామంది సోషల్‌ మీడియా యూజర్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. కానీ ఇది కూడా నిజం కాదు.

ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు హలాల్ సర్టిఫికెట్‌ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది ?

ఇస్లాం మతాన్ని అనుసరించేవారు తాము స్వీకరించే పదార్ధాల విషయంలో దైవ అంగీకారం ఉన్నవి(పవిత్రం-హలాల్), దైవ అంగీకారంలేనివి(అపవిత్రం-హరామ్‌) అన్న విధానం పాటిస్తారు.

హరామ్ అంటే నిషేధిత పదార్ధం లేదా వస్తువు. ఉదాహరణకు మద్యంలాంటివి

ఇటీవలి కాలంలో ఇస్లామిక్‌తోపాటు, ఇస్లామికేతర దేశాలలో కూడా సౌందర్య సాధనాలలో హలాల్‌ విధానాన్ని అనుసరించే వారి సంఖ్య పెరిగింది.

అయితే కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కూడా ఈ హలాల్‌, హరామ్‌ చర్చ ఎందుకన్న సందేహం రావడం సహజం.దీనికి కారణం ఉంది. పంది ఎముక, చర్మం నుంచి తీసిన జెలెటిన్‌ అనే కొవ్వును వ్యాక్సీన్‌ను ఎక్కువకాలం భద్రపరచడం కోసం ఉపయోగిస్తారు.

అయితే చాలా కంపెనీలు దీని అవసరం లేకుండానే టీకాలను తయారు చేస్తున్నాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్‌ ఫార్మా కంపెనీ పంది నుంచి తీసిన ఎలాంటి పదార్ధాలను వాడకుండా వ్యాక్సీన్‌ను రూపొందించడంలో విజయవంతమైందని ఏపీ వార్తా సంస్థ వెల్లడించింది.

అదే సమయంలో సౌదీఅరేబియా, మలేసియాలో పని చేస్తున్న ఏజే ఫార్మా కూడా ఇలాంటివేవీ లేకుండా సొంతంగా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో ఉంది.

అయితే హలాల్‌, హరామ్‌ చర్చ ఇక్కడితో ముగిసిపోలేదు. కేవలం పంది కొవ్వు నుంచి తీసిన జెలెటిన్‌తో వ్యాక్సీన్‌ భద్రపరచడం ఒక్కటే కాకుండా, పంది డీఎన్‌ఏను కూడా వ్యాక్సీన్‌ తయారీలో వాడతారన్న చర్చ జరుగుతోంది.

అయితే తాము ఆ డీఎన్‌ఏను వాడినట్లు సినోవాక్‌ సంస్థ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

టీకా

మనిషి ప్రాణానికే విలువ

పంది జెలెటిన్‌ వాడకం గురించి ముస్లింలలోనే కాకుండా యూదులలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

యూదు ధర్మాన్ని పాటించేవారు పందిమాంసాన్ని, దానితో తయారు చేసిన పదార్ధాలను తాకరు.

మరి ఈ పంది జెలెటిన్‌ కారణంగా ఈ రెండు మత వర్గాల వారు వ్యాక్సీన్‌ను ఉపయోగించరా ? అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని జోధ్‌పూర్‌లోని మౌలానా ఆజాద్‌ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ అక్తరుల్‌ వాసే బీబీసీతో అన్నారు.

“మనిషి ఆకలితో, తినడానికి ఏమీ లేక చనిపోయే పరిస్థితిలో హరామ్ కూడా హలాల్ అవుతుంది. ఇది ఇస్లామిక్ న్యాయ చట్టంలో ఉంది. కరోనా వ్యాక్సిన్‌ కూడా అలాంటిదే. ఈ అంశంపై చర్చ కారణంగా ఇస్లామిక్‌ సమాజానికి చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదు’’ అన్నారు.

ముస్లిం దేశాల నుండి అభ్యంతరాలు

ప్రారంభంలో పోలియో వ్యాక్సిన్ విషయంలో పాకిస్తాన్‌ సహా కొన్ని ముస్లిం దేశాలలో అభ్యంతరం వ్యక్తమైంది.

"పోలియో వ్యాక్సీన్‌ విషయంలో ఏం జరిగిందో మనం చూశాం.

భారతదేశంలోని ముస్లిం మత పెద్దలు పోలియో టీకా ప్రాధాన్యాన్ని అర్ధం చేసుకున్నారు.

దాన్ని ఆహ్వానించి దేశంలో పోలియోను పారదోలడంలో ఎంతో సహకరించారు’’ అన్నారు ప్రొఫెసర్‌ వాసె.

“ఇప్పుడు బ్రిటన్‌లో కొత్త రూపంలో కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. ఈ సందర్భంలో కరోనా వ్యాక్సీన్‌ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇది మానవ జీవితానికి సంబంధించింది’’ అన్నారు వాసె.

అయితే ఇండోనేసియాలోని ఇస్లామిక్‌ మతాధికారుల అత్యున్నత సంస్థ ఉలేమా కౌన్సిల్‌ మాత్రం కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌కు హలాల్ సర్టిఫికెట్ కోరుతోంది.

పందికొవ్వు వాడకంపై చర్చ

ముస్లిం దేశాలలో హలాల్‌, ఇంకా హరామ్‌ టీకాలు రెండూ అందుబాటులో ఉంటే ఏది ఉపయోగించాలి? దీనికి ప్రొఫెసర్‌ వాసె సమాధానం చెప్పారు. “రెండింటిలో ఏది ప్రభావవంతమైందో అదే వాడాలి’’ అన్నారు.

“యూదు మతం సహజంగా పందిమాంసం వినియోగాన్ని నిషేధిస్తుంది’’ అని ఇజ్రాయెల్‌లోని రబ్బినికల్ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ రబ్బీ డేవిడ్‌ స్టో వార్తా సంస్థ ఏపీకి తెలిపారు.

అయితే నోటి ద్వారా కాకుండా ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నారు కాబట్టి కోవిడ్‌ వ్యాక్సీన్‌పై ఎలాంటి ఆంక్షలు అవసరం లేదని ఆయన అన్నారు.

పందికొవ్వు వాడకంపై చర్చల నడుమ తాము పోర్క్‌ జెలెటిన్‌ను వాడటం లేదని ఫైజర్, మోడెర్నా,ఆస్ట్రాజెనెకా కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి.

వీటికి మద్దతుగా ఇస్లామిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రిటన్‌ (బ్రిటీష్ ఐఎంఎ) కూడా ఫైజర్‌ వ్యాక్సీన్‌ అన్ని విధాల సురక్షితమైందని ప్రకటించింది.

ఈ కంపెనీ టీకానే ప్రస్తుతం బ్రిటన్‌లో అనుమతించినందున ఈ ప్రకటన కేవలం ఫైజర్‌ కంపెనీకే వర్తిస్తుందని బ్రిటీష్ ఐఎంఎ ఆ ప్రకటనలో తెలిపింది.

ఈ టీకా కోసం ముస్లిం ఆరోగ్య కార్యకర్తలు, ఇస్లాం మతపెద్దలు, అనేక ఇస్లామిక్‌ సంస్థలతో చర్చించామని ఫైజర్‌ వెల్లడించింది.

ఈ వ్యాక్సీన్‌లో జంతువులకు సంబంధించిన ఎలాంటి పదార్ధాలు ఉపయోగించలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Halal and Haram debate started in Muslim countries over corona vaccination. How far is it true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X