• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వైరస్: కోవిడ్ రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెరగడానికి అదే కారణమా

By BBC News తెలుగు
|

కోవిడ్ టెస్టులు

విశాఖపట్నానికి చెందిన రాజుకు ఇటీవల కొద్దిపాటి జ్వరం వచ్చి తగ్గిపోయింది. ఎందుకైనా మంచిదని ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించారు. శాంపిల్ తీసుకుని వారం రోజులైనా రిజల్ట్ రాలేదు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హరికిశోర్ ఏప్రిల్ 26న కోవిడ్ టెస్ట్‌ కోసం శాంపిల్ ఇచ్చారు. రిపోర్ట్ రాలేదు. శ్రీకాళహస్తిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆయన మళ్లీ ప్రైవేటుగా టెస్ట్ చేయించుకోలేక, ఆ రిపోర్ట్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.

నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన వారికి రిపోర్ట్ ఆలస్యంగా ఇస్తారని రాజుకు మిత్రుడెవరో చెప్పారు. వారం రోజులు ఆగాక, ఇక తనది నెగెటివ్ కావచ్చని భావించిన ఆయన, ఎప్పటిలాగే కంచరపాలెం రైతు బజారులోని కూరగాయల దుకాణంలో తన పనిలోకి దిగి పోయారు. ఈలోగా వందల మందిని ఆయన కలిశారు. రెండ్రోజుల తర్వాత పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

శాంపిల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే రిపోర్టు కోసం అధికారులను హరికిశోర్ అడగడం మొదలు పెట్టారు. ఒకవేళ పాజిటివ్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు నన్ను కలిసిన వారి పరిస్థితి ఏంటి? అని హరికిశోర్ ఆందోళన చెందుతున్నారు. ఈ కథనం రాసేటప్పటికి కూడా ఆయన రిపోర్ట్ రాలేదు.

ఫలితాల కోసం నిరీక్షిస్తున్న రోగులు

ఫలితాలు ఆలస్యంతో వైరస్ వ్యాప్తి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్న వారి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్‌ ఫలితాలు రావడానికి కనీసం వారం రోజులు, గరిష్ఠంగా 10 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ చేయించుకున్న కొందరికైతే ఫోన్‌ మెసేజ్‌లు కూడా రావడం లేదు. మరికొందరికి ఆలస్యంగా వస్తోంది.

టెస్టుల ఫలితాలు ఆలస్యం కారణంగా బాధితుల నుంచి ఇతరులకు కరోనా వ్యాపిస్తోంది.

జ్వరం, జలుబు, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు లాంటివి కరోనా ప్రాథమిక లక్షణాలు.

కరోనా సోకిందా, సోకలేదా అన్నది తేలాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే రిపోర్టే ఆధారం. కానీ రిపోర్టు వచ్చే వరకు చాలమంది ఎప్పటిలాగే ప్రజల్లో తిరుగుతున్నారు. వారివల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటోంది.

రాష్ట్రంలో రోజుకు లక్షకు పైగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ ఫలితాలు ఏ రోజువి అన్నది తెలియదు.

కరోనా టెస్టింగ్ రిపోర్ట్స్ వస్తున్న సరళిని బట్టి చూస్తే అవి కనీసం వారం రోజులు కిందట చేసిన పరీక్షల ఫలితాలుగానే పరిగణించాల్సి వస్తుంది. రిపోర్టులు వేగంగా అందించాలని బాధితులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కరోనా

ఛార్జీలను భరించడం కష్టం...

రాజేంద్ర కుమార్ గుంటూరులోని ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఎడిటర్‌గా పని చేస్తుంటారు. ఏప్రిల్ 25న జలుబు, జ్వరం వచ్చింది. కోవిడ్‌ కావచ్చనే అనుమానంతో ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ చేయించారు. వారమైనా ఫలితం రాలేదు.

''రిపోర్ట్ అడిగితే టీకాల డ్యూటీలో ఉన్నాం, స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు. అందుకే టైమ్ పడుతోందని చెప్పారు. ఆలస్యం చేయడం మంచిది కాదని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో రూ.2 వేలు చెల్లించి టెస్ట్ చేయించుకున్నాను. పీపీఈ కిట్, ట్రావెలింగ్ ఛార్జెస్ అంటూ మరో రూ.800 తీసుకున్నారు. మరుసటి రోజే రిపోర్ట్ ఇచ్చారు. పాజిటివ్ వచ్చింది. డాక్టరు చెప్పిన మందులు వెంటనే తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం బాగున్నాను. గవర్నమెంట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తే చాలా ఇబ్బంది అయ్యేది.'' అని రాజేంద్రకుమార్ బీబీసీతో చెప్పారు.

కోవిడ్ టెస్టుల ఫలితాల కోసం వచ్చినవారు

కేసులు పెరిగాయి... సమస్యలు అలాగే ఉన్నాయి

రిపోర్ట్‌లు ఆలస్యంగా ఎందుకు వస్తున్నాయనే విషయంపై అధికారులతో బీబీసీ మాట్లాడింది.

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ కేసులు వస్తున్నాయని, ప్రభుత్వం పరీక్ష కేంద్రాల కెపాసిటీని పెంచినా, శాంప్లింగ్ చాలా ఎక్కువ చేస్తుండటం, అలాగే స్వాబ్ తీసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి టెస్ట్ కోసం తీసుకెళ్లడం రిపోర్ట్ ఆలస్యమవడానికి కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు.

''ఆర్టీ-పీసీఆర్ విధానంలో స్వాబ్ తీసిన తర్వాత మా దగ్గరల్లోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు పంపించాలి. దాని కోసం ప్రభుత్వం ఒక వ్యాన్ ను అందుబాటులో ఉంచింది.

అయితే ఈ వ్యాన్ మా వద్ద ఉన్న స్వాబ్స్‌తో పాటు చుట్టూపక్కల ఉన్న అన్నీ ఆరోగ్య కేంద్రాల స్వాబ్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తుంది. దానికే రెండు రోజుల సమయం పడుతుంది. దాంతో స్వాబ్ ల్యాబ్‌కు మూడో రోజు చేరుకుంటుంది.

దానిని పరీక్షించడం నాలుగో రోజు, వెబ్‌సైట్ లోకి అప్‌లోడ్ చేయడానికి ఐదో రోజు వరకు సమయం పడుతుంది. అలాగే శాంప్లింగ్ కూడా చాలా ఎక్కవ జరుగుతుండటంతో అన్నింటిని పరీక్షించలేకపోతున్నారు.'' అని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ఇంఛార్జ్ సూపరింటెండెంట్ ఆర్‌సీఎం రెడ్డి బీబీసీతో అన్నారు.

''100 నుంచి 150 శాంపిల్స్ అయితే మరుసటి రోజు రిపోర్ట్ ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. నాలుగు రెట్లు అధికంగా టెస్టులు చేయాల్సి వస్తోంది.'' అని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ కరోనా

టెస్టులు చేస్తున్నవారికి పాజిటివ్...అందుకే ఆలస్యం

ఏపీలో ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు రావడానికి చాలా ఎక్కువ సమయం పట్టడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఆలస్యమైతే పరీక్షలు వచ్చేసరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు.

అయితే, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ సుధాకర్ బీబీసీతో అన్నారు.

డాక్టర్ పీవీ సుధాకర్

''టెస్టులు చేసే సిబ్బంది చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరందరు 14రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. కొత్త సిబ్బంది కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్ రన్ చేస్తే మొదట్లో స్పందన రాలేదు. అవగాహన కల్పించడంతో కొత్తవారు వచ్చారు. అయితే మళ్లీ వాళ్లకి టెస్టింగ్, ఫలితాల అప్‌లోడింగ్‌‌పై ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది కూడా ఆలస్యానికి ఓ కారణం.'' అని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు.

కోవిడ్ టెస్ట్ రిపోర్టు

రిజెక్ట్ అని ఎందుకు వస్తుంది?

''శాంపిల్ తీసిన తర్వాత మూడు రోజుల లోపు దానిని టెస్ట్ చేయాలి. ఆ తర్వాత చేస్తే కాస్త ఫలితాలు అనుమానించాల్సి వస్తుంది. అందుకే స్వాబ్ తీసిన వెంటనే మూడు రోజుల లోపే దానిని టెస్ట్ చేస్తాం. కానీ ఇంతకు ముందు రిజల్ట్స్ అందించడం వివిధ కారణాలతో ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఆ సమస్య లేదు.

ఇక శాంపిల్ ఏ కారణం వల్లనైనా ఎక్కువ రోజులు టెస్ట్ చేయలేకపోతే అవి రిజెక్ట్ అవుతాయి. అలాగే కొందరి శాంప్లింగ్ సరిగా జరగదు. అటువంటివాటిని పరీక్ష చేయలేం. ఇటువంటి సందర్భాల్లో బాధితులకు 'రిజెక్ట్' అని చూపిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. త్వరగా రిపోర్టులు ఇస్తున్నాం'' అని డాక్టర్ సుధాకర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కరోనా

టెస్ట్ చేయించుకుంటే...క్వారంటైన్ లో ఉండాల్సిందే...

టెస్ట్ రిపోర్ట్స్ ఆలస్యం కారణంగా...బాధితులు అందరితో కలిసి తిరగడాన్ని వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. కరోనా ఉన్నట్లు అనుమానం ఉన్నవాళ్లే టెస్టులు చేయించుకుంటారు.

కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం శాంపిల్ ఇచ్చిన వాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితం వచ్చే దాకా నాకు కరోనా రాలేదు అనుకోవడం తప్పని వారు అంటున్నారు.

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి

ప్రస్తుతానికి ఆర్టీ-పీసీఆర్ టెస్టే గోల్డ్ స్టాండర్ట్...

కరోనా నిర్థరణ పరీక్షల కోసం ఇప్పటి వరకూ ర్యాపిడ్ టెస్ట్, ట్రూనాట్, ఆర్టీ-పీసీఆర్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ట్రూనాట్,ర్యాపిడ్ పద్ధతిలో చేసే పరీక్షల ద్వారా వచ్చే ఫలితాలు అంత సంతృప్తికరంగా లేకపోవడంతో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను ఏపీ ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ టెస్టు మీద కూడా నమ్మకం లేని కొందరు సీటి స్కాన్ చేయించుకుంటున్నారు. అయితే ఇది అంత మంచింది కాదని వైద్య నిపుణులు అంటున్నారు.

''కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో ఆర్టీ-పీసీఆర్ నే గోల్డ్ స్టాండర్ట్ టెస్ట్‌గా ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతానికి ఇంతకు మించిన మార్గం కూడా లేదు. అయితే, శ్వాబ్స్ శాంపిల్స్ పరీక్షించి...ఫలితాలను అందించేందుకు చాలా సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే సిబ్బంది రిక్రూట్ మెంట్ చాలా త్వరగా జరగాలి. అలాగే ఎక్కువ ఖచ్చితత్వంతో వేగంగా పరీక్ష ఫలితాలను ఇచ్చేందుకు అనుకూలంగా ఉండే మరేదైనా టెస్టింగ్ విధానాన్ని కనుగొనాలి.'' అని ప్రజా ఆరోగ్య వేదిక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వర రావు బీబీసీతో అన్నారు.

కోవిడ్ కాల్ సెంటర్ కు సోమవారం (10.05.21) ఒక్కరోజే కరోనా టెస్టుల కోసం 3 వేల 4 వందల కాల్స్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

కోవిడ్ టెస్టింగ్,ఇతర వైద్యవసరాల కోసం సిబ్బంది రిక్రూట్ మెంట్ జరిగిన కాబట్టి ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని సింఘాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona virus: Why are the Covid reports being delayed Is it the reason for the increase in cases in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X