కరోనా వార్నింగ్: 3వేలను దాటి పెరుగుతున్న రోజువారీ కేసులు; క్రియాశీల కేసుల్లో జంప్
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో శనివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో 3,688 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మునుపటి రోజుతో పోలిస్తే భారతదేశం రోజువారీ కరోనావైరస్ కేసులలో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలో తాజాగా 50 మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణించిన వారి సంఖ్య 5,23,803కి చేరుకుంది. గత 24 గంటల్లో మరణించినవారిలో కేరళ రాష్ట్రం నుండి 45 మంది ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 18,684 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రమంగా క్రియాశీల కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.04 శాతం ఉన్నాయి.

గత 24 గంటల్లో 883 యాక్టివ్ కేసులు పెరగగా, శుక్రవారం 2,755 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుండి కోలుకున్న వారికంటే కరోనా బారిన పడుతున్న వారే పెద్ద సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు 4.96 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 1,600 కరోనా కేసులు నమోదు కాగా, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో క్రియాశీల కేసులు 5,609కి చేరుకున్నాయి.
ప్రస్తుతం రికవరీ రేటు 98. 74శాతంగా నమోదయింది. గత 24 గంటల్లో 22.5 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ నేషన్ చేయించుకోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తంగా 188 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.భారత్ లో ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ ఆందోళన నేపధ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు.