• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: భారతదేశంలో మహమ్మారి వ్యాప్తి ముగింపు దశకు చేరుకుందా?

By BBC News తెలుగు
|

కరోనావైరస్ ఇండియా
Click here to see the BBC interactive

భారతదేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పడిపోవడం... కొందరు భావిస్తున్నట్లు ఆసక్తికరమైన నాటకీయ పరిణామమా?

కోవిడ్-19 వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని తొలినాళ్లలో చాలా మంది నిపుణులు జోస్యం చెప్పిన ఈ దేశంలో కరోనా మహమ్మారి స్థిరంగా తిరోగమిస్తోందా?

భారతదేశంలో మహమ్మారి నెమ్మదిస్తున్నట్లు ఎందుకు కనిపిస్తోందనే అంశంపై అక్టోబరులో నేను విస్తృతంగా రాశాను. సెప్టెంబర్ మధ్యలో కేసుల సంఖ్య రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. అప్పుడు పది లక్షల కన్నా ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత టెస్టులు స్థిరంగా కొనసాగుతున్నా, దిల్లీ వంటి నగరాల్లో అనూహ్యంగా కొంతమేర కేసులు పెరిగినా.. దేశవ్యాప్తంగా రోజువారీ మరణాలు, కేసుల సంఖ్య పడిపోవటం మొదలైంది.

అప్పటినుంచి పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. గత వారం మధ్యనాటికి దేశంలో రోజుకు 10,000 కేసులు కూడా నమోదు కావటం లేదు. ఈ మహమ్మారి వల్ల మరణాల సంఖ్య రోజుకు సగటున 100 కంటే తగ్గిపోయింది. దేశంలోని రాష్ట్రాల్లో సగానికి పైగా ఎటువంటి కోవిడ్ మరణాలూ నమోదు చేయటం లేదు. ఒకప్పుడు మహమ్మారి విజృంభణ కేంద్రంగా ఉన్న దిల్లీలో గురువారం నాడు ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఇలా జరగటం పది నెలల్లో ఇదే మొదటిసారి.

భారతదేశంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య కోటి దాటింది

ఇప్పటివరకూ భారతదేశంలో కోటి మందికి పైగా వైరస్ సోకినట్లు నమోదైంది. ప్రపంచంలో అత్యధిక కేసుల సంఖ్యలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ వ్యాధి వల్ల 1,50,000 మందికి పైగా చనిపోయినట్లు నమోదైంది.

ఈ మరణాల రేటు పది లక్షల మందికి 112గా ఉంది. ఇది.. యూరప్, ఉత్తర అమెరికాల్లో నమోదైన మరణాల రేటు కన్నా చాలా తక్కువ. కేసుల సంఖ్య తగ్గిపోవటానికి కారణం.. టెస్టుల సంఖ్యను తగ్గించటం కాదనే విషయం కూడా స్పష్టం.

చాలా మహమ్మారుల పెరుగుదల, తగ్గుదల గంట ఆకారపు వంపులో ఉంటుంది. అందుకు భారతదేశం మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి తీరుకు అనుగుణంగా.. భారతదేశంలోనూ తీవ్ర జనసమ్మర్థం ఉన్న నగరాల్లో నివసించే ప్రజల్లో 65 ఏళ్లకు పైబడిన వారిలో కేసులు, మరణాల నిష్పత్తి కూడా ఎక్కువగా ఉంది.

''భారతదేశంలో మహమ్మారి క్షీణించటంలో అసాధారణమైన విషయం ఏమీ లేదు. ఇక్కడేదో అద్భుతం జరగలేదు’’ అంటారు ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్.

ఇతర దేశాలతో పోలిస్తే కేసులు, మరణాల తీవ్రత తక్కువగా ఉండటానికి కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

''ఇందుకు కారణాలు ఏమిటనే వివరణలు మనకు ఇంకా లభించలేదు. అయితే.. భారతదేశం హెర్డ్ ఇమ్యూనిటీని (సామూహిక రోగనిరోధకతను) ఇంకా సంతరించుకోలేదనే విషయం మాత్రం మనకు తెలుసు’’ అని మహమ్మారి వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో బయోస్టాటిస్టిక్స్, ఎపిడిమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ చెప్పారు.

సామూహిక వ్యాక్సినేషన్ ద్వారా కానీ, వ్యాధి సామూహికంగా ప్రబలటం వల్ల కానీ.. జనాభాలో పెద్ద భాగం సదరు వ్యాధిని నిరోధించగలిగే స్థాయికి చేరుకున్నపుడు హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది.

భారతదేశంలో కరోనావైరస్

భారతదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా ఎందుకు రాలేదు?

తాజా సీరో సర్వే - జనాభాలో యాంటీబాడీలను గుర్తించే అధ్యయనం – వయోజనుల్లో 21 శాతం మందికి, చిన్నారుల్లో 25 శాతం మందికి ఇప్పటికే ఈ వైరస్ సోకినట్లు సూచిస్తోంది.

నగరాల్లోని పేదల వాడల్లో నివసించే జనాభాలో 31 శాతం మంది, ఇతర పట్టణ ప్రాంత జనాభాలో 26 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలో 19 శాతం మందికి ఈ వైరస్ సోకినట్లు కూడా గుర్తించారు.

అయితే.. పుణె, దిల్లీ వంటి పెద్ద నగరాల్లో 50 శాతం మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని చెప్తున్నారు. అంటే ఈ ప్రాంతాలు హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉన్నాయని సంకేతం.

ఈ సంఖ్యలు కూడా తక్కువేనని నిపుణులు చెప్తున్నారు.

''దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీని సంతరించుకున్నదని భావించగల ప్రాంతం ఏదీ లేదు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న ప్రాంతాల్లో అది జరిగి ఉండవచ్చు’’ అని దిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

అంటే, కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఆ వైరస్ ఇంకా సోకని వారికి తమ సమాజాల్లో రక్షణ లభించవచ్చు. కానీ, వారు ఆయా ప్రాంతాల నుంచి వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించినట్లయితే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

ముంబయిలో కరోనావైరస్ పోస్టర్

మరి కేసుల సంఖ్య ఎందుకు పడిపోతోంది?

ఇందుకు కొన్ని విభిన్న కారణాలు ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ ఉండటం ఒక కారణం.

చిన్నవైన పట్టణాలు, గ్రామాల కన్నా కానీ.. నగరాల్లో, ప్రత్యేకించి సమ్మర్థం ఎక్కువగా ఉండే స్లమ్‌లలో, అభివృద్ధి చెంది. పట్టణీకరణ జరిగిన జిల్లాల్లో సైతం ఎక్కువ మందికి కరోనావైరస్ సోకింది. ఈ ప్రాంతాలన్నిటిలో జనం వైరస్‌కు గురవటంలో గణనీయమైన తేడాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు కేసుల సంఖ్య నెమ్మదించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా అంతుచిక్కటం లేదు.

''కరోనావైరస్‌ సోకిన వారి సంఖ్య సర్వేలు సూచిస్తున్న దానికన్నా ఎక్కువగా ఉందనేది నా భావన. అదీగాక భారతదేశాన్ని ఒకే నమూనాగా మనం పరిగణించకూడదు. దిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో 60 శాతం మంది వరకూ జనంలో ఈ వైరస్ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఇందులో చాలా వ్యత్యాసాలున్నాయి’’ అని వైరాలజిస్ట్ డాక్టర్ షహీద్ జమీల్ పేర్కొన్నారు.

ఇక భారతదేశం చాలా కేసులను నమోదు చేయలేదని, ఇప్పటికీ చాలా కేసులు లెక్కలోకి రాకుండా పోతున్నాయనేది మరో వివరణ. వైరస్ సోకిన వారిలో చాలా మందికి అసలు ఎటువంటి లక్షణాలూ లేకపోవటమో, వైరస్ చాలా తక్కువ స్థాయిలో సోకటమో దీనికి కారణం.

''చాలా తేలిక స్థాయి ఇన్‌ఫెక్షన్లు, లక్షణాలు కనిపించని కేసులు భారీగా ఉన్నట్లయితే.. మనం ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువై ఉంటాం. ఒకవేళ అదే నిజమైతే.. భారతీయుల్లో ఇంత ఎక్కువ మందికి అంత తక్కువ స్థాయి ఇన్‌ఫెక్షన్లు ఉండటానికి కారణమేమిటనేది మనం వివరించాల్సి ఉంటుంది’’ అని ఈ మహమ్మారిని అధ్యయనం చేస్తున్న దిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలో పార్థా ముఖోపాధ్యాయ్ పేర్కొన్నారు.

కోవిడ్ కేసులు తగ్గడంతో ఫిబ్రవరి 11న ప్రయాగరాజ్ కుంభమేలా వద్ద జన సందోహం

మరణాల రేటు తక్కువగా ఉండటం వెనుక ఏదైనా రహస్యముందా?

కోవిడ్ కారణంగా చనిపోయిన భారతీయుల సంఖ్య అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నదానికన్నా చాలా ఎక్కువగా ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మరణాలను ధృవీకరించటంలో భారత రికార్డు చాలా బలహీనంగా ఉంది. చాలా మంది జనం ఇళ్ల దగ్గరే చనిపోతుంటారు.

అయినాకానీ ఇంతటి స్థాయిలో తక్కువగా నమోదైనా కూడా ప్రజల్లో భయాందోళనలు కానీ, ఆస్పత్రులు నిండిపోవటం కానీ జరగలేదు. దేశంలో సుమారు ఆరు లక్షల గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి రోజూ రికార్డుల్లోకి ఎక్కని ఒక కేసు, ఒక మరణం చొప్పున సంభవించినా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై పెను భారం పడదు.

వైరస్ వ్యాప్తిని నిలువరించటానికి భారతదేశం చాలా ముందుగానే మార్చి చివర్లో సంపూర్ణ షట్‌డౌన్ విధించింది. దాదాపు 70 రోజుల వరకూ కొనసాగిన ఈ లాక్‌డౌన్.. నిజంగానే చాలా ఇన్‌ఫెక్షన్లు, మరణాలను నివారించిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

తీవ్రంగా దెబ్బతిన్న నగరాల్లో ఫేస్ మాస్కుల వినియోగం, భౌతిక దూరం, స్కూళ్లు, ఆఫీసుల మూసివేత, జనం ఇళ్ల నుంచే పనిచేయటాన్ని కొనసాగించటం వల్ల వైరస్ వ్యాప్తి నెమ్మదించింది.

జనాభాలో ఎక్కువ మంది యువతరం ఉండటం, రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం, నగరాలతో పెద్దగా సంబంధాలు లేని గ్రామీణ ప్రజానీకం విస్తారంగా ఉండటం, జన్యుపరమైన అంశాలు, అపరిశుభ్రత, ఊపిరితిత్తులకు తగినంత రక్షణ ప్రొటీన్ ఉండటం వంటి పలు అంశాలు కూడా దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా.. గాలి ప్రవాహం సరిగా లేని గదుల్లో గాలిలో తేలియాడే వైరస్ వల్ల వ్యాపించిందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే దేశ జనాభాలో 65 శాతం మందికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ, అక్కడే పనిచేస్తుంటారు. ఆరకంగా చూసినపుడు భారత్‌ కన్నా బ్రెజిల్ దాదాపు మూడు రెట్లు ఎక్కువగా పట్టణీకరణ చెందిన దేశం. అక్కడ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధిక సంఖ్యలో ఉండటాన్ని ఈ అంశం పాక్షికంగా వివరిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇక నగరాల్లో అత్యధిక శ్రామికశక్తి అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఉంది. అంటే.. వారిలో నిర్మాణ కార్మికులు, వీధి విక్రేతలు వంటి చాలా మంది గదుల్లో, మూసివేసి ఉన్న ప్రాంతాల్లో పనిచేయరు.

''బహిరంగ ప్రాంతాల్లో, పాక్షిక బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారికి వైరస్ సోకే ప్రమాదాలు తక్కువ’’ అని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు.

భారతదేశంలో కరోనావైరస్

సెకండ్ వేవ్‌ను ఇండియా తప్పించుకుందా?

ఆ విషయం ఇప్పుడే చెప్పలేం.

దేశంలో రుతుపవనాలు ప్రారంభమవటంతోనే ఇన్‌ఫెక్షన్ల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చునని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ వర్షాలతో పాటే దేశంలో ఇన్‌ఫ్లుయెన్జా సీజన్ కూడా మొదలువుతంది. ఈ కాలం ప్రతి ఏటా జూన్‌తో మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. దక్షిణాసియా అంతటా వరదలు ముంచెత్తుతాయి.

''రాబోయే రుతుపవనాల సీజన్ ప్రారంభం చాలా కీలకం అవుతుంది. ఆ సీజన్ ముగిసిన తర్వాత మాత్రమే దేశంలో ఈ మహమ్మారి నిజంగానే అంత్య దశకు చేరుకుందా అనేదానిని మనం సరిగ్గా అంచనా వేయగలం’’ అని పేరు ప్రచురించటానికి ఇష్టపడని ఎపిడమాలజిస్ట్ ఒకరు పేర్కొన్నారు.

అయితే.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బ్రిటన్‌లలో గుర్తించిన కొత్త రకం కరోనావైరస్‌లు అసలైన ప్రమాదాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

భారతీయుల్లో చాలా మందికి ఇప్పటికీ కోవిడ్-19 సోకనందున.. కరోనావైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి ఓ శక్తివంతమైన కరోనా రకం సులభంగా ప్రయాణించి మహమ్మారిగా వ్యాపించే అవకావం ఉంది.

భారతదేశంలో కరోనావైరస్

జనవరి చివరి వరకూ భారతదేశంలో బ్రిటన్ రకం కరోనావైరస్ కేసులు 160కి నమోదయ్యాయి. మిగతా రకాలు కూడా ఇప్పటికే దేశంలో వ్యాపిస్తున్నాయా లేదా అనేది ఇంకా తెలీదు. ఇక ఇక్కడే రూపుమారిన కొత్త రకం కరోనావైరస్‌లు కూడా వ్యాపించే అవకాశమూ ఉంది.

బ్రిటన్ రకాన్ని సెప్టెంబరులో కెంట్‌లో గుర్తించారు. ఆ తర్వాత రెండు నెలలకు కానీ అది పూర్తిస్థాయి వెల్లువలా మారలేదు. అప్పటి నుంచీ 50 పైగా దేశాల్లో ఆ వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడది ప్రపంచంలో అత్యంత బలమైన రకంగా మారబోతోంది.

భారతదేశంలో శాస్త్రపరిశోధన శాలలు తగినన్ని ఉన్నప్పటికీ.. జీనోమ్ క్రోడీకరణ మాత్రం అక్కడక్కడ మాత్రమే జరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

''కరోనావైరస్ కొత్త రకాలుగా రూపొందటం చాలా పెద్ద విషయం. అది మన లెక్కలన్నిటినీ తారుమారు చేయవచ్చు. మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. కొత్త రకాలను గుర్తించటం కోసం మన ల్యాబ్‌లు జీనోమ్ క్రోడీకరణను పెంచాలి’’ అని డాక్టర్ జమీల్ అభిప్రాయపడ్డారు.

ఇక దేశంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నెల రోజుల లోపు సుమారు 60 లక్షల టీకాలు ఇచ్చారు. సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రతను తగ్గించటానికి.. ఆగస్టు నాటికి మూడు కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పుడప్పుడే ఉదాసీనంగా ఉండటానికి అవకాశం లేదు. జనం పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఫేస్‌మాస్కుల వినియోగం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటాన్ని కొనసాగించాలని డాక్టర్లు, శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus cases in India coming to an end
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X