Coronavirus: ఇద్దరు మంత్రులు బలి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మృతిపై సీబీఐ విచారణ, శివసేన !
ముంబై/ లక్నో/ న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వెంటనే సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు బయటకు తియ్యాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. మంత్రి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కరోనా వైరస్ (COVID 19) వ్యాధితో మరణించలేదని శివసేన ఆరోపించింది. చేతన్ చౌహాన్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని శివసేన నాయకులు గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. వైద్యులు నిర్లక్షంగా చికిత్స చెయ్యడం వలనే మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ లీడర్ సునీల్ సింగ్ సాజన్ ఆరోపించారు. మొత్తం మీద సిట్టింగ్ మంత్రి, మాజీ క్రికెట్ చేతన్ చౌహాన్ మృతిపై వివాదం ముదిరిపోతుంది.
Congress meeting: లీకు వీరులు ఎవరో ? ఏడాది ముందు మాయం, నిద్రలేచిన నటి రమ్య, కుట్ర!

మాజీ క్రికెటర్, మంత్రి కరోనాకు బలి
భారత మాజీ క్రికెటర్, ఉత్దర్ ప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ (73) కరోనా వైరస్ (COVID-19) వ్యాధిసోకి తీవ్ర అస్వస్థతకు గురైనారని లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందడం లేదని చేతన్ చౌహాన్ ను గుర్గావ్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆగస్టు 16వ తేదీన మంత్రి చేతన్ చౌహాన్ మృతి చెందారని గుర్గావ్ వైద్యులు ప్రకటించారు.

డ్రామాలు ఆడుతున్నారని గవర్నర్ కు ఫిర్యాదు
అధికారంలో ఉన్న మంత్రి, భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మరణంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఉత్తర్ ప్రదేశ్ శివసేన విభాగం నాయకులు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చేతన్ చౌహాన్ కరోనా వైరస్ వ్యాధితో మరణించలేదని, వైద్యుల నిర్లక్షం వలనే మరణించారని, ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చెయ్యాలని శివసేన నాయకులు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కు మనవి చేస్తూ వినతిపత్రం సమర్పించారని ఆపార్టీ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు.

లక్నో టూ గుర్గావ్ ఎందుకు ?
లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎస్ జీపీజీఐ) ప్రభుత్వ ఆసుపత్రిలో మొదట మంత్రి చేతన్ చౌహాన్ ను చేర్పించారని, మొదట ఆయన మాత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు చెప్పారని శివసేన నాయకులు చెప్పారు. అనంతరం గుర్గావ్ లోని మోదంత ప్రవేటు ఆసుపత్రికి తరలించారని, అక్కడ 36 గంటల పాటు మృత్యువుతో పోరాడిన చేతన్ చౌహాన్ చివరికి మృతి చెందారని శివసేన నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిపై ప్రభుత్వానికి నమ్మకం లేదా ?
ఏ ఉద్దేశంతో మంత్రి చేతన్ చౌహాన్ ను లక్నోలోని ఎస్ జీపీజీఐ ఆసుపత్రి నుంచి గుర్గావ్ లోని మెదంత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ?, దేశంలోనే ప్రసిద్ది చెందిన లక్నోలోని ఎస్ పీపీజీఐ ఆసుపత్రి మీద ప్రభుత్వానికే నమ్మకం లేదా ? అక్కడి వైద్యుల మీద నమ్మకం లేక గుర్గావ్ ఆసుపత్రికి తరలించారా ? అనే విషయం బహిరంగంగా చెప్పాలని శివసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మొత్తం బయటకు రావాలంటే మంత్రి చేతన్ చౌహాన్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించి నిజాలు బయటకు తియ్యాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.

నిర్లక్షంతో ఇద్దరు మంత్రులు బలి
కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ( సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం) పూర్తిగా విఫలం అయ్యిందని శివసేన నాయకులు ఆరోపించారు. కరోనా వైరస్ కారణంగా ఉత్తరప్రదేశ్ మంత్రి కమలా రాణి వరుణ్ (62) మరణించారని, తరువాత మాజీ క్రికెటర్, మంత్రి చేతన్ చౌహాన్ (73) మరణించారని, ఇంత జరుగుతున్నా ఉత్దరప్రదేశ్ ప్రభుత్వం నిద్రపోతూనే ఉందని శివసేన నాయకులు మండిపడుతున్నారు.

పసలేని డాక్టర్లు ఎందుకు !
లక్నోలోని ఎస్ పీజీపీఐ ఆసుపత్రి వైద్యులు నిర్లక్షంగా వైద్యం చెయ్యడం వలనే భారత మాజీ క్రికెటర్, మంత్రి చేతన్ చౌహాన్ మృతి చెందారని, అయినా ఆ వైద్యులపై ఇంత వరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.