• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కూడా పరిస్థితి భయానకం... వైద్యం అందక చనిపోతున్న జనం

By BBC News తెలుగు
|

అంతక్రియల దగ్గర మృతుల బంధువులు

వారణాసిలో సోమవారం లక్షలాది ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న రోజున నగరంలో కరోనా కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అదే రోజు కోవిడ్ వల్ల పది మంది చనిపోయారు.

వారణాసిలో ఒక ఈ-రిక్షాలో కొడుకు శవంతో నిస్సహాయ స్థితిలో కూర్చున్న ఒక ముసలి తల్లి పొటో కూడా సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైద్యం అందక ఆ యువకుడు చనిపోయాడు

కరోనా వచ్చిన తన కొడుకును వైద్యం కోసం జౌన్‌పూర్ నుంచి వారణాసికి తీసుకొచ్చిన ఆ తల్లి, ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరకు కొడుతు శవంతో తిరిగి వెళ్లింది.

వారణాసి ప్రజలకు సాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అదేశాలతో ఆయన పార్లమెంటరీ కార్యాలయం సోమవారం ఒక హెల్ప్ లైన్ కూడా ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు ఆస్పత్రుల్లో చేరడానికి, పడకలు, ఆక్సిజన్, అంబులెన్స్ సంబంధిత సాయం పొందవచ్చు.

ప్రధాని పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్నా, ముందు రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నియోజకవర్గం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ వారణాసిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో 22 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

వారణాసిలోని చిన్న పెద్దా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటినీ ఇప్పుడు కోవిడ్ ఆస్పత్రులుగా మార్చేశారు. కానీ ఆ ఆస్పత్రుల్లో ఎలా చేరాలో, పడకలు, మందులు , ఆక్సిజన్ ఎలా పొందాలో తెలీక స్థానికులు అల్లాడిపోతున్నారు.

వారణాసిలో కరోనా పరిస్థితి

'హెల్ప్ లెస్' అంటూ ఆరోపణలు

వారణాసిలోని కంట్‌లో నివ,టే మానసి గత వారం నుంచీ కరోనా వచ్చిన తన తండ్రిని ఏదైనా కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించాలని ప్రయత్నించారు. చివరకు ఆదివారం ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిషన్ సంపాదించగలిగారు.

"ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఒక్క రోజులో వస్తుంది. కానీ అది సిస్టమ్‌లో అప్‌డేట్ అవడానికి ఆరేడు రోజులు పడుతోంది. ఆలోపు రోగి పరిస్థితి దిగజారుతోంది. మా నాన్న పరిస్థితి ఘోరంగా ఉన్నా, రిపోర్ట్ లేకుండా చేర్చుకోలేమని డాక్టర్లు చెప్పారు. రోగిలో కోవిడ్ లక్షణాలు వాళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ఆస్పత్రిలో చేర్చుకోలేదు. చాలా ప్రయత్నించాక నేను రిపోర్ట్ తీసుకొచ్చా. ఆ తర్వాతగానీ ఆయన్ను అడ్మిట్ చేసుకోలేదు. అదేదో ముందే జరిగుంటే ఆయన పరిస్థితి, ఇప్పుడు మెరుగ్గా ఉండేది" అంటారు మానసి.

"అధికారులు జారీ చేసిన హెల్ప్ లైన్ నంబర్లన్నీ నిజానికి హెల్ప్ లెస్ నంబర్లు. నేను చాలా మందికి ఫోన్ చేశా. ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడా. నేను ఎవరి పేర్లూ చెప్పను. కానీ, అందరూ తాము ఏ సాయం చేయలేమన్నారు. హెల్ప్ లెస్ అయితే మేం మిమ్మల్ని ఎన్నుకుంది దేనికోసం. మిగతా ప్రాంతాల గురించి తెలీదుగానీ, వారణాసిలో ఆరోగ్య శాఖ పూర్తిగా దేవుడి మీదే భారం వేసింది" అని చెప్పారు.

తండ్రి చికిత్స కోసం ఎన్ని కష్టాలు పడ్డానో చెబుతున్న మానసికి కన్నీళ్లు ఆగడం లేదు.

"ఏర్పాట్ల పేరుతో ఏమేం చేస్తున్నారో, అవన్నీ చూపులకే. ఈ బాధ నా ఒక్కదానికే కాదు, కరోనా రోగులు ఉన్న ప్రతి ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందని, వ్యవస్థను చెక్ చేసేవారే లేరు" అని మానసి కోపంగా అన్నారు.

రిపోర్ట్ రావడంలో ఆలస్యం

వారణాసిలో కరోనా కేసులు పెరగడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన పార్లమెంటరీ పరిధిలోని సంబంధిత అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. తక్షణం హెల్ప్ లైన్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

సోమవారం నాటికి హెల్ప్ లైన్ ప్రారంభించడం, ఒకే రోజు దానికి కొన్ని వందల ఫోన్లు రావడం కూడా జరిగింది. కానీ దాని ద్వారా కొంతమందికే సాయం అందింది. ఎవరెవరికి అందిందనే వివరాలు ఎవరి దగ్గరా లేవు.

మోదీ ఆదేశాలతో తాము వారణాసిలో 'కంట్రోల్ రూం ఫర్ కోవిడ్'ను ఏప్రిల్ 19నే ప్రారంభించామని పార్లమెంటరీ కార్యాలయంలోని పార్టీ కో- ఇన్‌ఛార్జ్ సునీల్ ఓఝా చెప్పారు.

"కరోనా రోగులకు వీలైనంత త్వరగా వైద్యం, మిగతా సౌకర్యాలు అందేలా సంబంధిత విభాగాలు అన్నింటినీ సమన్వయం చేసే ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశాం. దానికోసం 30 మందితో ఉన్న ఒక బృందం 24 గంటలూ పనిచేస్తోంది. వారిలో 12 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. వైద్యుల సూచనలతో వారికి సాయం అందిస్తున్నాం" అన్నారు.

వారణాసిలోని రాకేశ్ శ్రీవాస్తవ్ భార్య కోవిడ్‌తో ఏప్రిల్ 15న చనిపోయారు. గత ఏడాది ఆయన ఏకైక కొడుకు చనిపోయాడు. ఆ షాక్‌తో రాకేష్ తండ్రి కూడా చనిపోయారు. ఇప్పుడు కుటుంబంలో ఆయన, 11 ఏళ్ల కూతురు మాత్రమే ఉన్నారు.

వారణాసిలోని బీహెచ్‌యూ, మిగతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పొడవాటి క్యూలు, మిగతా సమస్యలు చూసిన ఆయన భార్యను వైద్య కోసం ఒక పెద్ద ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ మొదట రిపోర్ట్ నెగటివ్‌గా వచ్చింది. కానీ, డాక్టర్లు మళ్లీ పరీక్షలు చేశారు. కానీ ఆరు రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఆయనకు భార్య కోవిడ్ రిపోర్ట్ అందలేదు. చివరికి ఆమె చనిపోయారు.

"చాలా నిర్లక్ష్యం చూపించారు. వైద్యం బాగుంటుందని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చా. కానీ, అలా ఏం జరగలేదు. ఆక్సిజన్ పెట్టారు, అయినా శ్వాస సమస్యలు వచ్చాయి. ఎన్ని సార్లు చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదు. తర్వాత ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసీయూలో షిఫ్ట్ చేయడమంటే. లక్షల రూపాయలు వసూలు చేసినా రోగి చనిపోవడం. మాక్కూడా అదే జరిగింది" అన్నారు.

ఆస్పత్రిలో తనకు కోవిడ్ రిపోర్ట్ ఇవ్వలేదని, కానీ, డాక్టర్లు తన భార్యకు రెమెడెసివీర్ ఇంజెక్షన్ వేశారని, దానిని బట్టి రిపోర్ట్‌లో పాజిటివ్ వచ్చుంటుందని అనుకున్నానని శ్రీవాస్తవ్ అన్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. వారణాసిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణంగా ఒక రోజుకు 40 నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్ మార్కెట్లో 30 వేలకు అమ్ముతున్నారు. కానీ, అది కూడా దొరకడం లేదు.

చాలాసార్లు జనం అసలు ఆస్పత్రుల వరకూ వెళ్లలేకపోతున్నారు. ఆస్పత్రికి వెళ్లే దారిలో కొన్ని గంటలపాటు ఆక్సిజన్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆస్పత్రుల్లోనే కాదు శ్మశానాల్లో పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. శవాలు పేరుకుపోతున్నాయి. రాత్రంతా దహనాలు జరుగుతూనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

వారణాసిలోని భోజువీర్ ప్రాంతంలో ఉంటున్న విమల్ కపూర్ తల్లి కూడా మూడు రోజుల క్రితం కరోనా వల్ల చనిపోయారు.

"అమ్మను ఏప్రిల్ 9న అడ్మిట్ చేశాను. ఊపరితిత్తులు సరిగా పనిచేయడం లేదన్నారు. మేం కూడా కరోనా పాజిటివ్ కావడంతో మమ్మల్ని లోపలికి పంపించలేదు. డాక్టర్ చెప్పేదే నమ్మాల్సొచ్చింది. అమ్మ చనిపోయాక కొన్ని గంటలపాటు అంబులెన్సులోనే ఉన్నాను. తర్వాత హరిశ్చంద్ర ఘాట్‌కు వెళ్తే, అక్కడి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఎన్నో శవాలు కాలుతూ కనిపించాయి" అన్నారు.

శ్మశానాల్లో పరిస్థితి దయనీయం

వారణాసిలో గంగా తీరంలోని మణికర్ణికా ఘాట్‌లో సాధారణంగా ఎప్పుడూ శవాలు కాలుతూనే ఉంటాయి. కానీ, హరిశ్చంద్ర ఘాట్‌లో రోజుకు 10-15 దహనాలే జరుగుతాయి. ఇప్పుడు అక్కడ కూడా వాటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది.

వారణాసి జిల్లా యంత్రాగం లేదా ఆరోగ్య విభాగం అధికారులు ప్రతి రోజూ గణాంకాలు జారీ చేస్తున్నారని, కానీ శ్మశానాల్లో దహన సంస్కారాలకు, ఆస్పత్రుల్లో మరణాల లెక్కకు పొంతన ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు.

వారణాసిలో పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడాలని బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఎవరూ ఫోన్ తీయలేదు. మెసేజులకు కూడా సమాధానం ఇవ్వలేదు. కలెక్టర్ నంబర్ ఫోన్‌ను ఆయన అసిస్టెంట్ తీశారు. ప్రతిసారీ 'సర్ బిజీగా ఉన్నారని' చెప్పారు.

కరోనావైరస్: భారత్, బ్రెజిల్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలలోని కొత్త వేరియంట్లు ప్రమాదకరమా?

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూళ్లేదు

వారణాసి సీనియర్ టీవీ జర్నలిస్ట్ విక్రాంత్ దుబే చాలా రోజుల నుంచీ నగరంలో కోవిడ్ తీవ్రతను కవర్ చేస్తున్నారు.

"వారణాసిలో ఇంత మెడికల్ ఎమర్జెన్సీని మొదటిసారి చూస్తున్నా. ఆరోగ్య వ్యవస్థ అసలు ముఖం ఇప్పుడు కనిపిస్తోంది. ఆస్పత్రులు, ఆక్సిజన్, ఇంజెక్షన్ కోసం అన్నిచోట్లా అల్లాడిపోతున్నారు. ఇక. శ్మశానాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కోవిడ్ మృతులను హరిశ్చంద్ర ఘాట్‌కు కూడా తీసుకొస్తున్నారు. అక్కడ రోజూ 50కి పైగా శవాలను దహనం చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తున్నా, రిపోర్టులు లేక నెగటివ్‌గా భావిస్తున్న కొందరికి మణికర్ణికా ఘాట్‌లో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.

ఘాట్ల దగ్గర అంబులెన్సులు ఇలా క్యూ కట్టడం ఎప్పుడూ చూడలేదని అస్సీ ఘాట్ దగ్గర ఉండే ధీరేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థ కావడం లేదన్నారు.

"హరిశ్చంద్ర ఘాట్‌లో అంతిమ సంస్కారాల కోసం ఏడెమినిది గంటలు వేచిచూడాల్సి వస్తోంది. వాళ్లందరూ కోవిడ్‌తో చనిపోయినవారే. రోజకు 50 శవాలు వస్తున్నాయి. అధికారుల లెక్కల్లో మాత్రం 10 లేదా 12 అంటున్నారు" అన్నారు ధీరేంద్ర.

ప్రధాని జోక్యంతో హెల్ప్ లైన్‌ ఏర్పాటుచేసి ఒక్క రోజే అయ్యింది. దానికి అప్పుడే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కానీ ప్రజలకు సాయం అందించడంలో అది పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు.

"హెల్ప్ లైన్ వల్ల ప్రస్తుతం ఎవరికీ ప్రయోజనం ఉండడం లేదు. ఎందుకంటే చాలా ఫోన్లు వస్తుండడంతో, అక్కడ పనిచేసే 30 మంది అన్నింటినీ పరిష్కరించలేకపోతున్నారు. కానీ, ఒకటి మాత్రం చెప్పచ్చు. ఆస్పత్రులకు సిఫారసు చేయడానికి ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి హెల్ప్ లైన్ వల్ల చాలా సాయం లభిస్తుంది" అంటున్నారు విక్రాంత్ దుబే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: The situation in Varanasi also dire, people dying due to lack of treatment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X