కాబోయే జంట... కాల్పుల్లో బలి... మేనమామే నమ్మించి గొంతు కోశాడు...
హర్యానాలో దారుణం జరిగింది. పెళ్లికి సిద్దపడిన ఓ జంట కాల్పుల దాడిలో బలైపోయింది. యువతి మేనమామే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకున్నట్లే ఒప్పుకుని... తీరా అంతా సిద్దమయ్యాక కాల్పులకు తెగబడ్డాడు. ఇది పరువు హత్యేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నమ్మించి గొంతు కోసిన యువతి మేనమామపై కఠిన చర్యలు తీసుకోవాలని యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హర్యానాలోని రోహ్తక్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పూజ-రోహిత్...
హర్యానాలోని రోహ్తక్ జిల్లాకు చెందిన పూజ(27) ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ కుల్దీప్ చేరదీశాడు. అప్పటినుంచి పూజ మేనమామ ఇంట్లోనే ఉంటోంది. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం పూజకు రోహిత్(25) అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరువురి కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పారు.

పెళ్లికి నిరాకరించిన మేనమామ...
రోహిత్ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ పూజ మేనమామ కుల్దీప్ మాత్రం మొదట అందుకు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు. దీంతో రోహ్తక్లోని స్థానిక కోర్టులో పెళ్లి చేసుకోవాలని పూజ-రోహిత్ నిశ్చయించుకున్నారు. ఇందుకు అవసరమైన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసేందుకు బుధవారం(డిసెంబర్ 30) కోర్టుకు వెళ్లారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ కూడా అక్కడికి వెళ్లాడు. రోహిత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన కుల్దీప్ వారిని కూడా అక్కడికి రావాల్సిందిగా కోరాడు.

కాబోయే జంట బలి...
రోహిత్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చాక... కొన్ని విషయాలు చర్చించాలని చెప్పి అందరినీ మహర్షి దయానంద్ యూనివర్సిటీ వద్దకు రావాలని కుల్దీప్ చెప్పాడు. దీంతో పూజ-రోహిత్,అతని కుటుంబ సభ్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అక్కడికి చేరుకోవడమే ఆలస్యం కుల్దీప్.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో కారుపై కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో పూజ,రోహిత్ అక్కడికక్కడే చనిపోగా... రోహిత్ సోదరుడు మోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కుల్దీప్తో పాటు అతని కుమారుడు కపిల్ కుమార్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీస్ అధికారి సాజన్ సింగ్ తెలిపారు. సెక్షన్ 302,సెక్షన్ 24,34ల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.