8 గంటలు, కాదు 2 గంటలు: వార్డులో రోగి పక్కనే మృతదేహం, సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ఫైర్
కరోనా వైరస్ పాజిటివ్ వస్తే చాలు కోవిడ్ -19 ఆస్పత్రిలో అందించే చికిత్సపై పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే వార్డులో కూడా ఎక్కువమందిని ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు కొన్నిచోట్ల మృతదేహాలను పక్క బెడ్‌పై పడుకోబెట్టి.. ఇతర రోగులను ఉంచిన విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.
రోగి పక్కనే మృతదేహం..
సోమవారం ఆస్పత్రిలో వైరస్‌తో ఒకరు చనిపోగా.. మరొకరు పక్క బెడ్‌పై కనిపించారు. దీనిని కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ జరిగిన ఘటన గురించి యజమాన్యం పుసగుచ్చి వివరించింది. ఘటనపై విచారణకు ఆదేశించామని.. ఊహాగానాలు నమ్మొద్దని కోరుతోంది.

8 గంటలు సావాసం..
రోగి మృతదేహాం 8 గంటలు వార్డులో ఉంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ 2 గంటలే ఉంది అని యజమాన్యం చెబుతోంది. అసలు సోమవారం రోజు ఏం జరిగిందో స్టాన్సీ చీఫ్ డాక్టర్ మీడియాకు వివరించారు. ఉదయం 8 గంటలకు రోగి చనిపోయాడని.. కానీ తాము కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు మృతదేహం తరలించాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనల మేరకు ప్యాక్ చేసిన డెడ్ బాడీని.. డ్యూటీ అసిస్టెంట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ షిప్టింగ్ ఫారమ్‌లో సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలా ఉదయం 10 గంటలకు మార్చురీకి తరలించామని చెప్పారు.
రెండు గంటలే
ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు శ్మశాన వాటికికు తరలించారని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రెండు గంటలే వార్డులో డెడ్ బాడీ ఉంది అని.. మిగతా సమయం మార్చురీలో ఉంది అని వివరించారు. వాస్తవానికి కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కోసం లోతుగా ఖననం చేయాల్సి ఉంటుందని.. అందుకోసం ఆలస్యం జరిగిందని వివరించారు.

30 మంది రోగులు
సోమవారం వార్డులో 30 మంది రోగులు ఉన్నారని.. మృతదేహాన్ని మంచంపై చుట్టి.. తెరతో కప్పామని పేర్కొన్నారు. కానీ 8 గంటలు వదిలేశారనే ప్రచారం తప్పు అని స్టాన్లీ చీఫ్ డాక్టర్ స్పష్టంచేశారు. తమ ఆస్పత్రిపై లేనిపోని అభండాలు వేయడం మంచి పద్దతి కాదని సూచించారు. కానీ నెటిజన్లు మాత్రం ఆస్పత్రి నిర్వాకంపై దుమ్మెత్తి పోస్తున్నారు.