• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19: దేశంలో సగం కేసులు కేరళ నుంచే, ఎందుకంటే..

By BBC News తెలుగు
|
కేరళ కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసుల్లో సగానికి పైగా కేరళలోనే ఉంటున్నాయి.

సెకండ్ వేవ్ కేసులు తగ్గిన నెలల తర్వాత కేరళలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో బీబీసీ ప్రతినిధులు సౌతిక్ బిశ్వాస్, వికాస్ పాండే వివరించారు.

కేరళలో 2020 జనవరిలో తొలి కోవిడ్-19 కేసు గుర్తించారు.

కరోనా మహమ్మారి పుట్టుకకు కారణమని భావిస్తున్న చైనాలోని వూహాన్ నగరం నుంచి వచ్చిన వైద్య విద్యార్థిలో తొలుత వైరస్ లక్షణాలు కనిపించాయి.

ఆ తర్వాత కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ కేరళ వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది.

అయితే మార్చి నాటికి దేశంలోని మిగతా ఆరు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కేరళను మించిపోయింది.

టెస్ట్-ట్రేస్-ఐసోలేట్ విధానాన్ని పక్కాగా పాటించిన కేరళ కరోనా కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది.

కరోనా తొలివేవ్ సుదీర్ఘ కాలం ఉంది. కానీ దాని వ్యాప్తిని కేరళ నియంత్రించింది.

అక్కడ అధికారిక మరణాల సంఖ్య కూడా తక్కువే ఉంది. వైరస్ వ్యాప్తిని కేరళ అడ్డుకున్న విధానం అప్పట్లో అందరి ప్రశంసలు పొందింది.

కానీ, ఈ వేసవిలో సెకండ్ వేవ్ కారణంగా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ కేరళలో మాత్రం దాని ఉధృతి ఆగలేదు.

దేశ జనాభాలో 3 శాతం ప్రజలున్న కేరళలో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో సగానికి పైగా కేసులు అక్కడి నుంచే వస్తున్నాయి.

కేరళలో కరోన కేసులు

కేరళలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది.

ఈ పరిస్థితి కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతోపాటూ ఇతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కేరళలో ఒక నెల వ్యవధిలో నిర్వహించే మొత్తం కరోనా పరీక్షల సంఖ్యలో, పాజిటివ్‌గా తేలే వారి సంఖ్య 10 శాతానికి కాస్త ఎక్కువగానే ఉంటుంది.

కేరళలో ఇప్పటివరకు 34 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16,837 మంది వైరస్ వల్ల చనిపోయారు.

ఈ గణాంకాలు అక్కడి పరిస్థితి గురించి వివరంగా చెప్పలేవని అంటువ్యాధుల నిపుణులు అంటున్నారు.

దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా కేరళలో ఎక్కువగా పరీక్షలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో పది లక్షల జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో కేరళ పరీక్షలు చేస్తోంది. అందుకే అది ఇన్‌ఫెక్షన్ల స్థాయిని నియంత్రించిందని చెబుతున్నారు.

మిగతా రాష్ట్రాలు 30 మందిలో ఒక వైరస్‌ కేసును గుర్తిస్తుంటే... కేరళ మాత్రం ప్రతి ఇద్దరిలో వైరస్ సోకిన ఒకరిని గుర్తిస్తోంది.

"కేరళ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తోంది. తెలివిగా పరీక్షిస్తోంది. నిజమైన వైరస్ కేసుల్ని పట్టుకోవడానికి ప్రాథమిక కాంటాక్టులను గుర్తించడంతో పాటు, పరీక్షల సంఖ్యను పెంచడం కూడా ముఖ్యమే" అని ప్రముఖ వైరాలజిస్టు, డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అన్నారు.

కేరళలో వైరస్ బారిన పడిన ఆరేళ్ల వయసు దాటిన వారి సంఖ్య 43 శాతమని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 68 శాతంగా ఉన్నట్లు తాజా 'యాంటీబాడీ టెస్టుల' సర్వేలో వెల్లడైంది.

కేరళ కరోనా కేసులు

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటివరకు కరోనా కట్టడిలో కేరళ సమర్థవంతంగా పనిచేసిందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నప్పటికీ, ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోలేదు. సగం పడకలు ఖాళీగానే ఉన్నాయి.

సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా తక్కువే. భారత్‌లో మరణాల అంచనాలో కేరళ మరణాల రేటు మూడో వంతు మాత్రమే.

కేరళ మొత్తం జనాభాలో 20 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సీన్‌ను అందించింది.

45 ఏళ్లు పైబడిన వారిలో 38 శాతం ప్రజలు కనీసం సింగిల్ డోస్ వ్యాక్సీన్‌ను తీసుకున్నారు. జాతీయ టీకా సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

కేరళ విస్తృతంగా పరీక్షలు చేయడంతో పాటు టీకాలను వేగంగా అందిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యను నిజాయితీగా వెల్లడిస్తోంది. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

"కేరళ ప్రజలకు వ్యాక్సినేషన్ అందిస్తోన్న వేగాన్ని బట్టి చూస్తే... భవిష్యత్‌లో వచ్చే కరోనా వేవ్‌లు కేరళలో సెకండ్ వేవ్‌ తరహాలో తీవ్రంగా ఉండబోవు" అని ప్రముఖ హెల్త్ ఎకనమిస్ట్ డాక్టర్ రిజో ఎం జాన్ చెప్పారు.

కేరళ పలు విజయవంతమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అంటువ్యాధుల నిపుణులు ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. "ఇది రాష్ట్రంలో మహమ్మారి మనుగడకు అనువైన పరిస్థితుల్ని కల్పిస్తుంది" అని డాక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు.

కరోనా మరణాలను తగ్గించడానికి కృషి చేస్తున్నప్పటికీ, ప్రజలు వైరస్ బారిన పడే పరిస్థితుల్లో ఉండటం ప్రమాదకరమేనని వైరాలజిస్ట్ షహీద్ జమీల్ అన్నారు.

దీనివల్ల వైరస్ నుంచి కోలుకున్నాక కూడా మూడో వంతు ప్రజలు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారు.

వైరస్ వ్యాప్తి పెరుగుదల కేరళలో ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఫిజీషియన్, డాక్టర్ స్వప్నిల్ పరీఖ్ నమ్ముతున్నారు. వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న డెల్టా వేరియంట్ కారణంగా వైరస్ సంక్రమణను అడ్డుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు.

'ప్రస్తుతం నమోదవుతోన్న మరణాలు, ఆసుపత్రిలో చేరికలు మునుపటి ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించినవి. కాబట్టి వీటి సంఖ్య తక్కువే ఉందని ఇప్పుడు సంతోషించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పాజిటివిటీ రేటు స్థిరంగా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం' అని పరీఖ్ వివరించారు.

సుదీర్ఘ కాలం పాటు వైరస్ ఉనికిలో ఉంటే ఎక్కువ మ్యుటేషన్లు ఏర్పడటానికి కారణమవుతుందని డాక్టర్ మీనన్ అన్నారు.

"దీనివల్ల అత్యంత ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇవి ఇప్పటివరకు వ్యాక్సీన్ తీసుకోనివారిపై, ఇంతవరకు వైరస్ బారిన పడని వారిపై ప్రభావం చూపుతాయి. అందుకే కేసుల సంఖ్యను తగ్గించడానికి అవసరమైన చర్యలపై కేరళ దృష్టి పెట్టాలి" అని ఆయన సూచించారు.

లాక్‌డౌన్ అమలులో కేరళ మరింత కట్టుదిట్టంగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు.

పండగలు చేసుకోడానికి, సమావేశాలకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. వీటివల్ల వైరస్ పెరిగే ప్రమాదం ఉంది.

ఇన్‌ఫెక్షన్లు ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నాయో, కొత్త వేరియంట్లు ఎక్కడెక్కడ నమోదువుతున్నాయో తెలుసుకోడానికి కేరళకు మరింత డేటా అవసరమని వైరాలజిస్టులు పేర్కొంటున్నారు.

అసాధారణ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం భారతదేశం నేర్చుకోవాలని లండన్ మిడిల్సెక్స్ యూనివర్సిటీ మ్యాథమెటీషియన్, డాక్టర్ మురద్ బనాజీ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: Half of the cases in the country are from Kerala, because
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X