కరోనాపై కేంద్రం షాకింగ్ ప్రకటన - వైరస్ సామూహిక వ్యాప్తి నిజమే - కేరళపై హర్షవర్ధన్ విమర్శలు
కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ షాకింగ్ ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరిందని, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (సామూహిక వ్యాప్తి) జరుగుతోందనడానికి ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు. లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిన సందర్భంలోనే సామూహిక వ్యాప్తిపై అనుమానాలు వ్యక్తంకగా.. ఇన్నాళ్లూ దానిని ఖండిస్తూ వచ్చిన కేంద్రం.. ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది.
జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?

మమత ప్రకటనతో ఒత్తిడి..
పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తిని నిర్ధారిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కీలక ప్రకటన చేశారు. దీంతో కేంద్రం సైతం వైరస్ వ్యాప్తిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘సండే సంవాద్' పేరుతో సోషల్ మీడియాలో ప్రతి ఆదివారం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తోన్న కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ఎట్టకేలకు సామూహిక వ్యాప్తి నిజమేనని ఒప్పుకున్నారు. అయితే, దేశవ్యాప్తంగా అది జరగడం లేదని, కొన్ని రాష్ట్రాల్లోనే, అది కూడా ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లోనే వైరస్ సామూహిక వ్యాప్తి జరుగుతోందని మంత్రి వివరించారు.
కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?

కేరళ సర్కారుపై విమర్శలు..
కరోనాపై పోరుకు సంబంధించి రాబోయే రెండు నెలలు చాలా కీలకమని, శీతాకాలంతో పాటు పండుగల సీజన్ వల్ల వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందంటూ రెండు రోజుల కిందట హెచ్చరించిన మంత్రి హర్షవర్ధన్.. ఆదివారం నాటి ‘సండే సంవాద్'లోనూ పండుగల అంశాన్ని ప్రస్తావించారు. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు కల్పించడం, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కొత్త కేసులు రెండింతలు ఎక్కువగా వస్తుండటాన్ని ఆయన గుర్తుచేశారు. కేరళ తాను చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నదని, ఓనం పండుగవేళ పినరయి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కేసుల పెరుగుదలకు కారణమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. దసరా, దీపావళి పండుగల్ని ఇంట్లోనే జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడూ విధిగా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. ఇకపోతే,

న్యూస్ పేపర్లతో కరోనా రాదు
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా న్యూస్ పేపర్ల సర్క్యూలేషన్ భారీగా పడిపోవడం తెలిసిందే. చేతులు మారుతూ ఇళ్లకు చేరే పేపర్లపై కరోనా వైరస్ ఉండొచ్చనే అనుమానాలతో చాలా మంది వాటిని చదవడం మానేశారు. అయితే, న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తికి ఎలాంటి ఆధారం లేదని, పేపర్లు చదవవడం, ముట్టుకోవడం ద్వారా కరోనా రాదని కేంద్ర ఆరోగ్య మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రెండో దఫా నిధులను రాష్ట్రాలకు అందజేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నదని తెలిపారు.

కీలక దశకు వ్యాక్సిన్ ప్రయోగాలు..
కోవిడ్-19 వాక్సిన్‌కు సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, సీరం ఇండియా, భారత్ భయోటెక్‌లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయని తెలిపారు. ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్‌లో వేలాది మంది పార్టిసిపెంట్లు, ఒక్కోసారి 30,000 నుంచి 40,000 మంది పాల్గొంటున్నట్టు చెప్పారు. మొత్తంగా విరుగుడు వ్యాక్సిన్ అభివృద్దిలో భారత్ కీలక భూమిక పోషిస్తుందని, త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని అన్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దానిని ముందుగా ఎవరికి అందించాలి, పంపిణీ ఎలా చేపట్టాలనేదానిపై కేంద్రం ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.

ఇదీ కరోనా పరిస్థితి..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కలను బట్టి.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,871 కేసులు, 1033 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు మరణాల సంఖ్య 1.14లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆదివారం నాటికి 4 కోట్లు దాటింది. అమెరికాలో కేసుల సంఖ్య 83.42లక్షలుగా ఉండగా, 75లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలను తిరిగి అమలుచేస్తున్నారు.