భారత్‌లో కరోనా పీక్ స్టేజ్ దాటింది! జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ఫిబ్రవరి నాటికి భారీ క్షీణత: కమిటీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతున్న దేశ ప్రజలకు ఈ వార్త కొంత ఊరటనిచ్చేదిలా ఉంది. ఇప్పటికే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, కరోనా తీవ్రత గరిష్ఠస్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవిడ్ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది.
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: అత్యధిక కేసులు, మరణాలు ఏ జిల్లాలోనంటే..?

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా క్షీణత
అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా నియంత్రించవచ్చని పేర్కొంది. దేశంలో కరోనా తీవ్రత, అంచనాలపై కేంద్రం ఐఐటీ, ఐసీఎంఆర్ సభ్యులతో కోవిడ్ 19 భారత్ సూపర్ మోడల్ పేరుతో కమిటీని నియమించింది. కాగా, ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నేతృత్వం వహించారు. భారతదేశంలో కరోనావైరస్ తీవ్రత అంచనాలను దాటిపోయింది. పకడ్బంధీగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరినాటికల్లా కరోనా యాక్టివ్ కేసులను 40వేలకు తీసుకురావొచ్చని పేర్కొంది.

ఈ రెండు మూడు నెలలకే కీలకం..
కానీ, రానున్నది శీతాకాలం, పండగల సీజన్ కావడంతో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని కమిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లను ఉపయోగించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. శీతాకాలం, పండగ సీజన్ల నేపథ్యంలో కేవలం ఒక నెలలోనే సుమారు 26 లక్షల మంది కరోనా బారినపడే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. కేరళలో ఆగస్టు 22, సెప్టెంబర్ 2 మధ్య కాలంలో ఓనం పండగ జరుపుకోవడంతో సెప్టెంబర్ 8 నుంచి కరోనా కేసులు 32 శాతం పెరిగాయని వెల్లడించింది.

లాక్డౌన్ విధించకపోతే ఇప్పటికే 25 లక్షల మరణాలు.?
2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో 1.5 కోట్లకు కరోనా కేసులు నమోదవుతాయని కమిటీ అంచనా వేసింది. మార్చి 25 నుంచి విధించిన దేశ వ్యాప్త లాక్డౌన్ కరోనా మహమ్మారి విజృంభణను ఊహించినదానికంటే అడ్డుకోగలిగిందని కమిటీ తెలిపింది. లేదంటే ఈ ఏడాది ఆగస్టు నాటికే 25 లక్షల కరోనా మరణాలు సంభవించేవని పేర్కొంది. మే, జూన్ నెలలో జరిగిన వలస కూలీల తరలింపు కరోనా కేసుల ఉధృతికి కారణం కాదని పేర్కొంది. లాక్డౌన్ ముందే వలస తరలింపు చేపబడితే కరోనా ఉధృతి మరింత ఎక్కువగా ఉండేదని పేర్కొంది.

జాగ్రత్తలు తీసుకుంటే ఫిబ్రవరినాటికి 40వేలకు యాక్టివ్ కేసులు
కరోనా నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటిస్తే వచ్చే ఏడాదిలోగానే కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని కమిటీ పేర్కొంది. ఫిబ్రవరి చివరినాటికి యాక్టివ్ కేసులను 40వేలకు తగ్గించవచ్చని వెల్లడించింది. దేశంలోని 30శాతం జనాభా యాంటీబాడీస్‌ను కలిగి ఉందని, మరణాల రేటు 0.04 శాతాని కంటే కూడా తక్కువగా ఉందని తెలిపింది. అయితే, ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తే మాత్రం కరోనా విజృంభణ మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుందని హెచ్చరించింది.