రెండు రాష్ట్రాలకు అంబానీ ప్యాకేజీ.. కేంద్రానికి రూ.500 కోట్లు.. గోల్మాల్ జరుగుతోందన్న థరూర్..
కరోనా విలయం నుంచి భారతావనిని గట్టెక్కించేందుకు గట్టిగా పోరాడుతున్న కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు దేశంలోని బడాబాబులు అండగా నిలబడుతున్నారు. కరోనాపై పోరులో తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. వ్యాపారంలో సేవాభావాన్ని కూడా రంగరించే టాటా కంపెనీ.. మొత్తంగా రూ.1500 కోట్ల సాయాన్ని అందించగా.. దేశంలోనే అపరకుబేరుడైన ముఖేశ్ అంబానీ తన రిలయన్స్ సంస్థల ద్వారా పీఎం-కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

15 రోజుల్లో ఆస్పత్రి పూర్తి..
కరోనాపై పోరులో కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రిలయన్స్ సంస్థ అన్ని వేళలా, అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని సంస్థ సీఈవో ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. తాజాగా రూ.500 కోట్ల విరాళం ప్రకటించడానికి వారం ముందే.. రిలయన్స్ ఆధ్వర్యంలో ముంబైలో ప్రత్యేకంగా కరోనా ఆస్పత్రి నిర్మించబోతున్నట్లు ముఖేశ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసింది. కరోనా చికిత్సకు కావాల్సిన అన్ని ఆధునిక వసతులను అందులో ఏర్పాటు చేశారు.

ఆ రెండు రాష్ట్రాలు ఇవే..
ముంబైలో కరోనా ఆస్పత్రి, పీఎం కేర్స్ సహాయ నిధికి రూ.500 విరాళమిచ్చిన అంబానీ.. ఓ రెండు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక సాయం ప్రకటించారు. ఆ రాష్ట్రాల్లో మొదటిది ఆయనుంటోన్న మహారాష్ట్రకాగా, రెండోది అంబానీల సొంత రాష్ట్రం గుజరాత్. కరోనాను అరికట్టేందుకు కృషి చేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరో రూ.5 కోట్ల సాయాన్ని రిలయన్స్ ప్రకటించింది. ఇదిలా ఉంటే..

పీఎంఆర్ఎఫ్ వదిలేసి ‘పీఎం కేర్స్ - ఫండ్’ ఎందుకు?
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి సాయం చేయాలనుకునేవాళ్లు డబ్బులు పంపడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వ్యవస్థను తెరపైకి తీసుకురావడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపట్టింది. విపత్తుల సమయంలో రాష్ట్రాల్లోనైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి, కేంద్రానికైతే ప్రధానమంత్రి సహాయనిధి(పీఎంఆర్ఎఫ్)కు ప్రజలు విరాళాలు పంపడం తెలిసిందే. కానీ కరోనా దగ్గరికొచ్చేసరికి కొత్తగా ‘పీఎమ్- కేర్స్ ఫండ్' అనే ట్రస్టును ఎందుకు సృష్టించచారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు.

పారదర్శకమేనా?
పీఎంఆర్ఎఫ్ స్థానంలో కొత్తగా ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్ ఫండ్' పారదర్శకంగా లేదని, కేవలం ప్రజల్ని ఆకర్షించడానికి కొత్త పేర్లు అవసరం లేదని, ప్రధాని పేరుతో ఛారిటబుల్ ట్రస్టు పెట్టి విరాళాలు సేకరిస్తున్న ప్రక్రియ సజావుగా సాగినట్లు కనిపించడంలేదని, దీనిపై పీఎంను కూడా ప్రశ్నించానని కాంగ్రెస్ ఎంపీ థరూర్ తెలిపారు. కరోనా విరాళాల సేకరణ కోసం ఏర్పాటైన ‘పీఎం కేర్స్ ఫండ్' ట్రస్టుకు ప్రధాని మోదీ చైర్మన్ గా ఉన్నారు. కేంద్రం మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు.