కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్‌ను వెనక్కునెట్టేస్తూ..
కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో ఒకే రోజు అత్యధిక కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలో వైరస్ విలయం కనీవినీ ఎరుగని స్థాయిలో కొనసాగుతున్నది. కోవిడ్-19 కేసుల్లో బ్రెజిల్‌ను వెనక్కునెట్టేసి ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల్లో పలు సంచలన గణాంకాలు నమోదయ్యాయి.

ఇప్పటిదాకా చూడనిది..
దేశంలో గిచిన 24 గంటల్లో కొత్తగా 89,690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.13లక్షలకు పెరిగింది. ఒకరోజులో నమోదైన కొత్త కేసులకు సంబంధించి ఇది సరికొత్త రికార్డు. జనవరి నుంచి కరోనా విలయం కొనసాగుతుండగా.. ఈ తొమ్మిది నెలల్లో ఒకే రోజు ఒక దేశంలో దాదాపు 90 వేల కేసులు రావడం ఇదే తొలిసారి. అంతేకాదు, అమెరికా, బ్రెజిల్ గణాంకాలను కలిపినా ఇండియాకు సమానంగా కూడా రాలేదు. ఆదివారం బ్రెజిల్ లో 30,168 కొత్త కేసులు, అమెరికాలో దాదాపు 50వేల కొత్త కేసులు వచ్చాయి.

బ్రెజిల్ ను నెట్టేసిన భారత్..
మొత్తం కేసుల విషయంలో భారత్ ఆదివారం నాటికి బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి, అమెరికా తరువాతి స్థానంలో నిలిచింది. కొత్తవి కలిపి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 41.13 లక్షలకు చేరింది. కరోనా మరణాల సంఖ్య కూడా 70, 688కి పెరిగింది. 6.43లక్షల కేసులు, 1.92లక్షల మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 41లక్షల కేసులు, 1.26లక్షల మరణాలతో బ్రెజిల్ మూడోస్థానంలో నిలిచింది.

భారీగా డిశ్చార్జిలు..
కొత్త కేసుల్లోనేకాదు, డిశ్చార్జిల సంఖ్య పరంగానూ భారత్ ఆదివారం మరో రికార్డు సాధించింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 70, 072 మంది కొవిడ్ వ్యాధిం నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 31.8లక్షలకు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8.6లక్షలుగా ఉంది.

టెస్టుల్లో వేగమే కారణమా?
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ఒకే రోజు కొత్తగా 90వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం వెనుక టెస్టుల వేగం కూడా కారణంగా కనిపిస్తున్నది. అగ్రరాజ్యం అమెరికా సహా బ్రెజిల్ లో ఇటీవల టెస్టుల వేగాన్ని తగ్గించినట్లు రిపోర్టు వస్తుండగా, ఇండియాలో మాత్రం వేగం పెరిగింది.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదివారం వెల్లడంచిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 11లక్షల(10.92లక్షల) శాంపిళ్లను టెస్ట్ చేశారు. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4.88 కోట్లకు పెరిగింది. రికవరీల్లో మిగతా దేశాలకంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటం, మరణాల రేటు కూడా తక్కువగానే ఉండటం ఊరటకలిగించే అంశం.