• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్‌: దిల్లీలో వెంటిలేటర్‌ బెడ్‌ దొరక్క పది రోజుల పాటు అంబులెన్స్‌లోనే ఉంటూ ఆస్పత్రుల చుట్టూ తిరిగిన వృద్ధుడు

By BBC News తెలుగు
|

వాహనంలో పడుకున్న సురీందర్ సింగ్

సమయం రాత్రి 11 గంటలు.. మారుతి ఆమ్నీ అంబులెన్స్‌లో పడుకుని ఉన్న సురీందర్ సింగ్ శ్వాస అందక ఇబ్బంది పడుతున్నారు. దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి డాక్టర్లు అంబులెన్స్ దగ్గరకు వచ్చి ఆయన్ను పరీక్షించారు. కానీ ఆస్పత్రిలో చేర్చుకోలేమని చెప్పేశారు.

"ఆయన పరిస్థితి ఏం బాలేదు. ఆయనకు వెంటిలేటర్ అవసరం. మా దగ్గర బెడ్ లేదు. మీరు వెంటనే ఆయన్ను వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండి" అని సురీందర్‌తోపాటు వచ్చిన చందీప్ సింగ్‌కు, మిగతావారికి చెప్పారు.

చందీప్ సింగ్, మిగిలిన వాళ్లందరూ చేతులు జోడించి సురీందర్‌ను ఎలాగైనా కాపాడమని డాక్టర్లను వేడుకొన్నారు. కానీ బెడ్స్ లేవు, మేమేమీ చేయలేమని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.

ఇదంతా నేను దూరం నుంచి గమనిస్తున్నాను. అంతకు ముందే షాహీన్ బాగ్‌లో అల్ షిఫా ఆస్పతికి వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వచ్చాను. ఆ ఆస్పత్రిలో మూడు పడకలు ఖాళీ ఉన్నట్లు నాకు సమాచారం అందింది.

ఆ విషయం చందీప్‌కు చెప్పాను. వెంటనే వారంతా అల్ షిఫాకు బయలుదేరారు. అంబులెన్స్‌లో సురీందర్, ఆయనతో పాటు ఒక అటెండెంట్, వెనక మరో కారులో మిగతావారు అల్ షిఫా చేరుకున్నారు.

కానీ అప్పటికే అక్కడ పడకలు నిండిపోయాయి. ఖాళీలు లేవని తెలిసింది.

హోలీ ఫ్యామలీ హాస్పటల్

సురీందర్ సింగ్ ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయింది. ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నా కూడా ఆయనకు శ్వాస అందట్లేదు.

ఆయనతో పాటు వచ్చిన మరో వ్యక్తి సంప్రీత్ సింగ్ విసనకర్ర విసురుతూ ఉన్నారు.

అల్ షిఫా వైద్యులు సురీందర్‌ను పరీక్షించి వెంటిలేటర్ పెట్టాలి, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లండి అని సలహా ఇచ్చారు.

సురీందర్ బంధువులు ఎంత బతిమాలినా ఐసీయూ పడకలు ఖాళీ లేవని డాక్టర్లు చెప్పేశారు.

మేం ఆ ఆస్పత్రిలోని ఇతర సిబ్బందితో మాట్లాడాం. వెంటిలేటర్ బెడ్ ఖాళీ అయితే వెంటనే మీకు ఇస్తాం అని వాళ్లు హామీ ఇచ్చారు.

కొంతసేపటి తరువాత వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవ్వలేదని, ఇప్పటికిప్పుడు దొరకడం కష్టమేనని చెప్పారు.

ఇంతలో సురీందర్‌కు పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయింది. ఆయనకు పూర్తిగా శ్వాస అందలేదు.

చాలాసేపు అభ్యర్థించిన తరువాత కాసేపు వాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వాళ్లు ఓ సిలిండర్ ఇచ్చారు.

దిల్లీలోని ఆశ్రమ్ ప్రాంతంలో నివసించే సురీందర్ ప్రాణాలు కాపాడేందుకు ఆయన మనుమడు, ఆయన స్నేహితులు నానా అవస్థలు పడుతున్నారు.

అల్ షిఫా ఆస్పత్రి

చిన్న ఆశ చిగురించింది

సురీందర్‌తో వచ్చినవాళ్లు ఏడుస్తూ, ఆయన్ను ఎలాగైనా ఆస్పత్రిలో చేర్చుకోమని అల్ షిఫా వైద్యులను మళ్లీ బతిమాలారు.

లాజ్‌పత్‌ నగర్‌లో ఐబీఎస్ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్)లో పడకలు ఖాళీగా ఉన్నాయి, అక్కడకు వెళ్లమని అల్ షిఫా వైద్యులు సమాచారం అందించారు.

కాసేపటికి చందీప్ స్నేహితులు మరో ఆక్సిజన్ సిలిండర్‌తో అక్కడకు చేరుకున్నారు.

కొత్త సిలిండర్ సురీందర్‌కు పెట్టిన తరువాత అంబులెన్స్ ఐబీఎస్‌ వైపు మళ్లింది.

కానీ, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. ఐసీయూ పడకలు ఖాళీ లేవని ఐబీఎస్‌లో చెప్పారు.

అప్పటికి సమయం రాత్రి రెండు గంటలైంది.

తరువాత సఫ్‌దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా ఖాళీ లేదని చెప్పేశారు.

అలా ఆ రాత్రంతా వాళ్లు ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిరుగుతూనే ఉన్నారు.

చివరకు విసిగిపోయి ఇంటికే తీసుకెళ్లపోయారు.

సురీందర్ సింగ్

పది రోజులుగా సురీందర్‌ ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారు.

ఖాళీ అయిన సిలిండర్‌ను భర్తీ చేయడం కోసం చందీప్, ఆన స్నేహితులు ఎక్కడెక్కడో లైన్లలో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఒక్కోసారి సిలిండర్ భర్తీ అవుతుంది, ఒక్కోసారి కాదు.

"ఆక్సిజన్ దొరకడం గగనమైపోయింది. నలుగురైదుగురు వేరు వేరు ప్రాంతాల్లో లైన్లో నిల్చుంటే ఒకరికి దొరుకుతుంది. దిల్లీలో దొరక్కపోతే హరియాణా వెళ్లాం. అక్కడ ఆక్సిజన్ ఉందిగానీ వాళ్లు... దిల్లీ ప్రజలకు ఇవ్వం, ఇది స్థానిక ప్రజల కోసం మాత్రమే అని చెప్పేశారు" అని సురీందర్ మనుమడు సంప్రీత్ సింగ్ చెప్పారు.

వెంటిలేటర్ లేకుండా సురీందర్ ప్రాణాలు కాపాడడం అసాధ్యం అని డాక్టర్లు చెప్పారు.

సురీందర్ మనుమలు, వాళ్ల స్నేహతులు ఆయన చెయ్యి పట్టుకుని మీకేం కాదు, మేమున్నాం అని ధైర్యం చెబుతూ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరో రెండు రోజులు అలాగే తిరిగారు. కానీ, వాళ్లకు బెడ్ దొరకలేదు.

సురీందర్‌కు ఆక్సిజన్ సపోర్ట్ కొనసాగుతూ ఉండడం వలన ఆయన పరిస్థితి కాస్త మెరుగైంది. ఆక్సిజన్ స్థాయి 50 నుంచి 70కు పెరిగింది.

సురీందర్ సింగ్

ఇంతలో మళ్లీ ఆక్సిజన్ అయిపోయింది

మూడో రోజు వారికి ఎక్కడా ఆక్సిజన్ దొరకలేదు. ఆ యువకుల ధైర్యం సన్నగిల్లిపోయింది.

సందీప్ నాకు ఫోన్ చేసి "అంకుల్ ఆరోగ్యం మెరుగవుతోంది కానీ మరో గంటలో ఆక్సిజన్ పూర్తిగా అయిపోతుంది" అని వణుకుతున్న గొంతుతో చెప్పారు.

ఆ ముందు రోజే నాకు జీబీ పంత్ ఇంజనీరింగ్ కాలేజీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ జోషిల్‌తో పరిచయమైంది.

డాక్టర్ జోషిల్ (నలుపు చొక్కా వేసుకున్న వ్యక్తి)

ఆయన ఆక్సిజన్ సిలిండర్లు నింపే ఏర్పాటు చేస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారు.

ఆయనకు చెప్తే, వెంటనే ఒక సిలిండర్ సురీందర్ ఇంటికి చేర్చారు.

ఆయన ఇప్పటివరకు సురీందర్‌కు రెండు సిలిండర్లు పంపించగలిగారు.

నాలుగో రోజు, ఐదో రోజు కూడా సురీందర్ సింగ్‌కు ఎక్కడా బెడ్ దొరకలేదు.

ఐదో రోజుకు సురీందర్ పరిస్థితి కొంత మెరుగైందని డాక్టర్లు చెప్పారు. అయితే, అప్పటికీ ఆయన పూర్తిగా ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారు.

సురీందర్ సింగ్

చివరకు బెడ్ దొరికింది

శుక్రవారం రాత్రి దిల్లీలో సురీందర్‌కు ఒక ఆస్పత్రిలో బెడ్ దొరికింది.

అప్పుడు ఆయన ఆక్సిజన్ స్థాయి 70-80 మధ్యలో ఊగిసలాడుతూ ఉంది. ఆయనకు వెంటిలేటర్ అవసరం లేకపోయింది.

చందీప్, ఆయన స్నేహితులు ఇంకా ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటివరకూ సురీందర్‌కు ఎనిమిది జంబో ఆక్సిజన్ సిలిండర్లు వాడారని చందీప్ తెలిపారు.

సురీందర్ సింగ్

"గురుద్వారా నుంచి కూడా మాకు సిలిండర్లు పంపారు. ఈ సమయంలో మాకు సహాయం చేసిన వాళ్లందరూ దేవుళ్లతో సమానం" అని చందీప్ అన్నారు.

"ఈ పది రోజుల్లో మాకు ప్రభుత్వం ఎక్కడా కనిపించలేదు. మా వీధి వాళ్లందరూ కలిసి మా అంకుల్‌ను బతికించుకోడానికి ఎలా ప్రయత్నించామో ప్రభుత్వం కూడా అలా చేయొచ్చు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఏ సహాయం చేయకుండా మమ్మల్ని విధికి వదిలేసిందని అనిపిస్తోంది" అని చెబుతూ చందీప్ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.

ఇప్పుడు సురీందర్ ఆరోగ్యం మెరుగవుతోందని చెప్పారు.

బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ "మా అంకుల్ బతకడం కష్టమని ఆస్పత్రిలో చెప్పేశారు. కానీ మేం ధైర్యం కోల్పోలేదు. ఆక్సిజన్ దొరుకుతున్నంత వరకు మా అంకుల్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాం" అని చందీప్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: An elderly man who stayed in an ambulance for ten days and wandered around hospitals after finding a ventilator bed in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X