• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా

By BBC News తెలుగు
|

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మూడో వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండొచ్చన్నది గత కొద్ది రోజులుగా వైద్య నిపుణులు పదే పదే చేస్తున్న హెచ్చరిక.

మొదటి వేవ్‌లో పిల్లల జోలికి రాకపోయినా రెండో వేవ్‌లో మాత్రం చాలా మంది చిన్నారులు, నెలల పిల్లలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. అయితే అందులో చాలా మందికి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రాగా.. మరి కొంత మందికి స్వల్ప లక్షణాలు కనిపించాయి.

అటువంటి వారందరికీ హోమ్ ఐసోలేషన్, తేలికపాటి వైద్యంతో నయమైపోతుందని వైద్యులు భరోసా ఇస్తూ వచ్చారు.

రెండో దశలో ఒకరికి వ్యాధి సోకితే అది కుటుంబం మొత్తానికి రావడం కూడా పిల్లలో ఈ వ్యాధి కనిపించడానికి ఒక కారణం.

ఇప్పటికే మూడో వేవ్ ఉద్ధృతిని ఊహించుకుంటూ కొంత మంది తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

తాజాగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌‌లలో రెండో వేవ్‌లో కోవిడ్ బారినపడిన చిన్నారుల సంఖ్యను పరిశీలిస్తే వారి ఆందోళనలో వాస్తవం ఎంతన్నది మనం అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అందించిన లెక్కల ప్రకారం జూన్ 4 నాటికి తెలంగాణలో 5,87,664 మంది కరోనా బారిన పడగ, అందులో 13.5 శాతం మంది అంటే సుమారు 80,000 మంది 20 ఏళ్ల లోపు వారే.

0-10 ఏళ్ల లోపు ళ్లు 2.9 శాతం మంది. 11- 20 ఏళ్ల లోపు వయస్సు వాళ్లు 10.6 శాతం మందికి కరోనా సోకింది.

2021లో వచ్చిన సెకెండ్ వేవ్‌లో చిన్నారుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జూన్ 3 నాటికి, కరోనా ఫస్ట్ వేవ్ లో 0-10 ఏళ్ల లోపు వాళ్లు 3.28 శాతం మంది కరోనా బారిన పడ్డారు.

11- 20 ఏళ్ల లోపులో వయస్సు వాళ్ళులో 9.18 శాతం మందికి కరోనా సోకింది.

ఇక సెకండ్ వేవ్ లో 0-10 ఏళ్ల మధ్య ఉన్న వయసు వారులో 3.02 శాతం మందికి కరోనా వచ్చింది.

11-20 ఏళ్ల మధ్య వయసు వారిలో 9.18 శాతం మంది కరోనా బారిన పడ్డారు.

ఎన్నో సందేహాలు

పిల్లలపై ఇప్పటి వరకు అంత ప్రభావం చూపని కరోనా ఇప్పుడు ఎలా ప్రాణాంతకం కాబోతోంది? నిజంగానే ఈసారి పిల్లలే కరోనాకి టార్గెట్ కాబోతున్నారా?

వ్యాధి తీవ్రతని పిల్లలలో గుర్తించడం ఎలా? తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులలో చిన్నారులకు సరిపడా బెడ్లు, మందులు ఉన్నాయా?

అసలు మన పిల్లలు, మనం దీనిని ఎదురుకోవడానికి సిద్దంగా ఉన్నామా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది తల్లిదండ్రుల్లో మెదులుతున్నాయి.

తల్లీ బిడ్డ

ఎందుకు అంత ప్రమాదకరం?

కరోనా వ్యాపించే తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు దీని బారిన పడటానికి కారణమిదేనని IAP -TCB (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెడియాట్రీషియన్ - హైదరాబాద్ , సికింద్రాబాద్) మాజీ అధ్యక్షులు, నియో చిల్డ్రన్ హాస్పిటల్ ఎండి డా. మంచుకొండ రంగయ్య చెప్పారు.

"మ్యుటేషన్ ఎలాంటి రూపం దాల్చుతుంది అని ఇప్పుడే చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా పిల్లలకి వ్యాక్సీన్ వేయడం చాలా అవసరం. పిల్లలకు వ్యాక్సీన్ వేసేవరకూ కరోనా బారిన పడకుండా కాపాడుకోవడం తప్పనసరి. 3వ దశ వస్తే పిల్లలపై ఉండే ప్రభావం ఎంత అన్నది చెప్పడం కష్టం, కానీ దానికి సంభంధించిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం" అని ఆయన బీబీసీతో అన్నారు.

"మొదటి వేవ్ లో పెద్దలు తీసుకున్న జాగ్రత్తలు రెండో దశలో పెద్దగా కనపడ లేదు. పిల్లలో ఎక్కువగా ఈ వ్యాధి సోకడానికి ఇది కూడా ఒక కారణం" అని హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇన్ స్టాఫ్ కాలేజీ , డైరెక్టర్ డా. సుబోధ్ కాంత్ మూతన్ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు ఏంటి ? సరిపడా బెడ్లు , మందులు ఉన్నాయా ?

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పిల్లల కోసం ముందు జాగ్రత్తలు చేపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 1200 పడకలతో నీలోఫర్ ఆసుపత్రిలో సదుపాయాలు సమకూర్చింది. గాంధీ ఆసుపత్రిని కూడా నీలోఫర్‌తో పాటు నోడల్ సెంటర్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుoది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కమిటీ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 బెడ్లు 15 రోజుల్లో ఏర్పాటు చేశారు. కానీ ఇవి సరిపోవని, వాటితో పాటు పిల్లలకి కావాల్సిన మందులు అలాగే సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం చాలానే ఉంది అని అంటున్నారు నిపుణులు.

"ఆసుపత్రులలో కేవలం బెడ్లు మాత్రమే కాకుండా పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఉండే అంశంపైనా దృష్టి పెట్టాలని మానసిక వైద్య నిపుణులు పూర్ణిమ నాగరాజ బీబీసీతో అన్నారు,

"పిల్లల కోసం కొన్ని టీవీ స్క్రీన్స్, వాళ్ళకు నచ్చే కార్టూన్స్ చూపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. ఒత్తిడికి, మానసిక వ్యాధులకు లోను కాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సైకాలజీ చదివే విధ్యార్థుల సహాయం కూడా తీసుకొని ఈ ఆసుపత్రులని పిల్లలకి అనుకూలంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆమె సూచించారు.

పిల్లలపై ప్రభావం

పిల్లలలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది అని తెలుసుకోవడం ఎలా ?

ఈ మధ్య కాలంలో పిల్లలకి కరోనా వచ్చినప్పుడు ఒక పారాసెటిమాల్ ఇస్తే సరిపోతుంది, కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు. కానీ పిల్లల్లో కరోనా తీవ్రత పెరిగి MIS -C వైపు దారి తీసే అవకాశం ఉందా ? హాస్పిటల్ లో చేర్చాల్సిన అవసరం ఎంత ఉంది అని ఎలా గుర్తించాలి? ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటున్నాయి.

సాధారణంగా పిల్లల్లో జ్వరంతో కరోనా మొదలవుతోంది, కొంత మందికి విరోచనాలు కూడా వస్తుంటాయి. వాటిని తగ్గించడానికి సాధారణంగా డాక్టర్లు మందులు సూచిస్తారు.

అయితే "MIS -C లక్షణాలు ఉన్నప్పుడు, గుండె కొట్టుకోవడం తగ్గడం, ఛాతీలో నొప్పి, చేతులు వాపులు, వేళ్ళు -పెదాలు నీలం రంగులో మారడం , మూత్ర సమస్య, కళ్ళు ఎర్రగా అవ్వడం, ఆయాసం రావడం, విపరీతంగా దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి". అని డాక్టర్ రంగయ్య చెప్పారు.

కానీ ఇలాంటి లక్షణాలు ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో ఒక్కరిలోనో, ఇద్దరిలోనో కనిపిస్తాయి. వాటి గురించి తల్లిదండ్రులు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఇలాంటి లక్షణాలు కనిపించినా తొలి దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని డాక్టర్ రంగయ్య బీబీసీకి చెప్పారు.

పిల్లల్లో ఎంఐఎస్-సి

మానసిక ఒత్తిడిని తట్టుకోవడం ఎలా ?

అయితే కరోనా మహమ్మారి కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ మనుషుల్ని కుంగదీస్తోందని అంటున్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ పూర్ణిమా నాగరాజ.

"ఇప్పటికే చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను, తమ బంధువులను కోల్పోవడం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు, ఇలాంటి సమయంలో వాళ్ళకే ఈ వ్యాధి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కరోనా బారిన పడిన పిల్లలు బలహీనత, ఏకాగ్రత, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంత మంది పిల్లలు అసలు ఎవరైన బయట వాళ్లు వస్తే తమకు ఎక్కడ సోకుతుందోననే భయంతో గదిలోకి వెళ్లి దాక్కుంటున్నారు" అని చెప్పారు.

శారీరకంగా, మానసికంగా పిల్లల్ని తగిన విధంగా కాపాడుకోవడంతో పాటు ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వారి బాల్యం పై కూడా దృష్టి పెట్టాలని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు.

పొరపాటున వారు కరోనా బారిన పడినప్పటికీ మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందంటూ వాళ్లను పదే పదే నిందించడం విక్టిమ్ షేమింగ్ చేయడమే అని చెబుతున్నారు.

"పిల్లలకు తల్లితండ్రులే బలం.. బలహీనత.. కూడా! ఈ విషయాన్ని ప్రతి తల్లి-తండ్రి గుర్తుంచుకోవాలి" అని డాక్టర్ పూర్ణిమా నాగరాజ సూచించారు.

ప్రభుత్వాలు, ఆసుపత్రులే కాదు, పిల్లలు - తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితులని ఎదురుకోవడానికి సంసిద్ధoగా ఉండాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు.

జింక్, కాల్షియమ్, విటమిన్ -డి, కలిగిన పౌష్టిక ఆహారం పిల్లలు, పెద్దలు తీసుకోవడo ఎంతో ఉత్తమం . ప్రాణాయామం, వ్యాయామం చేస్తూ పిల్లలకి కూడా నేర్పించడం వల్ల సానుకూల పరిణామాలు కనపరుస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

అంతే కాదు , వాళ్లకి సమయం కేటాయించడం ఎంతో ముఖ్యం . చిన్నారులకు కుటుంబ విలువలతో పాటు , ఓంటరిగా ఉండవలిసి వస్తే భయపడాల్సిన అవసరం లేదని మనోధైర్యం నింపాలి. ఒంటరిగా ఉన్నా తను తనలోని సృజనాత్మకతను ఎలా పెంపొందించుకోవచ్చో చెప్పాలి అని మానసిక వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: How to protect children from the third wave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X