• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో కోవిడ్‌: ‘ఎక్కడ చూసినా అంబులెన్సులు, శవాలే కనిపిస్తున్నాయి.. చనిపోయిన వారిని తీసుకెళ్లడానికీ ఎదురుచూడక తప్పడం లేదు’

By BBC News తెలుగు
|

దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారిపోతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.

రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడి ప్రభుత్వం అంటోంది.

కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు బీబీసీతో పంచుకున్న విషయాలు ఇవి.

కన్వల్‌జీత్ సింగ్ తండ్రి 58 ఏళ్ల నిరంజన్ పాల్ ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి వెళుతున్న దారిలో అంబులెన్స్‌లోనే మరణించారు.

అప్పటికి వాళ్లు నాలుగు ఆస్పత్రులకి వెళ్లి బెడ్స్ లేని కారణంగా వెనుదిరిగారు.

"ఇది నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. నా తండ్రికి సరైన సమయంలో వైద్యం అంది ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవి. పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రభుత్వం.. ఎవరూ కూడా మాకు సహాయం చేయలేదు" అని కన్వల్‌జీత్ అన్నారు.

గత సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 8,51,620 కోవిడ్ కేసులు, 9,830 మరణాలు నమోదయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్‌తో పోల్చుకుంటే ఫస్ట్ వేవ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా లేదు.

GETTY IMAGES

దేశంలోనే పెద్ద రాష్ట్రం

24 కోట్ల జనాభాతో ఉత్తర్‌ప్రదేశ్ భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ను ఒక ప్రత్యేక దేశంగా వేరు చేస్తే.. చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియాల తరువాత ప్రపంచంలో ఐదవ అతి పెద్ద దేశంగా ఆ వరుసలో నిలుస్తుంది.

పాకిస్తాన్, బ్రెజిల్‌ల కన్నా కూడా పెద్ద దేశం అవుతుంది.

రాజకీయంగా కూడా ఉత్తర్‌ప్రదేశ్ చాలా ముఖ్యమైనది. యూపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో సహా 80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,91,000 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య వేలల్లో ఉంటోంది.

ఈ కారణాల వల్ల రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ కుదేలైపోయింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో సహా, ఆయన కేబినెట్ అనుచరులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అనేకమంది కోవిడ్ బారినపడ్డారు.

కొద్ది రోజుల క్రితం కాన్పూర్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో ప్రభుత్వ లాలా లజపత్ రాయ్ ఆస్పత్రి పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి నేల మీద పడి ఉన్నారు. మరొక వృద్ధుడు కాస్త దూరంలో బెంచీపై కూర్చుని ఉన్నారు. వారిద్దరూ కోవిడ్ బాధితులే. వాళ్లను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు పడకలు ఖాళీగా లేవు.

బెడ్స్ లేవంటూ రెండు ఆస్పత్రులు తన తల్లిని చేర్చుకోలేదని ప్రభుత్వ కాన్షీరాం ఆస్పత్రి బయట ఒక యువతి కన్నీళ్లు పెట్టుకుంది.

"పడకలు లేవని వారు చెప్తున్నారు. కనీసం రోగిని ఆస్పత్రిలో చేర్చుకుని నేల మీదైనా పడుకోబెట్టి కొంత చికిత్స అందించండి. నాలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అనేకమంది ఆస్పత్రుల నుంచి విచారంగా బయటికి వస్తూ కనిపిస్తున్నారు. తగినన్ని పడకలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అవెక్కడున్నాయో చూపించండి. దయచేసి నా తల్లికి చికిత్స అందించండి" అంటూ ఆ యువతి విలపించింది.

'సహాయం చేయడానికి ఎవరూ రాలేదు'

రాజధాని లఖ్‌నవూ పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది.

కారులో కూర్చుని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సుశీల్ కుమార్ శ్రీవాస్తవ అనే పెద్దాయన ఫొటో అందరినీ కదిలిస్తోంది.

ఆయన కుమారులు ఆయన్ను ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిప్పుతూనే ఉన్నారు. గానీ బెడ్ దొరకలేదు. మర్నాడు ఒక ఆస్పత్రిలో బెడ్ దొరికింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు.

సుశీల్ కుమార్ కుమారుడు ఆశిష్ పూర్తిగా కుంగిపోయారు.

"ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను" అని చెప్పారు.

రిటైర్డ్ జడ్జ్ రమేష్ చంద్ర చేతి రాతతో ఉన్న ఒక నోట్‌ను సోషల్ మీడియాలో వందలమంది షేర్ చేశారు.

కరోనాతో మరణించిన భార్య మృతదేహాన్ని తమ ఇంటి నుంచి తీసుకువెళ్లమని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

దాంతో ఆయన స్వహస్తాలతో ఒక లేఖ రాసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"నాకు, నా భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న పొద్దున్నుంచి ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లకు కనీసం 50 సార్లు కాల్ చేసి ఉంటాను. మాకు మందులు ఇవ్వడానికిగానీ, మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికిగానీ ఎవరూ రాలేదు. ప్రభుత్వం స్పందించని కారణంగా ఇవాళ పొద్దున్న నా భార్య చనిపోయింది" అని ఆ లేఖలో రాశారు.

ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో గత గురువారం 70 ఏళ్ల నిర్మలా కపూర్ కరోనాతో ఒక ఆస్పత్రిలో మరణించారు.

ఆమె కుమారుడు విమల్ కపూర్ మాట్లాడుతూ "పరిస్థితి చాలా భయంకరంగా ఉంది" అని చెప్పారు.

"చాలామంది అంబులెన్సుల్లోనే చనిపోవడం నా కళ్లారా చూశాను. పడకలు లేవని రోగులను ఆస్పత్రుల నుంచి పంపించేస్తున్నారు. మెడికల్ షాపుల్లో మందులు దొరకట్లేదు. ఆక్సిజన్ దొరకడం గగనమైపోతోంది" ఆయన తెలిపారు.

తన తల్లిని శ్మశానవాటికకు తీసుకెళితే అక్కడ శవాలు కుప్పలుగా పడి ఉన్నాయని విమల్ చెప్పారు.

చితి పేర్చేందుకు వాడే కలప ధర మూడు రెట్లు పెరిగింది. దహన సంస్కారాల కోసం 5-6 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది.

"ఇలాంటి పరిస్థితిని నేను ఇంతకుముందెప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా అంబులెన్సులు, శవాలే కనిపిస్తున్నాయి" అని విమల్ చెప్పారు.

కోవిడ్ మృతుల కథలు, దానివల్ల నాశనమైన కుటుంబాల వెతల మధ్య కరోనా ఊహించని వేగంతో వ్యాప్తిస్తోంది.

ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 30,596 రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

తగినన్ని కోవిడ్ పరీక్షలు చేయకుండా, ప్రైవేటు ల్యాబ్‌ల డాటా కలుపుకోకుండా, కావాలనే కోవిడ్ కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వీరి ఆరోపణలను కొట్టి పారేయలేం.

మేము మాట్లాడినవారిలో చాలామందికి పరీక్షలు చేయలేదు. పాజిటివ్ వచ్చిన తరువాత కూడా వారి డాటాను ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి ఎక్కించలేదని తెలుస్తోంది.

లఖ్‌నవూకు చెందిన 62 ఏళ్ల అజయ్ సింగ్ తన భార్యకు పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చూపించారు. కానీ ప్రభుత్వ రికార్డులలో ఆమె వివరాలు ఎక్కడా కనిపించలేదు.

కోవిడ్ పాజిటివ్ లిస్ట్‌లో నిరంజన్ పాల్, నిర్మలా కపూర్‌ల పేర్లు చేర్చారు. కానీ వారి మరణ ధృవీకరణ పత్రాల్లో కరోనావైరస్ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు.

ప్రభుత్వ గణాంకాలపై మీడియా కూడా సందేహాలు వ్యక్తం చేస్తోంది.

మీడియా రిపోర్టుల ప్రకారం.. లఖ్‌నవూ, వారణాసి శ్మశానవాటికల్లో దహనమవుతున్న మృతదేహాల సంఖ్యకు, ప్రభుత్వ గణాంకాల్లో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్యకు పొంతన కుదరట్లేదు.

ప్రభుత్వం అవకాశాన్ని జారవిడుచుకుంది

"ప్రస్తుత పరిస్థితి అసాధారణంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడమే కాక డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్తలు అనేకమంది కరోన బారిన పడుతున్నారు. 200 శాతం పని చేయాల్సిన చోట, 100 శాతం కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆరోగ్య రంగం మొత్తం మ్యాన్‌పవర్ మీదే ఆధారపడి ఉంది" అని వారణాసిలోని హెరిటేజ్ హాస్పిటల్స్ డైరెక్టర్ అన్షుమన్ రాయ్ తెలిపారు.

సెకండ్ వేవ్ ప్రభావాన్ని అంచనా వేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

సెప్టెంబర్, ఫిబ్రవరి మధ్య పరిస్థితి కొంత మెరుగైందని, ఆ సమయంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిందని విశ్లేషకులు అంటున్నారు.

ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడంతోపాటూ మందులను నిల్వ చేసి ఉండొచ్చు. అవేమి చేయకుండా ఉత్తర్ ప్రదేశ్ అవకాశాన్ని జారవిడుచుకుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid in Uttar Pradesh: ‘Ambulances and corpses can seen everywhere
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X