• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్ - ఒమిక్రాన్: ‘నాకు కరోనా తగ్గి ఏడాదైంది.. కానీ ఇప్పటికీ వాసన చూడలేకపోతున్నా’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

''నాకు కరోనా వచ్చి దాదాపు ఏడాదైంది. ఇప్పటికీ నేను వాసన చూడలేకపోతున్నా. మందులు, ఇంజెక్షన్లు, ఆయుర్వేద చికిత్సతో కూడా ఏం ప్రయోజనం లేదు'' అని బీబీసీ మరాఠీతో నాసిక్‌కు చెందిన మహేష్ మహాలే చెప్పారు.

కరోనా సోకినవారు వాసన కోల్పోవడం సాధారణ లక్షణమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డాక వాసన చూడలేకపోతున్నారు.

''కొంతమంది తాత్కాలికంగా వాసనను కోల్పోతుంటారు. మరికొందరు కరోనా నుంచి బయటపడిన రెండు, మూడు నెలల్లో తిరిగి వాసన చూడగలుగుతారు'' అని నిపుణులు చెబుతున్నారు.

అసలు మహేశ్ మహాలే విషయంలో ఏం జరిగింది? సంవత్సరం గడిచాక కూడా ఆయన ఎందుకు వాసన చూడలేకపోతున్నారు? దీని గురించి తెలుసుకోవడానికి నిపుణులతో మాట్లాడాం.

'కరోనా వచ్చి ఏడాది అయింది... వాసన రావట్లేదు'

కరోనా సెకండ్ వేవ్ సమయంలో 28 మార్చి 2021న నాసిక్‌కు చెందిన మహేశ్ మహాలేకు కరోనా నిర్ధారణ అయింది.

'ఆ రోజు ఇంట్లో అగరబత్తులు వెలిగించారు. కానీ నాకు వాసన రాలేదు' అని నాటి రోజును మహేశ్ గుర్తు చేసుకున్నారు.

''ఇంట్లోని వారందరూ అగరబత్తుల సుగంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇల్లు మొత్తం సువాసన వస్తోంది. నీకెందుకు వాసన రావట్లేదు'' అని నన్ను అడిగారు.

''ఆ క్షణమే, నాకు ఏదో తేడాగా అనిపించింది. ఆ తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలాను'' అని మహేశ్ చెప్పారు.

చికిత్స అనంతరం మహేశ్ కోలుకున్నారు. కానీ వాసన చూసే శక్తి మాత్రం తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ సాధారణం అవుతుందని వారు అనుకున్నారు. కరోనా తగ్గి 10 నెలలు దాటింది. కానీ వాసన మాత్రం గ్రహించలేకపోతున్నారు.

''కొంతమంది కనీసం 10 నుంచి 20 శాతం అయినా వాసన చూడగలుగుతారు. నాకు అది కూడా రావట్లేదు'' అని మహేశ్ పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా వాసన ఎందుకు రావట్లేదు? దీని గురించి తెలుసుకునేందుకు మహేశ్ ఓ వైద్యున్ని సంప్రదించారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం.

ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు విటమిన్-సి మాత్రలు వాడానని మహేశ్ చెప్పారు. అయినప్పటికీ వాసన తిరిగి రాలేదని పేర్కొన్నారు.

కరోనా రోగి సాధారణంగా రుచి, వాసన కోల్పోతాడు. ఇప్పుడు మహేశ్ రుచి తెలుసుకోగలుగుతున్నారు. కానీ వాసన రావట్లేదని చెబుతున్నారు.

కరోనా వస్తే వాసన ఎందుకు కోల్పోతాం?

కరోనా తొలి, రెండో వేవ్‌లో రుచి, వాసన కోల్పోయినట్లు చాలామంది రోగులు పేర్కొన్నారు.

''ముక్కు ద్వారా కరోనా మన శరీరంలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో ముక్కులో ఉండే నాడులపై వైరస్ ప్రభావం చూపుతుంది. నాడులను వైరస్ ధ్వంసం లేదా నాశనం చేస్తుంది. దీనివల్ల మనం వాసన చూసే శక్తిని కోల్పోతాం'' అని నిపుణులు చెబుతున్నారు.

సర్ జె.జె ఆసుపత్రిలో ముక్కు-చెవి-గొంతు వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ శ్రీనివాసన్ చవన్ మాట్లాడుతూ... ''వైద్య పరిభాషలో దీన్ని 'వైరల్ న్యూరిటిస్'గా పిలుస్తారు. నాడులపై దాడి చేసి వైరస్ దాన్ని దెబ్బతీస్తుంది. అక్కడ నరం ఉబ్బిపోయి పనిచేయడం మానేస్తుంది'' అని చెప్పారు.

ముక్కులో ఉండే నరాలు మరింత సున్నితంగా ఉంటాయి. ముక్కులోని సిలియరీ కణాలకు గాయమైతే వాసన చూసే శక్తిని కోల్పోతాం.

వాసన కోల్పోవడం లేదా వాసన చూసే శక్తి తగ్గిపోవడాన్ని వైద్య పరిభాషలో 'అనోస్మియా'గా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు తాత్కాలికంగా వాసన కోల్పోతాం. కానీ కొంతమంది రోగుల్లో నెలల తరబడి ఈ స్థితి కొనసాగుతుంది అని నిపుణులు పేర్కొంటారు.

వాసన కోల్పోవడం

కరోనా వల్ల మాత్రమే కాకుండా, సాధారణ ఫ్లూ లేదా జలుబు, సైనస్ ఇన్‌ఫెక్షన్, అలర్జీల వల్ల కూడా వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోతుంటాం.

''గుండె జబ్బు బారినపడి, ముక్కు ద్వారా బయట నుంచి ఆక్సీజన్ అందించిన రోగుల నాసికా ఎముకలో రంధ్రాలను గుర్తించాం. మ్యూకోసల్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ విధంగా జరుగుతుంది'' అని ముంబైలోని కేఈఎం ఆసుపత్రి ముక్కు-చెవి-గొంతు నిపుణురాలు, డాక్టర్ నీలమ్ సేథీ పేర్కొన్నారు.

నాసికా ఎముక చిన్నచిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. దీనివల్ల ముక్కులో గాలిచేరి పొడిబారుతుంటుంది.

కరోనా తగ్గిపోయాక ఎంతకాలం వరకు వాసన గ్రహించలేం?

కరోనరీ (గుండెకు రక్త సరఫరా చేసే ధమనులకు సంబంధించినది) వ్యాధి లేని రోగులు సాధారణంగా కొన్ని రోజుల్లోనే వాసన గ్రహించే సామర్థ్యాన్ని తిరిగి పొందుతారు. కొంతమంది రోగులు కోలుకున్న రెండు మూడు నెలల తర్వాత వాసన చూడగలుగుతారు.

యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎజైల్ ప్రైవేట్‌కు చెందిన పరిశోధకురాలు కార్ల్ ఫిల్పాట్, 30 మంది వాలంటీర్లపై పరిశోధన చేశారు. ''కరోనా వైరస్ బారిన పడి తిరిగి కోలుకున్న కొన్ని వారాల అనంతరం వారు తిరిగి రుచి, వాసన సామర్థ్యాన్ని పొందారని'' ఆమె చెప్పారు.

కరోనా

''కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా రోగులు ముందులాగే వాసనను అనుభూతి చెందుతారు. కానీ కొంతమంది రోగులు మాత్రం చాలా రోజుల తర్వాత కూడా వాసనను గ్రహించలేకపోతారు'' అని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలోని ముక్కు-చెవి-గొంతు నిపుణులు, డాక్టర్ ప్రశాంత్ అన్నారు.

వెబ్‌యాడ్ ప్రకారం, కరోనా తగ్గిన ఐదు నెలల తర్వాత కూడా కొంతమంది రోగులు వాసన చూడలేకపోతున్నట్లు కెనడా పరిశోధకులు కనుగొన్నారు.

''కరోనా వైరస్ కచ్చితంగా మెదడుకు అనుసంధానమైన ఘ్రాణ నాడులపై దాడి చేస్తుంది. వాసన, రుచి చూడటంలో ఇది చాలా ముఖ్యమైనది'' అని ఈ పరిశోధన అధిపతి డాక్టర్ నికోలస్ డప్రీ చెప్పారు.

''ఘ్రాణ నాడుల్లోని కొన్ని కణాలను వైరస్ నాశనం చేస్తుండొచ్చు. అందువల్లే సుదీర్ఘ కాలం పాటు వాసన కోల్పోవడం జరుగుతుందని'' పరిశోధకులు చెబుతున్నారు.

వాసనను గుర్తించడానికి ఉపయోగపడే ముక్కులోని డ్రై నరాలు కూడా ఒక్కోసారి ఈ స్థితికి కారణమవుతాయి. ''డ్రై నరాలు దెబ్బతినడం వల్ల సుదీర్ఘకాలం, కొన్ని సంవత్సరాల పాటు వాసన కోల్పోతాం'' అని డాక్టర్ నీలమ్ సేథీ చెప్పారు.

కరోనా సోకని కొంతమంది రోగుల్లో కూడా వాసన కోల్పోవడం, రుచి మందగించడం లాంటి లక్షణాలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

వాసన చూసే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి చికిత్స ఉందా?

కరోనా సోకడం వల్ల వాసన కోల్పోయిన వ్యక్తులు 'స్మెల్ థెరపీ' తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోగులు, వివిధ రకాల వాసనలు గుర్తించేందుకు 'స్మెల్ థెరపీ' సహకరిస్తుంది. కొన్ని నెలల పాటు ఈ థెరపీని అనుసరించాలి. దీనివల్ల వాసనలు గుర్తించే సామర్థ్యాన్ని మెదడు తిరిగి పొందుతుంది.

''రోజులో మూడుసార్లు వివిధ రకాల వాసనలు చూడాల్సిందిగా రోగులకు చెబుతారు. దీనివల్ల ముక్కులో బ్లాక్ అయిన భాగాలను పూర్వ స్థితికి తీసుకురావడంతో పాటు, వాసన గ్రహించే శక్తిని తిరిగిపొందవచ్చు'' అని వైద్యులు చెబుతారు.

కరోనా

ఈ థెరపీ ఖరీదైనదేం కాదని నిపుణులు చెబుతున్నారు. వాసన గ్రహించే శక్తిని తిరిగి పొందడంలో ఇది రోగులకు సహాయపడుతుంది. స్మెల్ థెరపీలో నారింజ, పుదీనా, కాఫీ, అల్లం వంటి పదార్థాల వాసనలు చూపిస్తుంటారు. ఇలా కొన్ని నెలల పాటు చేయాలని నిపుణులు పేర్కొన్నారు.

''ఆరు నెలల థెరపీ తర్వాత 90 శాతం రోగులు పూర్తిగా కోలుకున్నారు. వారు మునుపటిలా వాసన చూసే సామర్థ్యాన్ని గ్రహించారు'' అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏజైల్ యూనివర్సిటీ రీసెర్చర్ కార్ల్ చెప్పారు.

మెదడు, వాసనలను గుర్తించడంలో స్మెల్ థెరపీ ఉపయోగపడుతుందని కార్ల్ స్పష్టం చేశారు.

''ముక్కులో కొన్ని చుక్కల విటమిన్ 'ఎ' వేయడం వల్ల కూడా రోగులకు ప్రయోజనం కలుగుతుంది'' అని యూకే అధ్యయనం చెబుతోంది.

ఎండోస్కోపీ ద్వారా ముక్కును పరిశీలించడం వల్ల కూడా సమస్య ఏమిటో తెలుసుకోవచ్చని డాక్టర్ నీలమ్ చెప్పారు.

కరోనా కారణంగా వాసన కోల్పోయామా? లేక మరేదైన ఇతర కారణముందా అనేది ముందుగా తెలుసుకోవాలి. సీటీ స్కాన్, ఎంఆర్ఐ నివేదికలు సాధారణంగానే ఉంటే, కరోనా కారణంగానే వాసన కోల్పోయామని మనం ఊహించవచ్చు.

సుదీర్ఘ కాలం వాసన కోల్పోవడానికి వేరే కారణాలుంటాయా?

కరోనా వైరస్ సోకిన తర్వాత మహేశ్ మహాలే వాసన గ్రహించే శక్తిని కోల్పోయారు. వాసన కోల్పోవడానికి వేరే కారణాలు కూడా ఉంటాయా? నిపుణుల ద్వారా దీనికి సమాధానం తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం.

అలర్జీలు, ధూళి కణాలు, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా రోగులు వాసన కోల్పోవడానికి కారణమవుతాయి.

ముక్కులో ఏర్పడే చిన్న కణతులు కూడా వాసన కోల్పోవడానికి కారణం అవుతాయని ముక్కు-చెవి- గొంతు నిపుణులు చెబుతున్నారు.

''అలర్జీలతో బాధపడే వారికి ముక్కులో చిన్న కణతులు ఏర్పడతాయి. కొన్నిసార్లు వీటి వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇవి సమస్యల్ని సృష్టిస్తాయి'' అని డాక్టర్ శ్రీనివాస్ చవన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid - Omicron: I got cured from Corona a year back, but still unable to smell
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X